టెక్స్‌టైల్ పార్క్‌కు కరెంట్ షాక్
వారంలో రెండు రోజులు పవర్ హాలీడే
రోజుకు 1.51 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తికి బ్రేక్
వ్యాపారులకు నష్టం.. కార్మికులకు కష్టం
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శివారులోని టెక్స్‌టైల్ పార్క్‌కు కరెంట్ షాక్ తగిలింది. సర్కారు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ప్రకటించింది. దీంతో శని, ఆదివారాల్లో రెండు రోజులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా టెక్స్‌టైల్ పార్క్‌లో వస్త్రోత్పత్తి నిలిపోవడంతో పాటు నేత కార్మికులకు ఉపాధి కరువవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ లోటు ఏర్పడడంతో ఆ ప్రభావం సిరిసిల్ల నేతన్నలపైనా పడింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్ సర్కారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు విద్యుత్ కోతల నుంచి మినహాయింపునిచ్చింది. వస్త్రపరిశ్రమకు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేసేందుకు ప్రత్యేక జీవో జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొరత వల్ల సర్కారు పవర్ హాలిడే ప్రకటించింది. దీనికితోడు సిరిసిల్ల పట్టణంలోని పవర్‌లూమ్ పరిశ్రమకు రోజుకు మూడు గంటలు విద్యుత్ కోత ఉంది. అనధికారికంగా మరో రెండు గంటలు కరెంటు సరఫరా నిలిచిపోతోంది.
వస్త్రోత్పత్తికి విఘాతం
టెక్స్‌టైల్ పార్క్‌లో 130 పరిశ్రమలు పనిచేస్తుండగా, 1,515 పవర్‌లూమ్స్ నడుస్తున్నాయి. ఆధునిక మగ్గాలపై సూటింగ్, షర్టింగ్ ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో మగ్గంపై రోజుకు వంద మీటర్ల వస్త్రం తయారవుతుంది. పవర్ హాలిడేతో రోజుకు 1.51 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తికి విఘాతం కలుగుతోంది. రెండు రోజుల పాటు పవర్ హాలిడే ప్రకటించడంతో మూడు లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తి నిలిచిపోతోంది. పారిశ్రామికవేత్తలకు రూ. 51.50 లక్షల నష్టం వస్తోంది. కార్మికులకు సైతం కూలీలో రూ. 800 కోత పడుతోంది. దీంతో రెండువేల మంది కార్మికులు రూ.32 లక్షల మేర కూలీ కోల్పోతున్నారు.
ఆటుపోట్ల మధ్య సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ
సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో పరిశ్రమలు రాక అరకొర వసతులతో నెట్టుకొస్తున్న పార్క్‌ను కరెంటు కష్టాలు దెబ్బతీస్తున్నాయి. 2002లో టెక్స్‌టైల్ పార్క్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేశాయి. 220 పరిశ్రమలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్దేశించగా, ప్రస్తుతం 130 పరిశ్రమలు పనులు ప్రారంభించాయి. రెండువేల మంది కార్మికులు, రెండు షిఫ్టుల్లో పార్క్‌లో పనిచేస్తున్నారు. మరో ముప్పై పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి. టెక్స్‌టైల్ పార్క్‌లో రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టారు. పార్క్‌లో ఆధునిక రాపియర్ లూమ్స్‌పై వస్త్రోత్పత్తి చేస్తున్నారు. కార్మికులకు సగటున రోజుకు రూ.400 చొప్పున కూలి లభిస్తోంది.
రెండు రోజులు హాలిడే..
శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌కు పవర్‌హాలిడే అమలవుతోంది. ఈ మేరకు ఎన్‌పీడీసీఎల్ అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. విద్యుత్ లోటును అధిగమించేందుకే రెండు రోజులు పవర్ హాలిడే విధిస్తున్నారు. వీక్లీ హాఫ్‌గా ఒకరోజు, పవర్ హాలిడేగా మరో రోజు కోత తప్పదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇది అమలవుతోంది.
- రామకృష్ణ, సెస్ ఎండీ
మినహాయింపు ఇవ్వాలి
టెక్స్‌టైల్ పార్క్‌కు పవర్ హాలిడే నుంచి మినహాయింపు ఇవ్వాలి. మౌలిక వసతులు లేక ఇప్పటికే పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలు పూర్తిగా రాలేదు. ఉన్న వాటికి కరెంటు ఇవ్వకుంటే పరిశ్రమ సంక్షోభంలో పడుతుంది. ఇప్పటికే పార్క్‌లోని పరిశ్రమలకు విద్యుత్ రాయితీ రావడం లేదు. ఇలాగైతే పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. - అన్నల్‌దాస్ అనిల్, పారిశ్రామికవేత్త