సాక్షి, హైదరాబాద్: దేశమైనా, రాష్ట్రమైనా ప్రగతిపథంలో ఉందని చెప్పడానికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాన్ని ప్రామాణిక సూచికగా తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. రూ.3,12,398 తలసరి ఆదాయంతో, 2,126 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది..’అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంగళవారం గోల్కొండ కోట సాక్షిగా చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.
గతంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగానూ సీఎం ఇదే ప్రకటన చేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నిజంగానే దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్రం స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటించింది. అయితే, తలసరి విద్యుత్ వినియోగంలో మాత్రం తెలంగాణ అగ్రస్థానంలో లేదు. 2126 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో మనరాష్ట్రం జాతీయస్థాయిలో 10వ స్థానంలో ఉంది.
గత ఫిబ్రవరి 17న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ప్రకటించిన ‘అఖిల భారత విద్యుత్ గణాంకాలు–2022’ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలోని మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని 2020–21 వార్షిక విద్యుత్ సరఫరా గణాంకాల ఆధారంగా సీఈఏ తాజా నివేదిక ప్రకటించింది. జాతీయస్థాయిలో ఏటా వార్షిక విద్యుత్ గణాంకాలను సీఈఏ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంలో ఏడో స్థానంలో ఉందని సీఈఏ నివేదిక పేర్కొంటోంది.
తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు..?
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో చేసిన ప్రసంగంలో సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం ప్రసంగం కోసం సీఎంఓ ఎప్పటికప్పుడు అన్ని శాఖల నుంచి సమాచారం సేకరిస్తుండగా, అధికారులు తప్పుడు వివరాలు అందించి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలున్నాయి.
వ్యవసాయ విద్యుత్‌లో రాష్ట్రం అగ్రస్థానం
► రాష్ట్రాల్లో వివిధ కేటగిరీల వారీగా తలసరి విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే.. 592.24 యూనిట్ల తలసరి వ్యవసాయ విద్యుత్ వినియోగంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.
►గృహ కేటగిరీలో 813.94 యూనిట్ల తలసరి వినియోగంతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 340.62 యూనిట్లతో తెలంగాణ 5వ స్థానంలో ఉంది.
►వాణిజ్య కేటగిరీలో 273.11 యూనిట్ల వినియోగంతో గోవా అగ్రస్థానంలో, 128.81 యూనిట్ల వినియోగంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
►హెచ్‌టీ కేటగిరీలో పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో 1163.99 యూనిట్ల వినియోగంతో గోవా ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 299.19 యూనిట్ల వినియోగంతో పదోస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment