
సాక్షి, చెన్నై: భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ (58) గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన బలవన్మరణానికి అప్పులే కారణమని తేల్చారు. ఆర్థిక సమస్యల వల్లే చెన్నైలోని తన నివాసంలో చంద్రశేఖర్ గురువారం ఉరేసుకొని మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయన మరణవార్తతో తమిళనాడు క్రికెట్ సంఘం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కాంచీ వీరన్స్ జట్టును ఆయన కొనుగోలు చేశారు.
దీని నిర్వహణతో పాటు తన అకాడమీ కోసం బ్యాంకులు, సన్నిహితుల వద్ద రూ. 3 కోట్ల మేర అప్పు చేశారు. చివరకు చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చెన్నై రాయపేట ఆసుపత్రిలో శుక్రవారం చంద్రశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, క్రికెటర్లు దినేష్ కార్తీక్, మురళీ విజయ్, విజయ్ శంకర్‌లతో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం సభ్యులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment