న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు పెట్టుబడులున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. గతేడాది నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన కంపెనీ మే నెలలో ఐపీవో చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా తొలి రిటైల్ రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రిటైల్ రీట్.. 17 నిర్వహణలోగల షాపింగ్ మాల్స్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇవి 14 పట్టణాలలో 9.8 మిలియన్ చదరపు అడుగులలో విస్తరించి ఉన్నాయి.
వీటి విలువ రూ. 23,000 కోట్లు. బ్లాక్‌స్టోన్ స్పాన్సర్ చేసిన మూడో రీట్‌గా ఇది నిలవనుంది. ఇప్పటికే దేశీయంగా సంస్థకు పెట్టుబడులున్న రీట్ ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ లిస్టయ్యాయి. మరో కంపెనీ బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. ఇవన్నీ ఆఫీస్ ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ రియల్టీ ఆస్తులపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఐపీవో నిధులను కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించే వీలుంది. 2022 జూన్‌కల్లా రూ. 4,500 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment