చివరి రోజుకల్లా 3.6 రెట్లు బిడ్స్
అదే బాటలో ఆక్మే సోలార్
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూకి మెరుగైన స్పందన లభించింది. చివరి రోజు శుక్రవారానికల్లా 3.6 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ 16.01 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 57.53 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు అందాయి. క్విబ్ విభాగంలో 6 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.41 రెట్లు చొప్పున బిడ్స్ లభించాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 1.14 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. రూ. 371–390 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 11,327 కోట్లు సమకూర్చుకుంది. మంగళవారం (5న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,085 కోట్లు సమీకరించిన విషయం విదితమే. రూ. 95,000 కోట్ల విలువలో కంపెనీ ఐపీవోకు రావడం గమనార్హం!
ఆక్మే సోలార్... 2.75 రెట్లు స్పందన
పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ పబ్లిక్ ఇష్యూకి బాగానే ఆదరణ దక్కింది. చివరి రోజు శుక్రవారానికల్లా 2.75 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. కంపెనీ 5.82 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 16 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 3.54 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.97 రెట్లు చొప్పున బిడ్స్ నమోదయ్యాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 3.1 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం గమనార్హం! రూ. 275–289 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 2,900 కోట్లు సమకూర్చుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,300 కోట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment