ముంబై: డిజిటల్ ఐటీ సర్వీసుల కంపెనీ ఆర్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసినట్లు యూఎస్ పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా పేర్కొంది. ఇందుకు 35.9 కోట్ల డాలర్లు(రూ. 2,904 కోట్లు) చెల్లించనున్నట్లు వెల్లడించింది. కంపెనీలో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రమోటర్లు సతీందర్ సింగ్ రేఖీ తదితరులతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 1993లో రేఖి ప్రమోట్ చేసిన కంపెనీ డిజిటల్ ఐటీ సర్వీసులతోపాటు, ప్రొడక్ట్ ఇంజనీరింగ్‌లో ప్రత్యేకతను కలిగి ఉంది. నోయిడాకు చెందిన ఈ కంపెనీ టెక్నాలజీ, మీడియా, టెలికం, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాలలో 250 కస్టమర్లకు సేవలందిస్తోంది.
4,400 మంది సిబ్బంది
ఆర్ సిస్టమ్స్ 4,400 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దేశ, విదేశాలలో 18 డెలివరీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ సెప్టెంబర్‌తో ముగిసిన 12 నెలల కాలంలో కంపెనీ రూ. 1,445 కోట్ల ఆదాయం సాధించింది. ఇది 36 శాతం వృద్ధికాగా.. రేఖి తదితర ప్రమోటర్లు ప్రస్తుతం కంపెనీలో 52 శాతం వాటాను కలిగి ఉన్నారు. బ్లాక్‌స్టోన్ షేరుకి రూ. 245 చొప్పున వాటాను కొనుగోలు చేయనుంది. మిగిలిన వాటా కోసం షేరుకి రూ. 246 ధరలో డీలిస్టింగ్ ఆఫర్‌ను ప్రకటించనుంది.
తదుపరి రేఖి నాన్‌ఎగ్జిక్యూటివ్ సలహాదారుగా సేవలను కొనసాగించనున్నారు. కాగా.. బ్లాక్‌స్టోన్ ఐటీ, ఐటీ ఆధారిత సేవల దేశీ కంపెనీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటివరకూ 7 బిలియన్ డాలర్లు పంప్ చేసింది. ఎంఫసిస్, వీఎఫ్‌ఎస్, టాస్క్‌యూఎస్, ఐబీఎస్ సాఫ్ట్‌వేర్, ఇంటెలినెట్, సింప్లిలెర్న్ తదితర కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. బ్లాక్‌స్టోన్ సొంతం చేసుకోనున్న వార్తల ప్రభావంతో ఆర్ సిస్టమ్స్ కౌంటర్‌లో భారీ డిమాండ్ నెలకొంది. వెరసి బీఎస్‌ఈలో షేరు తొలుత 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 281ను దాటింది. చివరికి 16 శాతం జంప్‌చేసి రూ. 271 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment