IT systems
-
ఇన్సూరెన్స్ పాలసీదారుల డేటా లీక్
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌కి సంబంధించిన ఐటీ సిస్టమ్స్‌లో డేటా లీక్ ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉల్లంఘనల తీవ్రత, ప్రభావాలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు సంస్థ వెల్లడించింది. కస్టమర్లకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు ఒక గుర్తు తెలియని సోర్స్ నుంచి వచ్చినట్లు, ఎవరో దురుద్దేశంతోనే ఇదంతా చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. వీటికి మూలకారణాలను తెలుసుకునేందుకు, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ నిపుణులను సంప్రదించినట్లు వివరించింది. పాలసీదారుల డేటా లీక్ ఉదంతాల నేపథ్యంలో బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ఇటీవలే ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయించాల్సిందిగా రెండు బీమా సంస్థలను ఆదేశించిన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఉదంతం ప్రాధాన్యం సంతరించుకుంది. -
పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్
పాలసీదారుల డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలని సూచించింది. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించింది.ఐఆర్డీఏఐ ప్రకటనలోని వివరాల ప్రకారం..‘డేటా ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది. బీమా తీసుకున్నవారి డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో రెండు సంస్థలకు(పేర్లు వెల్లడించలేదు) చెందిన ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలి. ఇందుకు స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలి. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి ఐఆర్డీఏఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’ అని తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రెండు సంస్థల పేర్లను ఐఆర్డీఏఐ వెల్లడించకపోయినప్పటికీ ఆ జాబితాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. డేటా లీకేజీ జరిగిన మాట వాస్తవమేనని ఆ కంపెనీ ఇటీవలే వెల్లడించడం ఇందుకు కారణం. ఇక డేటా ఉల్లంఘన బారిన పడిన రెండో సంస్థ పేరు తెలియరాలేదు. ఇదిలాఉండగా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలిసింది. -
బ్లాక్‌స్టోన్ చేతికి ఆర్ సిస్టమ్స్
ముంబై: డిజిటల్ ఐటీ సర్వీసుల కంపెనీ ఆర్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసినట్లు యూఎస్ పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా పేర్కొంది. ఇందుకు 35.9 కోట్ల డాలర్లు(రూ. 2,904 కోట్లు) చెల్లించనున్నట్లు వెల్లడించింది. కంపెనీలో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రమోటర్లు సతీందర్ సింగ్ రేఖీ తదితరులతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 1993లో రేఖి ప్రమోట్ చేసిన కంపెనీ డిజిటల్ ఐటీ సర్వీసులతోపాటు, ప్రొడక్ట్ ఇంజనీరింగ్‌లో ప్రత్యేకతను కలిగి ఉంది. నోయిడాకు చెందిన ఈ కంపెనీ టెక్నాలజీ, మీడియా, టెలికం, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాలలో 250 కస్టమర్లకు సేవలందిస్తోంది. 4,400 మంది సిబ్బంది ఆర్ సిస్టమ్స్ 4,400 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దేశ, విదేశాలలో 18 డెలివరీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ సెప్టెంబర్‌తో ముగిసిన 12 నెలల కాలంలో కంపెనీ రూ. 1,445 కోట్ల ఆదాయం సాధించింది. ఇది 36 శాతం వృద్ధికాగా.. రేఖి తదితర ప్రమోటర్లు ప్రస్తుతం కంపెనీలో 52 శాతం వాటాను కలిగి ఉన్నారు. బ్లాక్‌స్టోన్ షేరుకి రూ. 245 చొప్పున వాటాను కొనుగోలు చేయనుంది. మిగిలిన వాటా కోసం షేరుకి రూ. 246 ధరలో డీలిస్టింగ్ ఆఫర్‌ను ప్రకటించనుంది. తదుపరి రేఖి నాన్‌ఎగ్జిక్యూటివ్ సలహాదారుగా సేవలను కొనసాగించనున్నారు. కాగా.. బ్లాక్‌స్టోన్ ఐటీ, ఐటీ ఆధారిత సేవల దేశీ కంపెనీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటివరకూ 7 బిలియన్ డాలర్లు పంప్ చేసింది. ఎంఫసిస్, వీఎఫ్ఎస్, టాస్క్యూఎస్, ఐబీఎస్ సాఫ్ట్వేర్, ఇంటెలినెట్, సింప్లిలెర్న్ తదితర కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. బ్లాక్‌స్టోన్ సొంతం చేసుకోనున్న వార్తల ప్రభావంతో ఆర్ సిస్టమ్స్ కౌంటర్లో భారీ డిమాండ్ నెలకొంది. వెరసి బీఎస్ఈలో షేరు తొలుత 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 281ను దాటింది. చివరికి 16 శాతం జంప్‌చేసి రూ. 271 వద్ద ముగిసింది. -
జూలై 1నుంచి జీఎస్టీ అమలు సాధ్యమేనా?
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టాక్స్ సంస్కరణగా చెబుతున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం అమలుపై వివిధ పరిశ్రమ వర్గాలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంకా మూడు వారాలే సమయం ఉండటంతో జూలై 1నుంచి అమలు సాధ్యపడుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలుకు కీలకమైన ఐటీ వ్యవస్థను సిద్ధంగా లేదనే అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన నెట్వర్క్ పని ఇంకా పూర్తికాలేదని జీఎస్టీ సువిధ ప్రొవైడర్స్ చెబుతున్నారు. శుక్రవారం జీఎస్టీఎన్ అధికారులు , సువిధ ప్రొవైడర్స్ మధ్య సమావేశం జరిగింది. ఇందులో జీఎస్టీ అనుకున్న తేదీనుంచి అమలు చేయాలన్న ధీమా వ్యక్తమైనప్పటికీ ఐటీ సంసిద్ధతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జీఎస్టీ నెట్వర్క్, జీఎస్టీ ఐటీ సిస్టం సిద్ధంగా లేదని, పన్నుల శ్లాబుల ఖరారు తర్వాత మాత్రమే జిఎస్టి సువిధా ప్రొవైడర్లు (జీఎస్పీ) లను సిద్ధంగా ఉంచగలమని టాలీ సొల్యూషన్స్ వద్ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేజాస్ గోయెంకా ఐఎన్‌ఎస్‌కి చెప్పారు. అలాగే జీఎస్టీలోని పలు అంశాలపై నిర్ణయాలు కొన్ని అంశాలు మాత్రమే కొన్ని రోజుల క్రితం ప్రకటించబడ్డాయి, ఇంకా కొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందనీ అందువల్ల జూలై 1 అమలు కష్టతరమనిపిస్తోందని ఎక్సెల్లాన్ సీవోవో వినోద్ తంబి పేర్కొన్నారు. ఐటి సంసిద్ధంగా లేకపోవటంతో జూలై 1నుంచిజీఎస్టీ అమలు విఫలమయ్యేటట్టు కనిపిస్తోందని సిగ్నెట్ ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు , డైరెక్టర్ నీరజ్ హుథే సింగ్ అభిప్రాయపడ్డారు. దీంతో అమలు తేదీ దగ్గరపడుతుండటంతో మార్కెట్ వర్గాల భయాలు నిజంకాననున్నాయనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇంకా 20 రోజులే మిగిలి ఉన్నప్పటికీ పన్నులరేట్లు, నిబంధనలపై నిర్ణయాలు పూర్తికాలేదనీ, ఇది సువిధ ప్రొవైడర్లు టెస్టింగ్ అవసరాల్ని దెబ్బతీస్తోందని ఎనలిస్టు ప్రీతమ్ మాధురే వ్యాఖ్యానించారు. ఈ సాఫ్ట్‌వేర్‌పై గణనీయమైన పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్‌మిత్రా కూడా జూలై 1 నాటికి ఐటి సంసిద్ధత గురించి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. మొత్తం జీఎస్టీ జీఎస్టీ నెట్వర్క్ సంబంధించిన ఐటి వ్యవస్థపై ఆధార పడి ఉందని మిత్రా చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 34 సువిధ ప్రొవైడర్లను నియమించామని, తాజా అంచనాల ప్రకారం వీరికి ఇంకా సమయం కావాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో 34 జీఎస్‌పీలు సరిపోతాయా అనే సందేహాలను ఆయన వ్యక్తం చేయడం గమనార్హం. కాగా జీఎస్టీ బిల్లును జూలై 1 నుంచి ఎలాగైనా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో జీఎస్టీ అమలుకు సంబంధించిన కసరత్తును శరవేగంగా పరుగులు తీయిస్తోంది. జూలై 1నుంచి అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రకటించారు. జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ రేపు (ఆదివారం) తుది సమావేశం కానున్న సంగతి తెలిసిందే.