పాలసీదారుల డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలని సూచించింది. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించింది.
ఐఆర్‌డీఏఐ ప్రకటనలోని వివరాల ప్రకారం..‘డేటా ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది. బీమా తీసుకున్నవారి డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో రెండు సంస్థలకు(పేర్లు వెల్లడించలేదు) చెందిన ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలి. ఇందుకు స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలి. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి ఐఆర్‌డీఏఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’ అని తెలిపింది.
ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..
రెండు సంస్థల పేర్లను ఐఆర్‌డీఏఐ వెల్లడించకపోయినప్పటికీ ఆ జాబితాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. డేటా లీకేజీ జరిగిన మాట వాస్తవమేనని ఆ కంపెనీ ఇటీవలే వెల్లడించడం ఇందుకు కారణం. ఇక డేటా ఉల్లంఘన బారిన పడిన రెండో సంస్థ పేరు
తెలియరాలేదు. ఇదిలాఉండగా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్‌జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment