Audit Committee
-
పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్
పాలసీదారుల డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలని సూచించింది. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని వివరించింది.ఐఆర్డీఏఐ ప్రకటనలోని వివరాల ప్రకారం..‘డేటా ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాలసీదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోంది. బీమా తీసుకున్నవారి డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో రెండు సంస్థలకు(పేర్లు వెల్లడించలేదు) చెందిన ఐటీ సిస్టమ్‌లను ఆడిట్ చేయాలి. ఇందుకు స్వతంత్ర ఆడిటర్‌ను నియమించుకోవాలి. ఆయా సంస్థల యాజమాన్యాలతో కలిసి ఐఆర్డీఏఐ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది’ అని తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రెండు సంస్థల పేర్లను ఐఆర్డీఏఐ వెల్లడించకపోయినప్పటికీ ఆ జాబితాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. డేటా లీకేజీ జరిగిన మాట వాస్తవమేనని ఆ కంపెనీ ఇటీవలే వెల్లడించడం ఇందుకు కారణం. ఇక డేటా ఉల్లంఘన బారిన పడిన రెండో సంస్థ పేరు తెలియరాలేదు. ఇదిలాఉండగా, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలిసింది. -
దేవుడే చెప్పినా మా లెక్క తప్పదు!
న్యూఢిల్లీ: స్వయంగా దేవుడే వచ్చి చెప్పినా సరే తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. టాప్ మేనేజ్మెంట్ అనైతిక విధానాలకు పాల్పడుతోందంటూ ప్రజావేగులు చేసిన ఆరోపణలు అవమానకరమైనవని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణపై తమ అభిప్రాయాలు రుద్దే ప్రసక్తి లేదని ఇన్వెస్టర్లతో సమావేశంలో నీలేకని చెప్పారు. మరోవైపు, ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలని వ్యాఖ్యానించారు. భారీ ఆదాయాలు చూపేందుకు సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నీలేకని వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ వదంతులు హేయమైనవి. అంతా ఎంతగానో గౌరవించే వ్యక్తుల ప్రతిష్టను మసకబార్చే లక్ష్యంతో చేస్తున్నవి. సంస్థకు జీవితాంతం సేవలు అందించిన మా సహ–వ్యవస్థాపకులంటే నాకెంతో గౌరవం. వారు కంపెనీ వృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేశారు. భవిష్యత్‌లోనూ కంపెనీ శ్రేయస్సు కోసం పాటుపడేందుకు కట్టుబడి ఉన్నారు‘ అని ఆయన తెలిపారు. టాప్ మేనేజ్మెంట్పై వచ్చిన ఆరోపణల మీద ఇప్పటికే స్వతంత్ర న్యాయ సేవల సంస్థ విచారణ జరుపుతోందని, ఫలితాలు వచ్చాక అందరికీ తెలియజేస్తామని నీలేకని పేర్కొన్నారు. వివరాలు కోరిన ఎన్ఎఫ్ఆర్ఏ.. ప్రజావేగుల ఫిర్యాదులకు సంబంధించి నిర్దిష్ట వివరాలివ్వాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ), కర్ణాటకలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కోరినట్లు ఇన్ఫీ తెలిపింది. ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు కూడా మరింత సమాచారం అడిగినట్లు పేర్కొంది. అడిగిన వివరాలన్నింటిని సమర్పించనున్నట్లు ఇన్ఫీ వివరించింది. ప్రజావేగుల ఫిర్యాదులపై ఇన్ఫోసిస్ అంతర్గతంగా విచారణ జరుపుతోంది. అటు అమెరికన్ ఇన్వెస్టర్ల తరఫున అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వేస్తామంటూ ఒక న్యాయ సేవల సంస్థ ప్రకటించింది. -
మరో వివాదంలో ఇన్ఫోసిస్
సాక్షి,ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. కంపెనీ రాబడి, లాభాలని అధికంగా చూపేందుకు ఉన్నతాధికారులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నిలంజన్ రాయ్‌పై కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం, లాభాల కోసం కంపెనీ అనైతిక విధానాలను ఆచరిస్తుందని ఆరోపించారు. 'ఎథికల్ ఎంప్లాయిస్' పేరుతో ఏర్పడిన సంస్థలోని ఉద్యోగుల బృదం ఈ మేరకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డుకు, అలాగే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసి) కి ఫిర్యాదు చేసింది. ఆడిటర్లను ఆయా డీల్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించాలని, మార్జిన్లు, అప్రకటిత ముందస్తు కమిట్మెంట్లు, రాబడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనీ కోరింది. ఈ ఫిర్యాదును కంపెనీ విధానం ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచామనీ, విజిల్‌బ్లోయర్స్ పాలసీకి అనుగుణంగా దీనిపై విచారణ ఉంటుందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్వార్టర్(త్రైమాసికం)లో ఎఫ్డిఆర్ కాంట్రాక్టులో 50 మిలియన్ డాలర్ల ముందస్తు చెల్లింపు రివర్సల్‌లను గుర్తించవద్దని చాలా ఒత్తిడి తెచ్చారని, ఇది అకౌంటింగ్ ప్రాక్టీస్‌కు విరుద్ధమని, ఇది త్రైమాసికంలో లాభాలను తగ్గిస్తుందని, స్టాక్ ధరకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇన్ఫోసిస్ సీఈవో,సీఎఫ్‌వో ఒత్తిడి చేస్తున్నారని సెప్టెంబర్-20,2019న బోర్డుకి రాసిన లేఖలో వారు ఆరోపించారు. తమ ఆరోపణలకు సంబంధించిన ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయని ఫిర్యాదు దారులు వాదిస్తుండటం విశేషం. వెరిజోన్, ఇంటెల్,ఏబిన్ అమ్రో వంటి పెద్ద కాంట్రాక్టులలో ఆదాయ గుర్తింపు విషయాలు అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం లేవని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, విచారణ అధికారులు తమను అడిగినప్పుడు వీటిని సమర్పిస్తామని విజిల్ బ్లోయర్స్ తెలిపారు. ఆడిటర్స్ కి పెద్ద డీల్ సమాచారం తెలియజేయవద్దని తమను అడిగినట్లు కూడా వారు ఆ లేఖలో తెలిపారు. కాగా 2017లో ఇన్ఫోసిస్ ఫౌండర్లు, అప్పటి బోర్డు మధ్య విభేదాలతో సంక్షోభం ఏర్పడింది. మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్‌కు చెల్లించిన ప్యాకేజీ వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే అప్పటి సీఈవో విశాల్ సిక్కా పదవినుంచి వైదొలిగారు. ఆ తరువాత ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది జనవరిలో సలీల్ పరేఖ్ సీఈవోగా ఎంపికయ్యారు. ఇంతకుముందు, ఇజ్రాయెల్ ఆటోమేషన్ టెక్నాలజీ సంస్థ పనయాను కొనుగోలుపై ఆరోపణలతో కూడిన నివేదికను ఇన్ఫోసిస్ తన అంతర్గత ఆడిట్ కమిటీ, దర్యాప్తు తరువాత, ఆరోపణలకు ఆధారాలు లేవని తోసి పుచ్చింది. అంతేకాదు ఈ ఏడాది ఆరంభంలో బన్సాల్‌కు చెల్లించిన చెల్లింపులకు సంబంధించి బహిర్గతం చేసిన లోపాల కేసును ఇన్ఫోసిస్ సెబీతో పరిష్కరించుకుంది. ఇందుకు మార్కెట్ రెగ్యులేటర్‌కు రూ .34.34 లక్షలు చెల్లించిన సంగతి తెలిసిందే. -
అంగన్వాడీల్లో ఆడిట్
గద్వాల అర్బన్ : అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆడిట్ చేపట్టి ఈ వ్యవస్థను చక్కదిద్దేందుకు జిల్లా అధికారులు యత్నిస్తున్నారు. ఈపాటికే సామాజిక తనిఖీ చేయాల్సిన అంగన్వాడీ కేంద్రాల జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతాయి. ఈ సామాజిక తనిఖీలో భాగంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తప్పొప్పులను నమోదు చేస్తారు. ముఖ్యంగా చిన్నారుల సంఖ్య, ఆరోగ్యలక్ష్మి, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ, రోజువారీ కేంద్రం రికార్డుల నిర్వహణ, చిన్నారులకు ఆటపాటలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్ని కోణాల్లో తనిఖీ నిర్వహించి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేస్తారు. రికార్డుల్లో అంగన్వాడీ టీచర్లు నమోదు చేసిన మేరకు వారికి పౌష్టికాహారం అందిందో లేదో ఆరా తీస్తారు. అనంతరం గ్రామసభ ఏర్పాటుచేసి కేంద్రం అందించాల్సిన సేవలు, దస్త్రాల్లోని వివరాలు, లబ్ధిదారుల సంఖ్యను ప్రజల సమక్షంలో వెల్లడిస్తారు. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. చిన్నారుల సంఖ్యను రికార్డుల్లో ఎక్కువగా చూపి, పోషకాహారం పంపిణీ చేసినట్టు తేలిన కేంద్రాల టీచర్లపై చర్యకు ఉపక్రమిస్తారు. అంగన్వాడీ టీచర్లలో గుబులు జిల్లా పరిధిలో గద్వాల అర్బన్, మానవపాడు, మల్దకల్ ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరి«ధిలో 713అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది 67 చోట్ల తనిఖీ నిర్వహించనున్నారు. గతేడాది అక్టోబర్‌లో 44 చోట్ల తనిఖీలు చేపట్టి అవకతవకలకు పాల్పడిన గద్వాల ప్రాజెక్టు పరిధిలోని ముగ్గురు అంగన్వాడీ టీచర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈసారి చేపట్టే తనిఖీలు ఇంకా పకడ్బందీగా ఉంటాయని సమాచారం. సామాజిక తనిఖీలు చేపట్టే కేంద్రాల జాబితాను ఐసీడీఎస్ అధికారులు బయటకు పొక్కనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న తప్పు జరి గినా వేటు వేసే అవకాశం ఉంది. దీంతో సమయంపాలన పాటించని, పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయని అంగన్వాడీ టీచర్లలో గుబు లు రేపుతోంది. ఇప్పటికే కొందరు సిబ్బంది ఆయా రికార్డులను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. -
పనయా డీల్‌లో అవకతవకలేమీ జరగలేదు
ఇన్ఫోసిస్ అంతర్గత ఆడిట్ కమిటీ నివేదిక న్యూఢిల్లీ: ఇజ్రాయెలీ ఆటోమేషన్ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలు విషయంలో అవకతవకలేమీ జరగలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అంతర్గత ఆడిట్ కమిటీ విచారణలో తేలింది. దీనిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలేమీ లభించలేదని ఇన్ఫోసిస్ వెల్లడించింది. 2015 ఫిబ్రవరిలో పనయాను ఇన్ఫోసిస్ 200 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,250 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే, ఈ ఒప్పందం విషయంలో ఇన్ఫోసిస్ అవకతవకలకు పాల్పడిందంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిర్యాదు అందింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఇన్ఫోసిస్.. గిబ్సన్ డన్ అండ్ కంట్రోల్ రిస్క్స్ (జీడీసీఆర్) సంస్థతో అంతర్గత విచారణ జరిపించింది. కంపెనీ గానీ, డైరెక్టర్లు గానీ అవకతవకలకు పాల్పడ్డారనేందుకు జీడీసీఆర్ స్వతంత్రంగా నిర్వహించిన విచారణలో ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇన్ఫీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.