జిల్లా కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆడుకుంటున్న చిన్నారులు
గద్వాల అర్బన్ : అంగన్‌వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆడిట్ చేపట్టి ఈ వ్యవస్థను చక్కదిద్దేందుకు జిల్లా అధికారులు యత్నిస్తున్నారు. ఈపాటికే సామాజిక తనిఖీ చేయాల్సిన అంగన్‌వాడీ కేంద్రాల జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతాయి.
ఈ సామాజిక తనిఖీలో భాగంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తప్పొప్పులను నమోదు చేస్తారు. ముఖ్యంగా చిన్నారుల సంఖ్య, ఆరోగ్యలక్ష్మి, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ, రోజువారీ కేంద్రం రికార్డుల నిర్వహణ, చిన్నారులకు ఆటపాటలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
అన్ని కోణాల్లో తనిఖీ నిర్వహించి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేస్తారు. రికార్డుల్లో అంగన్‌వాడీ టీచర్లు నమోదు చేసిన మేరకు వారికి పౌష్టికాహారం అందిందో లేదో ఆరా తీస్తారు. అనంతరం గ్రామసభ ఏర్పాటుచేసి కేంద్రం అందించాల్సిన సేవలు, దస్త్రాల్లోని వివరాలు, లబ్ధిదారుల సంఖ్యను ప్రజల సమక్షంలో వెల్లడిస్తారు. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. చిన్నారుల సంఖ్యను రికార్డుల్లో ఎక్కువగా చూపి, పోషకాహారం పంపిణీ చేసినట్టు తేలిన కేంద్రాల టీచర్లపై చర్యకు ఉపక్రమిస్తారు.
అంగన్‌వాడీ టీచర్లలో గుబులు
జిల్లా పరిధిలో గద్వాల అర్బన్, మానవపాడు, మల్దకల్ ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరి«ధిలో 713అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది 67 చోట్ల తనిఖీ నిర్వహించనున్నారు. గతేడాది అక్టోబర్‌లో 44 చోట్ల తనిఖీలు చేపట్టి అవకతవకలకు పాల్పడిన గద్వాల ప్రాజెక్టు పరిధిలోని ముగ్గురు అంగన్‌వాడీ టీచర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈసారి చేపట్టే తనిఖీలు ఇంకా పకడ్బందీగా ఉంటాయని సమాచారం.
సామాజిక తనిఖీలు చేపట్టే కేంద్రాల జాబితాను ఐసీడీఎస్ అధికారులు బయటకు పొక్కనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న తప్పు జరి గినా వేటు వేసే అవకాశం ఉంది. దీంతో సమయంపాలన పాటించని, పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయని అంగన్‌వాడీ టీచర్లలో గుబు లు రేపుతోంది. ఇప్పటికే కొందరు సిబ్బంది ఆయా రికార్డులను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment