పనయా డీల్‌లో అవకతవకలేమీ జరగలేదు
ఇన్ఫోసిస్ అంతర్గత ఆడిట్ కమిటీ నివేదిక
న్యూఢిల్లీ: ఇజ్రాయెలీ ఆటోమేషన్ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలు విషయంలో అవకతవకలేమీ జరగలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అంతర్గత ఆడిట్ కమిటీ విచారణలో తేలింది. దీనిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలేమీ లభించలేదని ఇన్ఫోసిస్ వెల్లడించింది. 2015 ఫిబ్రవరిలో పనయాను ఇన్ఫోసిస్ 200 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,250 కోట్లు) కొనుగోలు చేసింది.
అయితే, ఈ ఒప్పందం విషయంలో ఇన్ఫోసిస్ అవకతవకలకు పాల్పడిందంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఫిర్యాదు అందింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఇన్ఫోసిస్.. గిబ్సన్ డన్ అండ్ కంట్రోల్ రిస్క్స్ (జీడీసీఆర్) సంస్థతో అంతర్గత విచారణ జరిపించింది. కంపెనీ గానీ, డైరెక్టర్లు గానీ అవకతవకలకు పాల్పడ్డారనేందుకు జీడీసీఆర్ స్వతంత్రంగా నిర్వహించిన విచారణలో ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇన్ఫీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.