విశాల్ సిక్కాకు ఇన్ఫీ క్లీన్చిట్
బెంగళూరు : ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాకు క్లీన్చిట్ లభించింది. వివాదస్పద డీల్ పనయ కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని నేతృత్వంలో జరిగిన బోర్డు తేల్చింది. మాజీ సీఈవో విశాల్ సిక్కాకు మద్దతుగా నిలుస్తూ.. అవతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని నిలేకని పేర్కొన్నారు. ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ డీల్‌లో ఎలాంటి అవతవకలు జరుగలేదని విచారణలో బోర్డు తేల్చినట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. పనయ డీల్, కార్పొరేట్ గవర్నెన్స్ విషయాల్లోనే కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, మాజీ సీఈవో విశాల్ సిక్కాకు మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే విశాల్ సిక్కా రాజీనామా చేయడం, తదుపరి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కంపెనీ ప్రయోజనాలరీత్యా విచారణ నివేదికను బహిర్గతం చేయట్లేదని నిలేకని పేర్కొన్నారు. ప్రస్తుతం పనయ డీల్ విషయంలో వెలువడిన ప్రకటనతో నారాయణమూర్తి ఆరోపణల్లో ఎలాంటి రుజువు లేదని తెలిసింది. పనయ డీల్‌ను బహిర్గతం చేయాలంటూ పలుమార్లు నారాయణమూర్తి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీలోకి నిలేకని పునరాగమనం అనంతరం తొలిసారి ఇన్ఫోసిస్ తన క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో కంపెనీ లాభాలు ఏడాదికి 7 శాతం పెరిగి రూ.3726 కోట్ల ఆర్జించినట్టు రిపోర్టు చేసింది. 2018 ఆర్థిక సంవత్సరపు గైడెన్స్‌ను మాత్రం కంపెనీ 6.5-8.5 శాతం నుంచి 5.5-6.5 శాతానికి తగ్గించింది.