transportation tax
-
పన్ను ఎగవేత రూ.2 కోట్లు!
- రవాణా పన్ను చెల్లించని వాహనదారులు - జిల్లాలో రెండేళ్లుగా పేరుకుపోయిన వైనం - జరిమానా విధించాలని అధికారుల నిర్ణయం - ఈ నెల 16 వరకు బకాయిల చెల్లింపునకు గడువు తాండూరు: జిల్లాలో రవాణా పన్ను (ట్రాన్స్పోర్ట్ టాక్స్) ను వాహనదారులు రూ.కోట్లల్లో ఎగవేస్తున్నారు. రెండేళ్లుగా పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. జిల్లా లో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 8 వేల రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. ఇందులో మూడు చక్రాల ఆటోలతో పాటు వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు ప్రభుత్వం రవాణా పన్ను మినహాయించింది. మిగతా రవాణా వాహనాలు పన్ను ఎగవేశాయని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరకుండాపోయింది. ఆలస్యంగా మేల్కొన్న రవాణా శాఖ అధికారులు.. పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా జిల్లా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల(ఎంవీఐ)కు ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా పన్ను బకాయిలను వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నెల 16 వరకు స్వచ్ఛందంగా పన్ను బకాయిల చెల్లింపునకు అధికారులు గడువు ఇచ్చారు. గడువులోపు పన్ను చెల్లించని వాహనదారులకు అసలు పన్నుకు 200శాతం జరిమానా విధింపుతోపాటు వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత పట్టణాలు, గ్రామాల్లోకి వెళ్లి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దిగనున్నాయి. -
చట్టప్రకారమే రవాణా పన్ను వసూలు
ఏపీపై ఎలాంటి కక్షా లేదు ఆర్టీసీ కార్మికుల ఫిట్‌మెంట్‌పై త్వరలో నిర్ణయం రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి,హైదరాబాద్ : అంతరాష్ర్ట పన్ను వసూళ్ల విషయంలో ఏపీపై తమకు ఎలాంటి కక్ష లేదని, జీవో 43 ప్రకారమే రోడ్డు రవాణా పన్ను వసూలు చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.శువ్రారం నగరంలో నిర్వహించిన తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రవాణా పన్ను విషయంలో అనవసరంగా రాద్దాంతాలు చేయరాదన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తాత్కాలికంగా పన్ను వసూళ్లను వాయిదా వేశామన్నారు. తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడు పాపారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ఆర్టీసీ కార్మికులకు సైతం తాము అన్యాయం చేయబోమని, ఫిట్‌మెంట్‌పై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.రాష్ర్టంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణాశాఖ అధికారులు, ఉద్యోగులు ఉద్యమస్థాయిలో కృషి చేయాలన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అసోసియేషన్ రూపొందించిన ‘ జర భద్రం కొడుకో’ సీడీని ఆయన ఆవిష్కరించారు.ఎంవీఐలు, ఇతర అధికారుల పదోన్నతులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నామన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ, సకలజనుల సమ్మెతో ఆర్టీఏ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనతోనే తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని, సకల జనుల సమ్మెగా అది విజయవంతమైందని గుర్తు చేశారు. రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములైనట్లుగానే, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలన్నారు.రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ మాట్లాడుతూ రవాణా ఉద్యోగులంతా ఒక కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. కమిషనర్ సుల్తానియా మాట్లాడుతూ, స్కూళ్లలో రోడ్డు సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలను సాధించగలమన్నారు. టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ఎంవీఐల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీనివాస్, డీటీసీలు రమేష్,ప్రవీణ్‌రావు,టీఆర్ఎస్ గ్రేటర్ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ మైనంపల్లి హనుమంత రావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జీవో 15ను ఎత్తివేయాలి..
ప్రవేశపన్నుపై తెలంగాణ లారీ యజమానుల సంఘం డిమాండ్ నేడు కేసీఆర్‌తో సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర రవాణా పన్నుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 15ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం డిమాండ్ చేసింది. జీవో 15పై భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు గురువారమిక్కడ తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన లారీ యజమానులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఎన్.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతమున్న పర్మిట్ విధానాన్నే మరో రెండేళ్లపాటు కొనసాగించాలని కోరినా... ప్రభుత్వం ఏకపక్షంగా జీవో విడుదల చేసిందని మండిపడ్డారు. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలని, లేదంటే పన్నుభారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర పన్ను అనివార్యమైతే.. ప్రస్తుతమున్న పన్ను మొత్తాన్ని 58 శాతానికి తగ్గించాలన్నారు. గతంలో 23 జిల్లాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ పన్ను విధానాన్ని తెలంగాణలోని 10 జిల్లాలకే పరిమితం చేసే విధంగా తగ్గించాలని కోరారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఈ జీవోను తెచ్చిందని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.నందారెడ్డి ఆరోపించారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూనే ఉందని విమర్శించారు. -
గ్రేటర్‌కు కొత్త రూపు
మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు రవాణా పన్ను మినహాయింపుతో 1.20 లక్షల మంది ఆటోడ్రైవర్లకు లబ్ధి ఉద్యమ కేసుల ఎత్తివేతపై స్పందన మంత్రి వర్గం నిర్ణయాలపై హర్షం సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న పలు నిర్ణయాలపై వివిధ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌కు కొత్త హంగులు, భద్రత, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఇతరులపై నమోదైన కేసుల ఎత్తివేత వంటి నిర్ణయాలపై స్పందన వ్యక్తమైంది. ముఖ్యంగా ఆటోలపై రవాణా పన్ను మినహాయింపు నిర్ణయం ఆటో డ్రైవర్లలో ఆనందోత్సాహాలు నింపింది. పలుచోట్ల బుధవారం రాత్రి సంబరాలు నిర్వహిం చారు. మంత్రివర్గం నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 1.20 లక్షల ఆటో కార్మికులకు లబ్ధి చేకూరనుంది. గ్రేటర్ పరిధిలో ఆటో కార్మికులు ఏటా ఈ పన్ను రూపేణా రూ.5.28 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. మంత్రివర్గ నిర్ణయంతో తాజాగా ఈ మొత్తం మేరకు మినహాయింపు లభించినట్లయింది. అలాగే నగరంలోని 10 వేల ట్రాలీ ఆటోలు నడుపుతున్న కార్మికులకు కూడా రూ.54 లక్షల మేర లబ్ది చేకూరనుంది. అయితే, రవాణా పన్ను మినహాయింపు కంటే ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చి ఉంటే మరింత లబ్ధి చేకూరి ఉండేదని కొన్ని ఆటో సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో తీసుకున్న వివిధ నిర్ణయాల దరిమిలా అవి నగరంపై చూపే ప్రభావం వివరాలిలా.. హైదరాబాద్ ‘గ్లోబల్ సిటీ’గా రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ స్థాయి అధునాతన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన మెరుగైన పారిశుధ్య వ్యవస్థ.. మాస్టర్‌ప్లాన్‌కు కొత్తరూపు.. మార్పుచేర్పులతో నగరం రూపురేఖల్ని మార్చేలా విధాన నిర్ణయాలు పట్టణాభివృద్ధి అంశాల్లో నైపుణ్యం కలిగిన జాతీయ స్థాయి సంస్థల లేదా అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్ల సేవల వినియోగం జంట పోలీసు కమిషనరేట్లలో కొత్త వాహనాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్.. పోలీసింగ్‌కు ఆధునిక రూపు మంత్రివర్గం నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్‌లో 103 కల్లు దుకాణాలు తెరుచుకోనున్నాయి. వీటిపై ఆధారపడిన పలువురికి ఉపాధి లభించనుంది గ్రేటర్ లోని ఘన వ్యర్థాల నిర్వహణకు రెండు వేల ఎకరాలు అవసరమని గుర్తింపు.. దీనిపై త్వరలోనే నిర్ణయం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం అక్రమాలు, ఆక్రమణల తొలగింపులో అధికారులకు పూర్తి స్థాయి సహకారం దేవాదాయ భూముల పరిరక్షణ.. జిల్లా స్థాయిలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయం. అన్యాక్రాంతమైన భూముల రక్షణకు, వక్ఫ్ భూముల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు