చట్టప్రకారమే రవాణా పన్ను వసూలు
- ఏపీపై ఎలాంటి కక్షా లేదు
- ఆర్టీసీ కార్మికుల ఫిట్‌మెంట్‌పై త్వరలో నిర్ణయం
- రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్ : అంతరాష్ర్ట పన్ను వసూళ్ల విషయంలో ఏపీపై తమకు ఎలాంటి కక్ష లేదని, జీవో 43 ప్రకారమే రోడ్డు రవాణా పన్ను వసూలు చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.శువ్రారం నగరంలో నిర్వహించిన తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రవాణా పన్ను విషయంలో అనవసరంగా రాద్దాంతాలు చేయరాదన్నారు.
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తాత్కాలికంగా పన్ను వసూళ్లను వాయిదా వేశామన్నారు. తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడు పాపారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ఆర్టీసీ కార్మికులకు సైతం తాము అన్యాయం చేయబోమని, ఫిట్‌మెంట్‌పై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.రాష్ర్టంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణాశాఖ అధికారులు, ఉద్యోగులు ఉద్యమస్థాయిలో కృషి చేయాలన్నారు.
రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అసోసియేషన్ రూపొందించిన ‘ జర భద్రం కొడుకో’ సీడీని ఆయన ఆవిష్కరించారు.ఎంవీఐలు, ఇతర అధికారుల పదోన్నతులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నామన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ, సకలజనుల సమ్మెతో ఆర్టీఏ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనతోనే తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని, సకల జనుల సమ్మెగా అది విజయవంతమైందని గుర్తు చేశారు.
రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములైనట్లుగానే, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలన్నారు.రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ మాట్లాడుతూ రవాణా ఉద్యోగులంతా ఒక కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. కమిషనర్ సుల్తానియా మాట్లాడుతూ, స్కూళ్లలో రోడ్డు సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలను సాధించగలమన్నారు. టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, ఎంవీఐల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీనివాస్, డీటీసీలు రమేష్,ప్రవీణ్‌రావు,టీఆర్‌ఎస్ గ్రేటర్ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ మైనంపల్లి హనుమంత రావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.