సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును హడావుడిగా ప్రవేశపెట్టడం సరికాదని, అందులోని అంశాలపై విస్తృత చర్చ కోసం భాగస్వామ్య పక్షాలకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఆపడం వెనక తనకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవని.. ప్రజలు, ఆర్టీసీ ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలను రక్షించడమే తన ఉద్దేశమని చెప్పారు.
తాను ఎల్లçప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటానని, గత సమ్మె సమయంలో కూడా కార్మికులకు అండగా నిలబడి అర్ధరాత్రి వారి సమస్యలను విన్నానని గుర్తు చేశారు. శనివారం ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడారు.
43,373 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు పట్ల ఆందోళన, సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణలు అందాక.. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.
పీఆర్సీ, గ్రాట్యుటీ చెల్లింపు ఎప్పుడు?
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణలు (పీఆర్సీలు), ఈపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్మెంట్ బకాయిల చెల్లింపు వంటివి పెండింగ్‌లో ఉండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సహకార సొసైటీకి చెందిన రూ.3 వేల కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధ అధిపతిగా రాజ్యాంగ నియమాల పరిరక్షణతోపాటు ప్రజలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు.
ధర్నాకు మంత్రుల వ్యూహరచన: ఉద్యోగ సంఘాలు
ఉద్యోగ సంఘాలు ఎలాంటి సమ్మెకు పిలుపు ఇవ్వలేదని వీడియో కాన్ఫరెన్స్‌లో జేఏసీ ప్రతినిధులు గవర్నర్‌కు చెప్పారు. ప్రభుత్వ ప్రోద్బలంతో బలవంతంగా సమ్మె చేయించారని, మహిళా ఉద్యోగులను సైతం వదిలిపెట్టలేదని ఆరోపించారు. రాజ్‌భవన్ ముట్టడి జరపాలని తమపై ఒత్తిడి తెచ్చారని.. ధర్నాకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యూహరచన చేశారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment