సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో ఆదివారం రాజ్‌భవన్‌లో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పలు సిఫారసులతో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. దీంతో విలీనంపై మూడురోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడినట్టయ్యింది.
ముగిసిన హైడ్రామా
ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ఈ నెల 2న రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రాజ్‌భవన్‌కు పంపింది. అయితే బిల్లు పరిశీలనకు సమయం కావాలని 3వ తేదీన రాజ్‌భవన్ ప్రకటించింది. ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో అదే రోజు బిల్లును పరిశీలించిన గవర్నర్ తమిళిసై 5 సందేహాలపై ప్రభుత్వ నుంచి వివరణలు కోరారు.
మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు రాజ్‌భవన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించగా, ప్రభుత్వ ప్రొద్బలమే ఇందుకు కారణమని రాజ్‌భవన్ ఆరోపించింది. కాగా ప్రభుత్వం పంపిన వివరణలతో సంతృప్తి చెందని గవర్నర్.. ఈ నెల 5న రెండోసారి మరికొన్ని సందేహాలకు సమాధానాలను కోరగా, ప్రభుత్వం వెంటనే ఆ మేరకు వివరణలు పంపించింది. రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఎట్టకేలకు ఆదివారం బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేశారు.
కారుణ్య నియామకాలు చేపట్టాలి
- ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం తర్వాత కూడా సంస్థ భూములు, ఆస్తులపై యాజమాన్య హక్కులను ఆర్టీసీ సంస్థే కలిగి ఉండాలి. సంస్థ అవసరాల కోసమే వాటిని వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి.
- రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలి.
- ఉమ్మడి ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలి. బకాయిల చెల్లింపు బాధ్యతను తీసుకోవాలి.
- విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పారితోశాకాలు, జీతభత్యాలు, పే స్కేలు, సర్విసు నిబంధనలు, బదిలీలు, పదోన్నతులు, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు వర్తింపజేయాలి.
- వైద్యపరంగా అనర్హులు(మెడికల్లీ అన్‌ఫిట్)గా మారే ఉద్యోగులు కారుణ్య నియామకం కింద తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కోరే సదుపాయాన్ని కల్పించాలి.
- అత్యంత కఠినంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల ప్రక్రియను సరళీకరించి మానవీయంగా మార్చాలి.
అందరికీ సమాన ప్రయోజనాలు
- ఆర్టీసీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో రాష్ట్ర సర్విసు నిబంధనల మేరకు సమాన ప్రయోజనాలు, జీతాలు, పీఎఫ్ చెల్లించాలి. వారి ఉద్యోగ భద్రతను పరిరక్షించి వారి సేవలను ఇతర శాఖల్లో వినియోగించుకోవాలి.
- ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు సర్విసులో ఉన్నంత కాలం వారికి ఆర్టీసీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు కొనసాగించాలి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సైతం వైద్య ప్రయోజనాలు అందించాలి.
- బస్సుల నిర్వహణలో ఆర్టీసీ సంస్థ, యూనియన్ల పాత్రే కీలకం. ప్రజల భద్రత కోసం బస్సుల నిర్వహణను ప్రభుత్వం తీసుకుని, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో స్వతంత్ర సంస్థకు లేదా మరేదైనా పద్ధతిలో అప్పగించాలి. నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment