పన్ను ఎగవేత రూ.2 కోట్లు!
- రవాణా పన్ను చెల్లించని వాహనదారులు
- జిల్లాలో రెండేళ్లుగా పేరుకుపోయిన వైనం
- జరిమానా విధించాలని అధికారుల నిర్ణయం
- ఈ నెల 16 వరకు బకాయిల చెల్లింపునకు గడువు
తాండూరు: జిల్లాలో రవాణా పన్ను (ట్రాన్స్‌పోర్ట్ టాక్స్) ను వాహనదారులు రూ.కోట్లల్లో ఎగవేస్తున్నారు. రెండేళ్లుగా పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. జిల్లా లో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 8 వేల రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. ఇందులో మూడు చక్రాల ఆటోలతో పాటు వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు ప్రభుత్వం రవాణా పన్ను మినహాయించింది. మిగతా రవాణా వాహనాలు పన్ను ఎగవేశాయని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరకుండాపోయింది. ఆలస్యంగా మేల్కొన్న రవాణా శాఖ అధికారులు.. పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలుకు సిద్ధమయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా జిల్లా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ల(ఎంవీఐ)కు ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా పన్ను బకాయిలను వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నెల 16 వరకు స్వచ్ఛందంగా పన్ను బకాయిల చెల్లింపునకు అధికారులు గడువు ఇచ్చారు. గడువులోపు పన్ను చెల్లించని వాహనదారులకు అసలు పన్నుకు 200శాతం జరిమానా విధింపుతోపాటు వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత పట్టణాలు, గ్రామాల్లోకి వెళ్లి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దిగనున్నాయి.