- ప్రవేశపన్నుపై తెలంగాణ లారీ యజమానుల సంఘం డిమాండ్
- నేడు కేసీఆర్‌తో సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర రవాణా పన్నుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 15ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం డిమాండ్ చేసింది. జీవో 15పై భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు గురువారమిక్కడ తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన లారీ యజమానులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఎన్.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతమున్న పర్మిట్ విధానాన్నే మరో రెండేళ్లపాటు కొనసాగించాలని కోరినా... ప్రభుత్వం ఏకపక్షంగా జీవో విడుదల చేసిందని మండిపడ్డారు. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలని, లేదంటే పన్నుభారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర పన్ను అనివార్యమైతే.. ప్రస్తుతమున్న పన్ను మొత్తాన్ని 58 శాతానికి తగ్గించాలన్నారు.
గతంలో 23 జిల్లాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ పన్ను విధానాన్ని తెలంగాణలోని 10 జిల్లాలకే పరిమితం చేసే విధంగా తగ్గించాలని కోరారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఈ జీవోను తెచ్చిందని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.నందారెడ్డి ఆరోపించారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూనే ఉందని విమర్శించారు.