necessarily
-
ఎట్టకేలకు పీఆర్సీ సమగ్ర జీవో
జీవో నం.25కు 470 పేజీలు జతచేస్తూ విడుదల విభాగాల వారీగా ఉద్యోగుల పేస్కేళ్ల వివరాలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన ప్రధాన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సమగ్రంగా విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన టీఆర్ఎస్ సర్కారు.. ఉత్తర్వుల జారీలో మీనమేషాలు లెక్కించింది. పీఆర్సీపై సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 5నే ప్రకటన చేసినా.. సంబంధిత జీవోలు జారీ చేయడంలో ఆర్థికశాఖ జాప్యం చేసింది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవ్వాల్సిన కొత్త వేతనాలు ఇప్పటికీ ఉద్యోగుల చేతికి అందలేదు. పీఆర్సీకి సంబంధించి మార్చి 18న ఆర్థిక శాఖ ప్రధాన ఉత్తర్వులు (జీవో నం.25) విడుదల చేసింది. 16 పేజీలతో సంక్షిప్త వివరాలను మాత్రమే అందులో పొందుపరిచింది. శాఖల వారీగా ఉద్యోగుల పేస్కేళ్లు లేకపోవటంతో ఉద్యోగులు తమ వేతనాలను స్థిరీకరించుకోలేకపోయారు. దీంతో గందరగోళం తలెత్తింది. ఆ జీవో అసంపూర్ణంగా ఉందంటూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈలోగా ప్రభుత్వం పీఆర్సీకి సంబంధించిన మార్గదర్శకాలు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ వివరాలతో జీవో విడుదల చేసింది. ఇదే క్రమంలో మార్చి 18న జారీ చేసిన ప్రధాన జీవో నం.25ను సవరించి, అదనంగా 470 పేజీలు జతచేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 36 శాఖలు, రాజ్‌భవన్, ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఉద్యోగుల పేస్కేళ్లను విడివిడిగా తాజా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ప్రధాన జీవోలో రెండో షెడ్యూలుగా వీటిని జతచేశారు. ఇప్పటికిప్పుడు లాభం లేనట్లే..? ప్రభుత్వం పూర్తిస్థాయి జీవోను విడుదల చేసినా ఇప్పటికిప్పుడు వేతన స్థిరీకరణ చేసుకునే వీలు లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ప్రతి నెలా 12లోగా ఉద్యోగులు ట్రెజరీలో బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 11న రెండో శనివారం, 12న ఆదివారం సెలవు దినాలు కావటంతో 10నే అంటే ఒకరోజులోనే బిల్లులు సమర్పించాల్సి ఉం టుంది. ఇంత హడావుడిగా బిల్లులు సమర్పించడం అయ్యే పనికాదని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే తిరిగి 20వ తేదీ తర్వాత సప్లిమెంటరీ బిల్లులు సమర్పించే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో రెగ్యులర్ బిల్లులు కూడా పంపించా ల్సి ఉండడంతో గందరగోళం తలెత్తనుంది. మరోవైపు ఇప్పటికీ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేళ్ల జీవో, ప్రత్యేక అలవెన్సులకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ విడుదల చేయలేదు. పీఆర్సీ జీవోలు, మార్గదర్శకాలు ఇప్పటివరకు ట్రెజ రీలకు చేరలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇవన్నీ పూర్తయితే తప్ప వేతన స్థిరీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యేలా లేదంటున్నా రు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని, పీఆర్సీ జీవోతో పాటు అనుబంధ ఉత్తర్వులు, మార్గదర్శకాలన్నీ ఏకకాలంలో విడుదలయ్యేవని ఉద్యోగులు చెబుతున్నారు. -
జీవో 15ను ఎత్తివేయాలి..
ప్రవేశపన్నుపై తెలంగాణ లారీ యజమానుల సంఘం డిమాండ్ నేడు కేసీఆర్‌తో సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర రవాణా పన్నుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 15ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం డిమాండ్ చేసింది. జీవో 15పై భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు గురువారమిక్కడ తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన లారీ యజమానులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఎన్.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతమున్న పర్మిట్ విధానాన్నే మరో రెండేళ్లపాటు కొనసాగించాలని కోరినా... ప్రభుత్వం ఏకపక్షంగా జీవో విడుదల చేసిందని మండిపడ్డారు. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలని, లేదంటే పన్నుభారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర పన్ను అనివార్యమైతే.. ప్రస్తుతమున్న పన్ను మొత్తాన్ని 58 శాతానికి తగ్గించాలన్నారు. గతంలో 23 జిల్లాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ పన్ను విధానాన్ని తెలంగాణలోని 10 జిల్లాలకే పరిమితం చేసే విధంగా తగ్గించాలని కోరారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ఈ జీవోను తెచ్చిందని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.నందారెడ్డి ఆరోపించారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూనే ఉందని విమర్శించారు. -
‘పంచుకొని’.. పెంచుకున్నారు!
‘స్వగృహ’ ఇళ్ల ధరల్లో అడ్డగోలు వ్యవహారం దీనిపై నేడు హ లెవల్ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: కొందరి కక్కుర్తి ఇప్పుడు స్వగృహ కొనుగోలుదారుల జేబుకు భారీగా చిల్లుపెట్టేలా చేసింది. గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నేతలు, అధికారులు స్వగృహకు సం బంధం లేని ఓ జీవోను దానికి వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయం స్వగృహ ఇళ్ల ధరలను ఒక్కసారిగా పెంచేసింది. కొనేవారు లేక తెల్ల ఏనుగులా మిగిలిన ఇళ్లను లాభాలతో సంబంధం లేకుండా రాయితీ ధరలకు టీఎన్జీవోలకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటంతో ఇటీవల అధికారులు వాటి ధరలను తగ్గించారు. అప్పట్లో నేతలు, అధికారులు కూడబలుక్కుని కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేందుకు నిర్ణయం తీసుకుని ఉండకపోతే... తాజా గా నిర్ధారించిన తగ్గింపు ధరలు కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి. ఇదీ విషయం... నిర్మాణ సామగ్రి ధర పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్‌కు అవకాశం ఉంటుంది. సిమెంటు, స్టీలుతోపాటు ఇసుక, ఇటుక, విద్యుత్తు ఉపకరణాలు, ఫ్లోరింగ్ మెటీరియల్, శానిటరీ ఫిట్టింగ్స్, రం గులు, లేబర్ చార్జీలు... ఇలా అన్నింటా దీన్ని వర్తించేలా 2009లో జీవో35 జారీ అయింది. ఇది రాజీవ్ స్వగృహకు వర్తించదని ప్రభుత్వం అప్పట్లో తేల్చిచెప్పింది. కానీ గత ప్రభుత్వం గద్దెదిగేముందు దీన్ని స్వగృహకు కూడా వర్తింపచేస్తూ హడావుడి నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో జరిగే పనులే కాకుండా, అప్పటికే పూర్తయిన వాటికి కూడా దొడ్డిదారిన దాన్ని వర్తింపజేస్తూ దాదాపు రూ.100 కోట్లు కాంట్రాక్టర్లకు ‘చెల్లించేశారు’. భారాన్నంతా కొనుగోలుదారులపై మోపేం దుకు గుట్టుచప్పుడు కాకుండా ధరలను భారీగా పెంచేశారు. 2013 డిసెంబర్ 16వ తేదీ వరకు త్రిబుల్ బెడ్రూమ్ ఇంటి ధర రూ.33 లక్షలుండగా 17వ తేదీ నుంచి రూ.43.86 లక్షలకు, సింగిల్ బెడ్రూమ్ ఇంటి ధర రూ.14 లక్షల నుంచి రూ.18.49 లక్షలకు పెరిగింది. ఇలా ప్రతి విభాగంలోనూ ధరలకు రెక్కలొచ్చాయి. టీఎన్జీవోలకు శాపం... హైదరాబాద్‌లో చేపట్టిన బండ్లగూడ ప్రాజెక్టును సరసమైన ధరలకు టీఎన్జీవోలకు విక్రయించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ మేరకు అధికారులు తాజాగా వాటి ధరలు తగ్గించారు. అయితే జీవో 35ను వర్తింప చేయకముందు (2013 డిసెంబర్ 17కు ముందు) ఉన్న ధరల కంటే ఈ తగ్గింపు ధరలు దాదాపు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఎక్కువగా ఉండటం గమనార్హం. కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించే నిర్ణయం తీసుకుని ఉండకపోతే బండ్లగూడ స్వగృహ ఇంటి ధరలు దాదాపు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తగ్గేవి. నేడుహైలెవల్ కమిటీ సమావేశం... స్వగృహపై నిర్ణయాలు తీసుకోవటానికి సీఎస్ అధ్యక్షతన ఏర్పాటైన ఐదుగురు సభ్యుల హైలెవల్ కమిటీ సోమవారం భేటీ అవుతోంది. స్వగృహ ధరలు చదరపు అడుగుకు రూ.1,800 మించకుండా చూడాలంటూ టీఎన్టీవోలు చేసిన ప్రతిపాదనపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. స్వగృహ భూములకు విలువ కట్టకపోతే ఇది సాధ్యమనే అభిప్రాయముంది. దీనిపై చర్చించవచ్చు. -
ఒక్క రోజే 48 జీవోలు!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వశాఖలకు సంబంధించిన ఉత్వర్వులు, బడ్జెట్ విడుదల ఆదేశాలు, ఆయా పథకాలకు నిధుల కేటాయింపులతో శుక్రవారం ఒక్కరోజే జీవోల జాతర జరిగింది. మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలకు సంబంధించి ఆయా శాఖలవారీగా నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థికశాఖ నుంచి 48 జీవోలు (సంక్షేమంతోపాటు మిగతా శాఖలకు సంబంధించిన నిధుల విడుదల, బడ్జెట్ మంజూరు ఉత్తర్వులు) జారీ అవగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమ శాఖలు, ఇతర శాఖలకు సంబంధించి వందలాది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.