- జీవో నం.25కు 470 పేజీలు జతచేస్తూ విడుదల
- విభాగాల వారీగా ఉద్యోగుల పేస్కేళ్ల వివరాలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన ప్రధాన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సమగ్రంగా విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన టీఆర్‌ఎస్ సర్కారు.. ఉత్తర్వుల జారీలో మీనమేషాలు లెక్కించింది. పీఆర్సీపై సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 5నే ప్రకటన చేసినా.. సంబంధిత జీవోలు జారీ చేయడంలో ఆర్థికశాఖ జాప్యం చేసింది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇవ్వాల్సిన కొత్త వేతనాలు ఇప్పటికీ ఉద్యోగుల చేతికి అందలేదు. పీఆర్సీకి సంబంధించి మార్చి 18న ఆర్థిక శాఖ ప్రధాన ఉత్తర్వులు (జీవో నం.25) విడుదల చేసింది.
16 పేజీలతో సంక్షిప్త వివరాలను మాత్రమే అందులో పొందుపరిచింది. శాఖల వారీగా ఉద్యోగుల పేస్కేళ్లు లేకపోవటంతో ఉద్యోగులు తమ వేతనాలను స్థిరీకరించుకోలేకపోయారు. దీంతో గందరగోళం తలెత్తింది. ఆ జీవో అసంపూర్ణంగా ఉందంటూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈలోగా ప్రభుత్వం పీఆర్సీకి సంబంధించిన మార్గదర్శకాలు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ వివరాలతో జీవో విడుదల చేసింది.
ఇదే క్రమంలో మార్చి 18న జారీ చేసిన ప్రధాన జీవో నం.25ను సవరించి, అదనంగా 470 పేజీలు జతచేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 36 శాఖలు, రాజ్‌భవన్, ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఉద్యోగుల పేస్కేళ్లను విడివిడిగా తాజా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ప్రధాన జీవోలో రెండో షెడ్యూలుగా వీటిని జతచేశారు.
ఇప్పటికిప్పుడు లాభం లేనట్లే..?
ప్రభుత్వం పూర్తిస్థాయి జీవోను విడుదల చేసినా ఇప్పటికిప్పుడు వేతన స్థిరీకరణ చేసుకునే వీలు లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ప్రతి నెలా 12లోగా ఉద్యోగులు ట్రెజరీలో బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 11న రెండో శనివారం, 12న ఆదివారం సెలవు దినాలు కావటంతో 10నే అంటే ఒకరోజులోనే బిల్లులు సమర్పించాల్సి ఉం టుంది. ఇంత హడావుడిగా బిల్లులు సమర్పించడం అయ్యే పనికాదని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే తిరిగి 20వ తేదీ తర్వాత సప్లిమెంటరీ బిల్లులు సమర్పించే అవకాశం ఉంటుంది.
కానీ అదే సమయంలో రెగ్యులర్ బిల్లులు కూడా పంపించా ల్సి ఉండడంతో గందరగోళం తలెత్తనుంది. మరోవైపు ఇప్పటికీ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేళ్ల జీవో, ప్రత్యేక అలవెన్సులకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ విడుదల చేయలేదు. పీఆర్సీ జీవోలు, మార్గదర్శకాలు ఇప్పటివరకు ట్రెజ రీలకు చేరలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇవన్నీ పూర్తయితే తప్ప వేతన స్థిరీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యేలా లేదంటున్నా రు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని, పీఆర్సీ జీవోతో పాటు అనుబంధ ఉత్తర్వులు, మార్గదర్శకాలన్నీ ఏకకాలంలో విడుదలయ్యేవని ఉద్యోగులు చెబుతున్నారు.