- ‘స్వగృహ’ ఇళ్ల ధరల్లో అడ్డగోలు వ్యవహారం
- దీనిపై నేడు హ లెవల్ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: కొందరి కక్కుర్తి ఇప్పుడు స్వగృహ కొనుగోలుదారుల జేబుకు భారీగా చిల్లుపెట్టేలా చేసింది. గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నేతలు, అధికారులు స్వగృహకు సం బంధం లేని ఓ జీవోను దానికి వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయం స్వగృహ ఇళ్ల ధరలను ఒక్కసారిగా పెంచేసింది. కొనేవారు లేక తెల్ల ఏనుగులా మిగిలిన ఇళ్లను లాభాలతో సంబంధం లేకుండా రాయితీ ధరలకు టీఎన్‌జీవోలకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటంతో ఇటీవల అధికారులు వాటి ధరలను తగ్గించారు. అప్పట్లో నేతలు, అధికారులు కూడబలుక్కుని కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేందుకు నిర్ణయం తీసుకుని ఉండకపోతే... తాజా గా నిర్ధారించిన తగ్గింపు ధరలు కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి.
ఇదీ విషయం...
నిర్మాణ సామగ్రి ధర పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్‌కు అవకాశం ఉంటుంది. సిమెంటు, స్టీలుతోపాటు ఇసుక, ఇటుక, విద్యుత్తు ఉపకరణాలు, ఫ్లోరింగ్ మెటీరియల్, శానిటరీ ఫిట్టింగ్స్, రం గులు, లేబర్ చార్జీలు... ఇలా అన్నింటా దీన్ని వర్తించేలా 2009లో జీవో35 జారీ అయింది. ఇది రాజీవ్ స్వగృహకు వర్తించదని ప్రభుత్వం అప్పట్లో తేల్చిచెప్పింది. కానీ గత ప్రభుత్వం గద్దెదిగేముందు దీన్ని స్వగృహకు కూడా వర్తింపచేస్తూ హడావుడి నిర్ణయం తీసుకుంది.
ఆ సమయంలో జరిగే పనులే కాకుండా, అప్పటికే పూర్తయిన వాటికి కూడా దొడ్డిదారిన దాన్ని వర్తింపజేస్తూ దాదాపు రూ.100 కోట్లు కాంట్రాక్టర్లకు ‘చెల్లించేశారు’. భారాన్నంతా కొనుగోలుదారులపై మోపేం దుకు గుట్టుచప్పుడు కాకుండా ధరలను భారీగా పెంచేశారు. 2013 డిసెంబర్ 16వ తేదీ వరకు త్రిబుల్ బెడ్‌రూమ్ ఇంటి ధర రూ.33 లక్షలుండగా 17వ తేదీ నుంచి రూ.43.86 లక్షలకు, సింగిల్ బెడ్‌రూమ్ ఇంటి ధర రూ.14 లక్షల నుంచి రూ.18.49 లక్షలకు పెరిగింది. ఇలా ప్రతి విభాగంలోనూ ధరలకు రెక్కలొచ్చాయి.
టీఎన్‌జీవోలకు శాపం...
హైదరాబాద్‌లో చేపట్టిన బండ్లగూడ ప్రాజెక్టును సరసమైన ధరలకు టీఎన్‌జీవోలకు విక్రయించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ మేరకు అధికారులు తాజాగా వాటి ధరలు తగ్గించారు. అయితే జీవో 35ను వర్తింప చేయకముందు (2013 డిసెంబర్ 17కు ముందు) ఉన్న ధరల కంటే ఈ తగ్గింపు ధరలు దాదాపు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఎక్కువగా ఉండటం గమనార్హం. కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించే నిర్ణయం తీసుకుని ఉండకపోతే బండ్లగూడ స్వగృహ ఇంటి ధరలు దాదాపు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తగ్గేవి.
నేడుహైలెవల్ కమిటీ సమావేశం...
స్వగృహపై నిర్ణయాలు తీసుకోవటానికి సీఎస్ అధ్యక్షతన ఏర్పాటైన ఐదుగురు సభ్యుల హైలెవల్ కమిటీ సోమవారం భేటీ అవుతోంది. స్వగృహ ధరలు చదరపు అడుగుకు రూ.1,800 మించకుండా చూడాలంటూ టీఎన్‌టీవోలు చేసిన ప్రతిపాదనపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. స్వగృహ భూములకు విలువ కట్టకపోతే ఇది సాధ్యమనే అభిప్రాయముంది. దీనిపై చర్చించవచ్చు.