పరిమితికి మించిప్రయాణికులు ఎక్కడంతో బస్సును నిలిపివేసిన ఆర్టీసీ డ్రైవర్
హుజూరాబాద్: ‘ఫుట్‌బోర్డుపై మీరు నిలబడితే నాకు సైడ్ మిర్రర్ కనిపిస్త లేదు. అద్దం చూడకుండా బస్సు నడపలేను. ఇంతమందితో బస్సు ముందుకు పోవాలంటే కష్టమే.. కనీసం స్టీరింగ్ తిరుగుతలేదు. కొందరు దిగాల్సిందే..’అంటూ ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సును నడిరోడ్డుపై నిలిపివేశాడు.
ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్‌కు వెళ్తోంది. దారిలో హుజూరాబాద్ బస్టాండ్‌లో ఆగింది. అప్పటికే బస్సునిండా ప్రయాణికులు ఉన్నారు. నిల్చునేందుకు కూడా స్థలం లేదు. అయినప్పటికీ బస్టాండులో వరంగల్ వెళ్లేవారు మరికొంతమంది ఎక్కారు. డ్రైవర్ ఓవర్ లోడ్ అవుతోందని, బస్సు నడిపే పరిస్థితి ఉండదని ప్రయాణికులను వారించినా వినిపించుకోలేదు.
బస్సు బస్టాండ్ నుంచి బయటకు వచ్చిన తరువాత డ్రైవర్‌కు సైడ్ మిర్రర్ కనిపించడం లేదు. దీంతో అద్దం కనిపించడం లేదని, వెనకనుంచి వచ్చే వాహనాలను గమనించకుండా బస్సుని నడపలేనని డ్రైవర్ బస్సును రోడ్డుపై నిలిపివేశాడు. ఇంతమంది ఎక్కితే కనీసం బస్సు స్టీరింగ్ తిరగడం లేదని చెప్పాడు. ప్రయాణికులు సహకరించి కొందరు దిగిపోవాలని అభ్యరి్థంచాడు. దీంతో కొంతమంది దిగిపోవడంతో బస్సు వరంగల్ బయల్దేరింది.
Comments
Please login to add a commentAdd a comment