కుర్రాళ్లోయ్.. వేలాడాలోయ్..,లేడీస్ స్పెషల్ ఫుట్‌బోర్డు ఫుల్
నగరంలో ప్రయాణం నరకంగా మారింది. అరకొర బస్సులతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతి మార్గంలో సరిపడా బస్సులు లేకపోవడం... ఉన్నా కొన్ని సమయానికి రాకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. ఒకట్రెండు బస్సులు వస్తే కళాశాలకు సకాలంలో వెళ్లాలనే ఆత్రుతతో ప్రమాదకరంగా ఫుట్‌బోర్డుపై వేలాడుతూ వెళ్తున్నారు. ఫుట్‌బోర్డు, బస్ టాప్‌పై ప్రయాణిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక బస్సులపై ఆశలు వదులుకొని ఆటోలు, బైకులపై వెళ్తూ విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు నడపలేకపోతున్న గ్రేటర్ ఆర్టీసీ నిర్లక్ష్యానికి నిదర్శనమిది. నగరంలో విద్యార్థుల బస్సు బాధలపై ‘సాక్షి’ సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల నిర్వహించిన విజిట్‌లో అనేక అంశాలు వెలుగుచూశాయి.
విద్యార్థులు 3 లక్షలు.. బస్సులు 750
నగరవ్యాప్తంగా విస్తరించిన స్కూళ్లు, కళాశాలల్లో సుమారు 3లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇంతమంది విద్యార్థులకు ఆర్టీసీ నడుపుతున్న బస్సులు కేవలం 750 మాత్రమే. సిటీలో మొత్తం 3,500 ఆర్టీసీ బస్సులుండగా... వీటిలో 900 బస్సులను విద్యార్థుల కోసం నడుపుతున్నామని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. నిజానికి విద్యార్థుల కోసం నడుపుతున్న బస్సులు 750 మాత్రమే. పోనీ 900 బస్సులు అయినా.. 3లక్షల మంది విద్యార్థులకు ఏమాత్రం సరిపోతాయి?
శివార్లలోని మైసమ్మగూడ, దుండిగల్, దూలపల్లి, బాచుపల్లి, పేట్‌బషీరాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, వికారాబాద్, ఇబ్రహీంపట్నం, గండిపేట్, చిల్కూరు, ఫిర్జాదీగూడ, ఘట్‌కేసర్, కాసివాని సింగారం, బాటసింగారాం, అబ్దుల్లాపూర్‌మెట్, మజీద్‌పూర్, కొత్తగూడెం, హయత్‌నగర్, తట్టి అన్నారం తదితర ప్రాంతాల్లో వృత్తివిద్యా కళాశాలలు ఉన్నాయి. ఒక్క పేట్‌బషీరాబాద్, దూలపల్లి ప్రాంతాల్లోనే 50కి పైగా విద్యాసంస్థలున్నాయి. ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణిస్తారు. సరిపడా బస్సులు లేకపోవడంతో చాలా మంది బైకులపై వెళ్తున్నారు.
మెహదీపట్నం మరో ప్రమాదకరమైన జోన్. రన్నింగ్‌లో బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు నెలకు సగటున 4–5 నమోదవుతున్నాయి. ఉదయం 7–9 గంటలు, సాయంత్రం 3–5 గంటల ప్రాంతంలో విద్యార్థుల రద్దీ తీవ్రంగా ఉంటుంది. కానీ ఈ వేళల్లోనే బస్సుల కొరత ఉంటోంది. హయత్‌నగర్ మార్గంలో అబ్దుల్లాపూర్‌మెట్ వరకే సిటీ బస్సులు పరిమితమవుతున్నాయి. కానీ అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెంలో పదుల సంఖ్యలో కళాశాలలున్నాయి. దీంతో విద్యార్థులు రెండు, మూడు బస్సులు మారాల్సి వస్తోంది. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సుల బాధ భరించలేక బైక్‌లపై ముగ్గురు, నలుగురు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.
బస్సెక్కిన ఎమ్మెల్యే
‘బస్సు’ బాధలు వర్ణనాతీతం
ఉప్పల్‌లో బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడంలో సంబంధిత శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అలసత్వాన్ని నిరసిస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ అసెంబ్లీకి సోమవారం ఆర్టీసీ బస్‌లో వెళ్లారు. ఆయన మాట్లాడుతూ... బస్ టెర్మినల్ ఏర్పాటుపై చాలాసార్లు మంత్రికి విన్నవించినా పెడచెవిన పెట్టారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా మంత్రి చొరవ చూపడం లేదన్నారు. ఉదయం 8:30 గంటలకు ఉప్పల్ బస్టాండ్‌లో 113/ఎం నెంబర్ ఆర్టీసీ మెట్రో బస్సెక్కి అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే తన గంట ప్రయాణ అనుభవాన్ని ‘సాక్షి’కి వివరించారు. ‘బస్సు’ బాధలు వర్ణణనాతీతమన్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్లపైనే నిలబడడం కనిపించింది. చాలాచోట్ల రద్దీ విపరీతంగా ఉంది. సరిపడా బస్సులు లేవు. ఎంతోమంది ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తూ కనిపించారు. అదీగాక చాలా వరకు డొక్కు బస్సులే ఉన్నాయి. ఆర్టీసీ బస్‌లో ఆలస్యమవుతుందనే ఉద్దేశంతోనే గంటన్నర ముందుగా ప్రయాణానికి సిద్ధమయ్యాను. – ఉప్పల్
కాలుపెట్టే స్థలం లేదు..
ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్ వచ్చాక మైసమ్మగూడకు వెళ్లేందుకు రెండున్నర గంటల సమయం పడుతోంది. ఏ బస్సు ఎక్కుదామన్నా కాలుపెట్టే స్థలం ఉండడం లేదు. ఉదయం 6 గంటలకు కళాశాలకు బయలుదేరితే తిరిగి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలు అవుతోంది. – ఉదయ్‌కిరణ్, విద్యార్థి
ప్రయాణానికే సరి..
బస్సుల్లో స్థలం ఉండడం లేదు. బోయిన్‌పల్లి నుంచి సికింద్రాబాద్, అక్కడి నుంచి బోయిన్‌పల్లి మీదుగా బహదూర్‌పల్లి వెళ్తున్నాం. ప్రయాణం కోసమే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది.
– శ్రీలత, ఇంజినీరింగ్ విద్యార్థిని
ఆటోల్లోనే..
బస్ పాస్‌కు డబ్బులు వృథా అవుతున్నాయి. నెలలో చాలాసార్లు ఆటోల్లోనే కళాశాలకు వెళ్లాల్సి వస్తోంది. బహదూర్‌పల్లి వెళ్లేందుకు బోయిన్‌పల్లి బస్ స్టాప్ వద్ద రెండు గంటలు వేచి చూడాల్సి వస్తోంది. పాస్ ఉన్నప్పటికీ రోజుకు రూ.50 ఖర్చు చేసుకొని ఆటోల్లో వెళ్తున్నాం. – చంద్ర, విద్యార్థిని
ఫుట్‌బోర్డు ప్రయాణమే దిక్కు
⇔ పాతబస్తీలో సంతోష్‌నగర్–చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారి, నయాపూల్–బహదూర్‌పురా ప్రధాన రహదారులలో సకాలంలో బస్సులు లేవు.
⇔ బండ్లగూడలోని అరోరా, మహవీర్, ఇస్లామియా ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
⇔ ఎల్‌బీనగర్, వనస్థలిపురం, సాగర్‌రింగ్‌రోడ్డు, కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డినగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులు నరకం చవి చూస్తున్నారు.
⇔ దూలపల్లి, మైసమ్మగూడ, దుండిగల్, కండ్లకోయ ప్రాంతాల్లో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు.
⇔ సికింద్రాబాద్–బహదూర్‌పల్లికి బస్సులు ఏ మాత్రం చాలడం లేదు.
⇔ లేడీస్ స్పెషల్ బస్సులూ సరిపోకపోవడంతో విద్యార్థినిలు సైతం ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది.
⇔ చందానగర్, మియాపూర్–మేడ్చల్, ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లే విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు.
⇔ మలక్‌పేట్, మహేశ్వరం, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో విద్యార్థులకు కష్టాలు నిత్యకృత్యమయ్యాయి.
⇔ దిల్‌సుఖ్‌నగర్, మీర్‌పేట్, గుర్రంగూడ, ఆర్‌కేపురం, సరూర్‌గర్, సైదాబాద్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లోనిæ చౌరస్తాల్లో విద్యార్థులు బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. సమయానికి బస్సులు రాక కళాశాలలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోంది.
⇔ యాప్రాల్ వైపు వెళ్లే విద్యార్థులు ఈసీఐఎల్, నేరేడ్‌మెట్, మల్కాజిగిరి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. యాప్రాల్ నుంచి ఈసీఐఎల్‌కు బస్ సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
⇔ ఆల్విన్ కాలనీ నుంచి అతి తక్కువ బస్సులు ఉండడంతో విద్యార్థులు నిత్యం ఫుట్‌బోర్డు ప్రయాణమే చేయాల్సి వస్తోంది.
⇔ సికింద్రాబాద్ స్టేషన్–మేడ్చల్, సికింద్రాబాద్–బహదూర్‌పల్లి, మైసమ్మగూడ, దూలపల్లి రూట్లలో 15వేల మంది విద్యార్థులు రా>కపోకలు సాగిస్తుండగా, 94 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి.
⇔ మేడ్చల్ మార్గంలో 9 వేల మంది విద్యార్థులు ఉండగా, 89 బస్సులు నడుస్తున్నాయి. బహదూర్‌పల్లి మీదుగా 6వేల మంది విద్యార్థులు ప్రయాణం చేస్తుండగా, ఈ రూట్‌లో కేవలం 5 బస్సులు మాత్రమే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment