- ఆదాయం జీతభత్యాలకే సరిపోతోంది
- మంత్రి రామలింగారెడ్డి
సాక్షి, బెంగళూరు : ఒకటి రెండు రోజుల్లో కేఎస్‌ఆర్టీసీ (కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ) తోపాటు ఈశాన్య, వాయువ్య విభాగాల బస్సు టికెట్టు ధరలను పెంచబోతున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. ఇంధన, నిర్వహణ వ్యయం పెరుగుతుండటం వల్ల ప్రయాణికులపై భారం వేయక తప్పడం లేదని అన్నారు. బెంగళూరులోని బీఎంటీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రోడ్డు రవాణా సంస్థకు వస్తున్న మొత్తం ఆదాయంలో ఎక్కువ భాగం సిబ్బంది జీతభత్యాలకు, డీజిల్ కొనుగోలుకు వెచ్చిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే టికెట్టు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. టికెట్టు ధరల పెంపు 7 నుంచి 8 శాతం మధ్య ఉండవచ్చునని ఆయన తెలిపారు. ఇటీవల పెరిగిన బీఎంటీసీ ధరలతో పోలిస్తే త్వరలో పెంచనున్న కేఎస్‌ఆర్టీసీ టికెట్టు ధరల పెంపు తక్కువని మంత్రి రామలింగారెడ్డి సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
చెన్నై, ఢిల్లీ తదితర నగర సిటీ బస్ సర్వీసులతో పోలిస్తే బీఎంటీసీలో మొదటి, రెండు, మూడో స్టేజీ టికెట్టు ధరలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమని ఆయన అంగీకరించారు. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వస్తే పెంచిన ధరలను తప్పకుండా తగ్గిస్తామన్నారు. అత్యవసర ద్వారం లేని వోల్వో బస్సులను సీజ్ చేసి నిర్వాహకుల నుంచి డాక్యుమెంట్లను అధికారులు స్వాధీన పరుచుకుంటున్నారన్నారు.
ఈ బస్సులను అధికారులే గ్యారేజీలకు తరలిస్తున్నారన్నారు. అక్కడ బస్సులకు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేసిన తర్వాతనే తిరగడానికి అనుమతిస్తామన్నారు. ఈ నిబంధనలు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు రాకపోకలు సాగించే వోల్వో బస్సులకూ వర్తిస్తాయన్నారు. బీఎంటీసీ, కేఎస్‌ఆర్టీసీకి సంబంధించిన స్థలా లు, భవనాలు లీజుకు ఇవ్వడంలో అక్రమాల విషయంపై ఇప్పుడే తాను సమాధానం చెప్పలేనని మంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు.