bus ticket price
-
పండగ సీజన్లో భారీగా సీట్ల బుకింగ్
పండగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బస్ ప్రయాణికుల సంఖ్య 62 శాతం పెరుగుతుందని ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్‌బస్ అంచనా వేసింది. సెప్టెంబర్ 26-30తో పోలిస్తే(పండగలు లేనికాలం) అక్టోబర్ 10-14(దసరా పండగ)కాలంలో ఆన్లైన్లో బస్ సీట్ల బుకింగ్ పెరుగనుందని సంస్థ తెలిపింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి వివిధ నగరాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పండగకు సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. దసరా శనివారం వస్తుండడం, తర్వాత ఆదివారం సెలవు ఉండడంతో ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో రెడ్‌బస్ ఆన్లైన్లో బస్ సీట్ల బుకింగ్‌లలో 62 శాతం పెరుగుదలను అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌కు తేదీ ఖరారుఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చేవారిలో దాదాపు 84 శాతం బుకింగ్‌లు హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ-బెంగళూరు, నెల్లూరు-బెంగళూరు రూట్లలో నమోదవతున్నాయని సంస్థ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని వివిధ పట్టణాలకు ప్రయాణించే వారి బుకింగ్ల్లో 16 శాతం హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, ఖమ్మం-హైదరాబాద్, హైదరాబాద్-ఖమ్మం రూట్లు ఉన్నాయని పేర్కొంది. -
ఓటర్లకు బస్ టికెట్లో రాయితీ.. ఎంతంటే..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదిత శాతం పెంచాలని ఎన్నికలసంఘం ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ కంపెనీలు ఓటు శాతం పెంచేలా తమ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘అభిబస్’ ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.ఈమేరకు సంస్థ సీఈఓ లెనిన్ కోడూరు, సీఓఓ రోహిత్ శర్మ మాట్లాడారు. ‘తెలుగు రాష్ట్రాల్లో మే 11 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ABHIVOTE కూపన్ కోడ్ ఉపయోగించి టికెట్ ధరలో కనీసం 20 శాతం నుంచి గరిష్ఠంగా రూ.250 వరకు రాయితీ పొందొచ్చు. దీంతోపాటు రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా పొందే వీలుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ గతంలో ఓటర్లకు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట్ ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పింది. -
AP: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది. బస్సులు ఛార్జీలు తగ్గిస్తున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా చార్జీలను 20 శాతం వరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 30వరకూ చార్జీల తగ్గింపు అమలులో ఉండనున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. కాగా.. రూట్లు, చార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయం ఆర్ఎంలకు అప్పగించినట్టు స్పష్టం చేసింది. బస్సుల్లో తగ్గించిన చార్జీలు ఇవే.. - అమరావతి, గరుడ, వెన్నెల బస్సు చార్జీల్లో 10 శాతం తగ్గింపు - విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్ బస్సుల్లో 20 శాతం తగ్గింపు - హైదరాబాద్-విజయవాడ ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపు - విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు బస్సుల్లో 20 శాతం తగ్గింపు. -
ఊరికి పోతే... జేబుకు వాతే!
సాక్షి హైదరాబాద్: ఏటా అదే తంతు. అదే దోపిడీ. పండగొచ్చిందంటే చాలు ప్రయాణికుల జేబులు లూటీ. కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన వందలాది బస్సులు, టూరిస్ట్ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు సంక్రాంతి దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నాయి. డిమాండ్‌కు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో నగర వాసులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేసి ‘పండగ’ చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.350 వరకు చార్జీ ఉంటే సంక్రాంతి సందర్భంగా రూ.600 నుంచి రూ.700కు పెంచారు. చార్జీలను పెంచొద్దంటూ ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన బస్సులన్నీ స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్నాయి. ఆన్లైన్లో ప్రయాణికులకు టిక్కెట్ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. అయినప్పటికీ రవాణా అధికారులు మొక్కుబడి తనిఖీలకు పరిమితమవుతున్నారు. అడ్డగోలుగా.. ఈ నెల 8 నుంచి 16 వరకు పిల్లలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. పైగా ఏపీలో సంక్రాంతి వేడుకలకు ఉండే ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా సొంత ఊరుకు వెళ్తున్నారు. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. కొద్దిరోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే ప్రకటించిన మరో 16 ప్రత్యేక రైళ్లల్లోనూ కేవలం రెండు రోజుల్లో బెర్తులు భర్తీ అయ్యాయి. నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రైళ్లు, ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేట్‌లోనూ ముందస్తు బుకింగ్‌లకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చార్జీలను అడ్డగోలుగా పెంచారు. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు సాధారణ రోజుల్లో రూ.900 వరకు ఉంటే ఇప్పుడు రూ.1600పైనే తీసుకుంటున్నారని కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి సొంతంగా కారు బుక్ చేసుకొని వెళ్లాలన్నా, కొంతమంది ప్రయాణికులు మినీ బస్సు బుక్ చేసుకోవాలనుకున్నా రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చవుతుంది. ‘సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరెళ్లాలని ఉంది. కానీ నలుగురం వెళ్లి, తిరిగి రావడానికి చార్జీలే రూ.10 వేలు దాటేటట్లుంది’ అని సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ 4,318 అదనపు బస్సులు.. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 7 నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఏపీలోని దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు 550 బస్సుల్లో రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏపీలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు ఇవి నడుస్తాయి. -
బాబు సర్కారులో అన్నీ భారాలే..!
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్ర బాగుపడాలంటే తానే దిక్కంటూ.. అలవికాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత ప్రజలను వంచించింది. ఐదేళ్లూ ‘పన్ను’ గాట్లతో సామాన్యుల రక్తం జలగలా పీల్చింది. జేబులు కొల్లగొట్టింది. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలతోపాటు.. ఆస్తి, ఇతర పన్నులను భారీగా పెంచేసింది. పేద, మధ్యతరగతివర్గాల వారిపై మోయలేని భారం మోపి వారి నడ్డివిరిచింది. సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): విద్యుత్ వినియోగదారులపై 2016లో చార్జీల భారం మోపారు. ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో కేటగిరీ బీ–2లో గృహేతర, వాణిజ్య వినియోగదారుల సర్వీసులు 73,039 ఉండగా వాటి ద్వారా ప్రస్తుతం నెలకు సుమారు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగమవుతోంది. దీని నిమిత్తం నెలకు సుమారు రూ.12.39 కోట్లను ఆయా వాణిజ్య వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఈ కేటగిరీపై యూనిట్‌కు 18 పైసలు భారం వేయడంతో నెలకు సుమారు రూ.24 లక్షలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. అలాగే జిల్లాలోని 4,331 పరిశ్రమలు ఇప్పటి వరకూ ప్రతినెలా సుమారు 1.19 కోట్ల యూనిట్ల విద్యుత్ వినయోగిస్తూ సుమారు రూ.8.23 కోట్ల మేరకు బిల్లులు చెల్లిస్తున్నారు. విద్యుత్ చార్జీల మోత పరిశ్రమల విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు 13 పైసలు పెంచడంతో వారిపై సుమారు రూ.15.47 లక్షల రూపాయలు నెలకు అదనంగా భారం పడింది. ఇదిలా ఉండగా విద్యుత్ చార్జీల పెంపు విషయంలో పంచాయతీలను, మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కూడా ప్రభుత్వం విడిచిపెట్టలేదు. ప్రజలకు అత్యవసరమైన వీధిలైట్ల వినియోగం, నీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌పై సైతం పెంపుదల భారం పడింది. వాటిపైనా యూనిట్‌కు 11 నుంచి 13 పైసలు పెంచారు. దీంతో అప్పటికే సుమారు రూ.142 కోట్ల విద్యుత్ బిల్లులు తూర్పుప్రాంత విద్యుత్ సంస్థకు బకాయిపడ్డ పంచాయితీలు ప్రజాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే అంశంలో పునరాలోచనలో పడ్డాయి. వీటితోపాటు విద్యా వ్యవస్థను కూడా చంద్రబాబు ఉపేక్షించలేదు. ప్రభుత్వ రంగ హాస్టళ్లు, పాఠశాలలపైనా యూనిట్‌కు 14 పైసలు చొప్పున భారం వేశారు. మొత్తంగా వివిధ కేటగిరీల్లో పెంచిన విద్యుత్ చార్జీల ప్రభావం జిల్లా వాసులపై నెలకు రూ.కోటి, ఏడాదికి రూ.12కోట్లు పడింది. జిల్లా ప్రజలపై ఏటా అదనపు భారం ఇలా.. రూ.కోట్లలో విద్యుత్ చార్జీలు -12 కోట్లు ఇంటిపన్ను- 33 కోట్లు ఆర్టీసీ వడ్దన - 33.60 కోట్లు ఆర్టీసీ చార్జీలు ఇలా.. ఇక సామాన్య ప్రజల రవాణా అవసరాలు తీర్చే ఆర్టీసీపైనా ప్రభుత్వం కనికరం చూపలేదు. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే 2015లో ఆర్టీసీ ప్రయాణ టిక్కెట్ ధరలను అమాంతం పెంచేసింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు (ప్యాసింజర్) బస్సుల టిక్కెట్ ధర అప్పట్లో కిలో మీటరుకు 59 పైసలు ఉండగా దానిపై 5 శాతం ధర పెంచింది. అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సుల ధరలు కిలో మీటరుకు 79 పైసలుండగా దానిని 8 పైసలు పెంచి 87 చేయగా, డీలక్స్ బస్సులకు 89 పైసలుండగా 9 పైసలు పెంచి 98 పైసలు చేసింది. వీటితో పాటు సూపర్ లగ్జరీ బస్సులకు 105 పైసలుండగా 11 పైసలు పెంచి 116 పైసలు, ఇంద్ర బస్సులకు 132 పైసలుండగా 14 పైసలు పెంచి 146 పైసలు, గరుడ బస్సులకు 155 పైసలుండగా 16 పైసలు పెంచి 171 పైసలు, గరుడ ప్లస్ బస్సులకు 165 పైసలుండగా 17 పైసలు పెంచి 182 పైసలుగా నిర్ణయించి వసూలు చేయడం ప్రారంభించింది. ‘టోలూ’ వలిచింది ఇదిలా ఉంటే.. టోల్ గేట్ చార్జీలు మినహాయిస్తే ఆర్టీసీ చార్జీలు తగ్గే అవకాశం ఉన్నా.. ఆ చార్జీల బారాన్ని కూడా ప్రయాణికులపైనే మోపింది. బస్సు ప్రయాణికుడు ప్రతి టోల్‌గేట్‌పై అక్షరాలా రూ.ఏడు చెల్లించాల్సి వస్తోదంటే ప్రభుత్వం వారిపై ఏవిధంగా చీకటి దెబ్బలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్టీసీ పశ్చిమ రీజియన్ పరిధిలో రోజుకు సుమారు 1.08 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా వారందరిపై ఈ భారంపడుతోంది. ‘సెస్సా’దియ్యా.. మరో విచిత్రం ఏమిటంటే సేఫ్టీ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై అదనపు భారం వేసి జేబులు గుల్ల చేస్తోంది. ప్రతి ఎక్స్‌ప్రెస్ టిక్కెట్‌పై ఒక రూపాయిని సేఫ్టీ సెస్‌గా వసూలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చీకటి దోపిడీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇంటి పన్నుపోటూ ఎక్కువే పేదలకు నిలువ నీడ కోసం గృహాలు కట్టించి ఇవ్వాల్సిన ప్రభుత్వం, రెక్కల కష్టంతో తినీ తినకా రూపాయి, రూపాయి పోగుచేసుకుని ఇల్లు కట్టుకుంటే దానిపై పన్నుల రూపంలో భారీ దోపిడీకి తెర లేపింది. గత ఏడాది తాజాగా ఇంటిపన్నును అమాంతం 20 శాతం పెంచేసింది. దీంతో సామాన్యులు సతమతమవుతున్నారు. పల్లెల్లోనూ పన్నులు భారీగా పెరిగాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్ను డిమాండ్ గత ఏడాదికి పూర్వం రూ.165 కోట్లు ఉండగా, గత ఏడాది నుంచి ఆ డిమాండ్ కాస్తా మరో రూ.33 కోట్లు పెరిగి సుమారు రూ.198 కోట్లకు చేరుకుంది. ఏటా ఇది పెరిగే అవకాశం ఉంది. అద్దెలూ పెరిగాయి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలకు గృహాలు ఇస్తామని చెప్పడం తప్ప ఇచ్చిన పాపాన పోలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ నియోజకవర్గాల్లో కొన్ని ఇళ్ళు నిర్మించిన ప్రభుత్వం వాటిని కేవలం టీడీపీ వారికే కేటాయించింది. దీంతో అర్హులు అద్దె ఇళ్లలోనే మగ్గాల్సి వస్తోంది. ఇంటిపన్నులు పెరగడంతో యజమానులు అద్దెలూ పెంచేశారు. సామాన్యులపై భారం సిగ్గు చేటు ఇంటిపన్ను రూపంలో 20 శాతం పెంచడం దారుణం. సామాన్యులపై ప్రభుత్వం ఈ విధంగా కక్ష సాధిస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప కష్టపడి ఇళ్ళు నిర్మించుకున్న వారిపై పన్నుల భారం మోపడం సబబు కాదు. – కడలి రామ్మోహనరావు, ఏలూరు టీడీపీ పాలనలో నరకమే.. టీడీపీ అధికారంలోకి వస్తోందంటేనే సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో తొమ్మిదేళ్ళ పాలనలో నరకం చూపించిన ప్రభుత్వం అనంతరం 2014 నుంచి మరోసారి తన ప్రతాపం చూపుతోంది. ఈ ప్రభుత్వాన్ని భరించడం మా వల్ల కాదని ప్రజలు లబోదిబోమంటున్నారు. – మువ్వల నాగేశ్వరరావు, ఏలూరు అభివృద్ధి శూన్యం టీడీపీ అధికారం చేపట్టిన ఏడాదికే పన్నుల మదింపు తీసుకురావడంతో ఇంటి పన్నులు పెరుగుతున్నాయి. ఏటా ఐదు శాతం చొప్పున పన్నును పెంచి వసూలు చేస్తున్నారు. భవనం, భూముల విలువను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ పన్నులు విధించడంతో పేదలు, సామాన్యులకు భారంగా మారింది. రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో ఏ పని చేపట్టాలన్నా పంచాయతీ పన్నులతోపాటు, ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడుతున్నాయి. –గెడ్డం రవీంద్రబాబు, మాజీ ఉపసర్పంచ్, సమిశ్రగూడెం -
పల్లెవెలుగుకు అల్ట్రా బాదుడు
విశాఖపట్నం, సీలేరు(పాడేరు): ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే అంతర్రాష్ట్ర ప్రయాణికులకు ఆర్టీసీలో సుఖమైన ప్రయాణమని, సరైన ధరతో గమ్యస్థానాలకు తీసుకువెళ్తామని చెబుతూ ఆర్టీసీ అధికారులు తమను మోసం చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆన్లైన్లో అల్ట్రా.. తీరా చూస్తే ప్యాసింజర్ విశాఖపట్నం(మధురవాడ) నుంచి తెలంగాణా రాష్ట్రం భద్రాచలానికి ఆర్టీసీ రోజూ రెండు సర్వీసులను నడుపుతోంది. ఈ బస్సు రాత్రి 7.30 గంటలకు విశాఖలో బయల్దేరి అర్ధరాత్రి 3 గంటలకు సీలేరు వచ్చి, అక్కడి నుంచి ఉదయం 7గంటలకు భద్రాచలం చేరుకుంటుంది. సాయంత్రం 5.30గంటలకు భద్రాచలంలో బయల్దేరిన బస్సు ఉదయం 6గంటలకు విశాఖ చేరుకుంటుంది. ప్రయాణికులకు టిక్కెట్ చార్జీ రూ.475. ఆ ధరకు అల్ట్రా డీలక్స్‌లో పుష్ బ్యాక్ సీట్లు, వినోదానికి టీవీలు ఉండి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేర్చాలి. కాని మధురవాడ డిపో అధికారులు ఎక్స్‌ప్రెస్ టికెట్ ధర తీసుకుని ఆన్‌లైన్‌లోనూ అల్ట్రా డీలక్స్ అని చూపించి తీరా బస్సు బయల్దేరే సమయంలో అది తొలగించి.. పల్లె వెలుగు బస్సులను నడుపుతున్నారు. పది రోజులుగా ఇదే పరిస్థితి. నివ్వెరపోతున్న ప్రయాణికులు వందల కిలోమీటర్లు దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో రిజర్వేషన్ చేయించుకుని అదే బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు గత్యంతరం లేక పల్లెవెలుగు బస్సే ఎక్కుతున్నారు. రోజూ ఆ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు సిబ్బందికి మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. సిబ్బంది తమకేమీ సంబంధం లేదని సమాధానం చెబుతున్నారు. 170కి.మీ. ఘాట్ రోడ్డే.. విశాఖపట్నం నుంచి భద్రచలానికి వెళ్లాలంటే సుమారు 400 కిలోమీటర్లు దూరం. నర్సీపట్నం నుంచి సీలేరు వరకు దాదాపు 170 కి.మీ. ఘాట్‌రోడ్డు. అదీగాక ఆర్వీ నగర్ నుంచి సీలేరు వరకు 70కి.మీ రోడ్డు అధ్వానం. అదీ రాత్రి వేళ ప్రయాణం. దీంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. గోతుల్లో ఈ బస్సుల్లో ప్రయాణం చేయలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ వేళ బస్సులేవీ? విశాఖ నుంచి సీలేరు మీదుగా అంతర్రాష్ట్రాలకు వెళ్లే ఘాట్ రోడ్డులో తగినన్ని బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ మార్గంలో బస్సులు లేకపోవడంతో ఉన్న రెండు మూడు బస్సుల్లోనే వందలాది కిలోమీటర్లు బస్సుల్లో నిల్చుని ప్రయాణించవలసిన పరిస్థితి. విశాఖ డిపోకు చెందిన బస్సులు రోజు వారీగా రెండు వైపులా ఐదు బస్సులను మాత్రమే నడుపుతున్నారు. ఇవన్నీ దూర ప్రాంతాల నుంచి రావడంతో అక్కడే ప్రయాణికులతో పూర్తిగా నిండిపోతుంది. దీంతో మార్గమధ్యలో ఎక్కే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో విశాఖ నుంచి సీలేరుకు వచ్చే బస్సులను తొలగించారు. మళ్లీ ఆ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఈ ప్రాంత ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సీలేరు, మల్కన్‌గిరి సర్వీసు పునరుద్ధరించాలి ఘాట్ రోడ్డులో ఆర్టీసీకి ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుంది. ఇలా బస్సు సర్వీసులను తొలగించడం అన్యాయం. సీలేరు నైట్‌హాల్ట్, మల్కన్‌గిరి బస్సు సర్వీసును పునరుద్ధరించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.– రాజుచిత్రకొండ, సీలేరు -
ఒక్క టికెట్.. 24 గంటలు..
సాక్షి, సిటీబ్యూరో :నగరమంతా విస్తృతంగా పర్యటించాలనుకుంటున్నారా.. చారిత్రక ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు, పార్కులు, ఆలయాలు సందర్శించాలనుకుంటున్నారా.. అయితే నో ప్రాబ్లమ్. అందుకోసం కేవలం ఒకే ఒక్క బస్సు టికెట్ చాలు. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిశ్చింతగా ప్రయాణం చేయొచ్చు. అందుబాటులో ఉన్న ఏ బస్సులో అయినా వెళ్లవచ్చు. ఆ ఒక్క టికెట్‌తో 24 గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అదే ‘ట్రావెల్–24’.(టీ–24). గ్రేటర్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన 24 గంటల టికెట్. పర్యాటకులు, సందర్శకుల కోసం ప్రవేశపెట్టిన దీనికి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. లక్షలాది మంది పర్యాటకులు, సందర్శకులు ఈ టికెట్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల దృష్ట్యా దీని వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అంచనా వేస్తోంది. నగరానికి కొత్తగా వచ్చేవాళ్లు, ఒకే రోజుకు ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించాలనుకొనే ప్రయాణికులకు టీ–24 ఎంతో ప్రయోజనకరం. ప్రయాణ ఖర్చులను ఆదా చేసేందుకు దీంతో అవకాశం లభిస్తుంది. టూరిస్ట్ ఫ్రెండ్లీ.. అంతర్జాతీయ స్థాయి హంగులతో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. చార్మినార్, గోల్కొండ కోట, టూంబ్స్, జూపార్కు, బిర్లామందిర్, బిర్లా సైన్స్ ప్లానెటోరియం వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు, పార్కులు, వివిధ పర్యాటక స్థలాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తదితర రాష్ట్రాల నుంచి ఏటా 8.5 కోట్ల మంది నగరానికి వస్తున్నారు. ప్రతి రోజు సుమారు 2.45 లక్షల మంది సందర్శిస్తున్నారు. అలాగే మరో 2.5 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఏటా నగరాన్ని సందర్శిస్తున్నారు. విదేశీ టూరిస్టులు ఆర్టీసీ టీ–24 టికెట్లను పెద్దగా వినియోగించడం లేదు. కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు మాత్రం వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ అంచనా వేసింది. దీంతో ఈ ఏడాది ఈ టికెట్లను వినియోగించే వారి సంఖ్య 20 లక్షలు దాటిపోయింది. కేవలం పర్యాటకులు, సందర్శకులే కాకుండా నగర వాసులు కూడా టీ–24 టిక్కెట్లను బాగా వినియోగించుకుంటున్నారు. మరోవైపు వీటి వినియోగం కోసం ఆర్టీసీ చేపట్టిన ప్రచారం, సిబ్బందికి అందజేసే ప్రోత్సాహకాలు కూడా సత్ఫలితాలను ఇచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ తెలిపారు. ఆదరణ అదరహో.. ఈ టిక్కెట్లు ప్రయాణికులకు బహుళ ప్రయోజనాన్ని అందజేయడమే కాకుండా ఆర్టీసీకి సైతం గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతి రోజు సుమారు 5,000 టికెట్లను విక్రయిస్తున్నారు. 2016లో 19,59,134 మంది వీటిని వినియోగించగా, ఆ ఏడాది ఆర్టీసీకి రూ.15.60 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాది 20,24,711మంది కొనుగోలు చేశారు. ఆర్టీసీ రూ.16.20 కోట్ల ఆదాయం సముపార్జించింది. టీ–24 వినియోగదారుల సంఖ్య ఏడాది కాలంలోనే 65,577కి పెరిగింది. ఈ వేసవిలో మరో లక్ష మందికిపైగా వినియోగించే అవకాశం ఉంది. ఏ బస్సుకైనా సరే.. నగరంలో సుమారు 3,850 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఏసీ, నాన్ఏసీ కేటగిరీలలో టీ–24 టిక్కెట్లను అందజేస్తున్నారు. ఎయిర్‌పోర్టు, హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సుమారు 150 బస్సుల్లో వినియోగించే టీ–24 టికెట్లు రూ.160కి లభిస్తాయి. ఈ టికెట్‌తో ప్రయాణికులు ఏసీ బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లోనూ ప్రయాణం చేయవచ్చు. రూ.80కే రోజంతా ప్రయాణం చేసే మరో టీ–24 టికెట్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు వర్తిస్తుంది. ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో వీటిని అనుమతిస్తారు. డ్యూటీ కండక్టర్ల వద్ద ట్రావెల్–24 టికెట్లు లభిస్తాయి. టిక్కెట్ తీసుకున్న సమయం నుంచి 24 గంటల పాటు ఇది చెల్లుబాటులో ఉంటుంది. -
త్వరలో బస్సు చార్జీలు పెంపు
ఆదాయం జీతభత్యాలకే సరిపోతోంది మంత్రి రామలింగారెడ్డి సాక్షి, బెంగళూరు : ఒకటి రెండు రోజుల్లో కేఎస్ఆర్టీసీ (కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ) తోపాటు ఈశాన్య, వాయువ్య విభాగాల బస్సు టికెట్టు ధరలను పెంచబోతున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. ఇంధన, నిర్వహణ వ్యయం పెరుగుతుండటం వల్ల ప్రయాణికులపై భారం వేయక తప్పడం లేదని అన్నారు. బెంగళూరులోని బీఎంటీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు రవాణా సంస్థకు వస్తున్న మొత్తం ఆదాయంలో ఎక్కువ భాగం సిబ్బంది జీతభత్యాలకు, డీజిల్ కొనుగోలుకు వెచ్చిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే టికెట్టు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. టికెట్టు ధరల పెంపు 7 నుంచి 8 శాతం మధ్య ఉండవచ్చునని ఆయన తెలిపారు. ఇటీవల పెరిగిన బీఎంటీసీ ధరలతో పోలిస్తే త్వరలో పెంచనున్న కేఎస్ఆర్టీసీ టికెట్టు ధరల పెంపు తక్కువని మంత్రి రామలింగారెడ్డి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చెన్నై, ఢిల్లీ తదితర నగర సిటీ బస్ సర్వీసులతో పోలిస్తే బీఎంటీసీలో మొదటి, రెండు, మూడో స్టేజీ టికెట్టు ధరలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమని ఆయన అంగీకరించారు. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వస్తే పెంచిన ధరలను తప్పకుండా తగ్గిస్తామన్నారు. అత్యవసర ద్వారం లేని వోల్వో బస్సులను సీజ్ చేసి నిర్వాహకుల నుంచి డాక్యుమెంట్లను అధికారులు స్వాధీన పరుచుకుంటున్నారన్నారు. ఈ బస్సులను అధికారులే గ్యారేజీలకు తరలిస్తున్నారన్నారు. అక్కడ బస్సులకు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేసిన తర్వాతనే తిరగడానికి అనుమతిస్తామన్నారు. ఈ నిబంధనలు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు రాకపోకలు సాగించే వోల్వో బస్సులకూ వర్తిస్తాయన్నారు. బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీకి సంబంధించిన స్థలా లు, భవనాలు లీజుకు ఇవ్వడంలో అక్రమాల విషయంపై ఇప్పుడే తాను సమాధానం చెప్పలేనని మంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు.