ఒక్క టికెట్‌.. 24 గంటలు.. | One ticket .. 24 hours .. | Sakshi
Sakshi News home page

ఒక్క టికెట్‌.. 24 గంటలు..

Published Tue, Apr 24 2018 2:13 PM | Last Updated on Tue, Apr 24 2018 2:13 PM

One ticket .. 24 hours .. - Sakshi

 సాక్షి, సిటీబ్యూరో :నగరమంతా విస్తృతంగా పర్యటించాలనుకుంటున్నారా.. చారిత్రక ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు, పార్కులు, ఆలయాలు సందర్శించాలనుకుంటున్నారా.. అయితే నో ప్రాబ్లమ్‌. అందుకోసం కేవలం ఒకే ఒక్క బస్సు టికెట్‌ చాలు.

సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిశ్చింతగా  ప్రయాణం చేయొచ్చు. అందుబాటులో ఉన్న ఏ బస్సులో అయినా వెళ్లవచ్చు. ఆ ఒక్క టికెట్‌తో 24 గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది.

అదే  ‘ట్రావెల్‌–24’.(టీ–24). గ్రేటర్‌ ఆర్టీసీ  ప్రవేశపెట్టిన 24 గంటల టికెట్‌. పర్యాటకులు, సందర్శకుల కోసం  ప్రవేశపెట్టిన దీనికి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. లక్షలాది మంది పర్యాటకులు, సందర్శకులు ఈ టికెట్‌ను వినియోగిస్తున్నారు.

ప్రస్తుత వేసవి సెలవుల దృష్ట్యా దీని వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అంచనా వేస్తోంది. నగరానికి కొత్తగా వచ్చేవాళ్లు, ఒకే రోజుకు ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించాలనుకొనే ప్రయాణికులకు  టీ–24 ఎంతో ప్రయోజనకరం. ప్రయాణ ఖర్చులను ఆదా చేసేందుకు దీంతో అవకాశం లభిస్తుంది.  

టూరిస్ట్‌ ఫ్రెండ్లీ.. 

అంతర్జాతీయ స్థాయి హంగులతో  అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు వచ్చే  దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. చార్మినార్, గోల్కొండ కోట, టూంబ్స్, జూపార్కు, బిర్లామందిర్, బిర్లా సైన్స్‌ ప్లానెటోరియం వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు, పార్కులు, వివిధ పర్యాటక స్థలాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తదితర రాష్ట్రాల నుంచి ఏటా 8.5 కోట్ల మంది నగరానికి వస్తున్నారు.

ప్రతి రోజు సుమారు 2.45 లక్షల మంది సందర్శిస్తున్నారు. అలాగే మరో 2.5 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఏటా నగరాన్ని సందర్శిస్తున్నారు. విదేశీ టూరిస్టులు ఆర్టీసీ టీ–24 టికెట్‌లను పెద్దగా వినియోగించడం లేదు. కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు మాత్రం వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ అంచనా వేసింది.

దీంతో ఈ ఏడాది ఈ టికెట్‌లను వినియోగించే వారి సంఖ్య 20 లక్షలు దాటిపోయింది. కేవలం పర్యాటకులు, సందర్శకులే కాకుండా నగర వాసులు కూడా  టీ–24 టిక్కెట్‌లను బాగా వినియోగించుకుంటున్నారు.

మరోవైపు వీటి వినియోగం కోసం ఆర్టీసీ చేపట్టిన ప్రచారం, సిబ్బందికి అందజేసే ప్రోత్సాహకాలు కూడా సత్ఫలితాలను ఇచ్చినట్లు  ఆర్టీసీ  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పురుషోత్తమ్‌ నాయక్‌ తెలిపారు. 

ఆదరణ అదరహో..  

ఈ టిక్కెట్‌లు ప్రయాణికులకు బహుళ ప్రయోజనాన్ని అందజేయడమే కాకుండా ఆర్టీసీకి సైతం గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతి రోజు సుమారు 5,000 టికెట్‌లను విక్రయిస్తున్నారు. 2016లో 19,59,134 మంది వీటిని వినియోగించగా, ఆ ఏడాది ఆర్టీసీకి  రూ.15.60 కోట్ల ఆదాయం లభించింది.

గత ఏడాది 20,24,711మంది కొనుగోలు చేశారు. ఆర్టీసీ రూ.16.20 కోట్ల ఆదాయం సముపార్జించింది. టీ–24 వినియోగదారుల సంఖ్య  ఏడాది కాలంలోనే 65,577కి పెరిగింది. ఈ వేసవిలో మరో లక్ష మందికిపైగా వినియోగించే అవకాశం ఉంది.

ఏ బస్సుకైనా సరే..   

నగరంలో సుమారు 3,850 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఏసీ, నాన్‌ఏసీ కేటగిరీలలో టీ–24 టిక్కెట్‌లను అందజేస్తున్నారు. ఎయిర్‌పోర్టు, హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్‌లకు రాకపోకలు సాగించే సుమారు 150 బస్సుల్లో  వినియోగించే టీ–24 టికెట్‌లు రూ.160కి లభిస్తాయి.

ఈ టికెట్‌తో ప్రయాణికులు ఏసీ బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లోనూ ప్రయాణం చేయవచ్చు. రూ.80కే రోజంతా ప్రయాణం చేసే మరో  టీ–24 టికెట్‌ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు వర్తిస్తుంది. ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో వీటిని అనుమతిస్తారు. డ్యూటీ కండక్టర్‌ల వద్ద ట్రావెల్‌–24 టికెట్‌లు లభిస్తాయి. టిక్కెట్‌ తీసుకున్న సమయం నుంచి 24 గంటల పాటు ఇది చెల్లుబాటులో ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement