బస్సేది.. ఎలా వెళ్లేది..? | People Facing Problems With Lack Of City Bus Transport in Hyderabad | Sakshi
Sakshi News home page

బస్సేది.. ఎలా వెళ్లేది..?

Published Sat, Dec 12 2020 8:31 AM | Last Updated on Sat, Dec 12 2020 8:31 AM

People Facing Problems With Lack Of City Bus Transport in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో ప్రజారవాణా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్‌ కారణంగా నిలిచిపోయిన సిటీ బస్సులు 8  నెలల తర్వాత కూడా పూర్తిస్థాయిలో రోడ్డెక్కలేదు. నగరంలోని వివిధ ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్‌ రైళ్లూ పట్టాలెక్కలేదు. మెట్రో రైళ్లు తప్ప ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయం లేదు. శివారు కాలనీలు, గ్రామాలను నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు అనుసంధానం చేసే సిటీ బస్సులు రద్దయ్యాయి. దీంతో రాత్రి 8 గంటలు దాటితే సిటీలో చిక్కుకున్న ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఆటోలు, క్యాబ్‌ నిర్వాహకులు రెట్టింపు చార్జీలతో ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నారు. ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. ప్రధాన మార్గాల్లోని మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ కార్యాచరణకు నోచుకోలేదు. 

‘చక్ర బంధం’లో సిటీ బస్సు.. 
కోటికి పైగా జనాభా, 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గ్రేటర్‌ అవసరాల మేరకు కనీసం 7,500 బస్సులు అవసరం. రోజురోజుకూ వందల కొద్దీ కొత్త కాలనీలు నగరంలో విలీనమవుతున్నాయి. కానీ ఇందుకు అనుగుణంగా ప్రజారవాణా సదుపాయాల విస్తరణ మాత్రం జరగడం లేదు. 

ఐటీ హబ్‌ విస్తరణతో పాటు ఫార్మాసిటీ వంటి కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఇటు పటాన్‌చెరు నుంచి సదాశివపేట వరకు, అటు ఘట్‌కేసర్‌ నుంచి బీబీనగర్‌ చుట్టుపక్కల ఉన్న పల్లెలకు  హైదరాబాద్‌తో కనెక్టివిటీ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం సిటీ బస్సులు లేకపోవడం వల్ల ప్రజలు సెవెన్‌ సీటర్‌ ఆటోలు, టాటా ఏస్‌లు వంటి వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది.  

మనుగడ ప్రశ్నార్థకం..  
గతేడాది ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘమైన సమ్మె చేపట్టారు. అప్పటి వరకు నగరంలో ప్రతిరోజూ 3,550 బస్సులు 33 లక్షల మందికి రవాణా సదుపాయాన్ని కలి్పంచేవి. 44 వేలకు పైగా ట్రిప్పులు తిరిగేవి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రయాణికులకు సిటీ బస్సులు అందుబాటులో ఉండేవి.  

ఏ రాత్రయినా సరే ఇల్లు చేరుకుంటామనే భరోసా ప్రయాణికులకు ఉండేది. ముఖ్యంగా మహిళలు, సీనియర్‌ సిటిజన్లు ఎలాంటి భయం లేకుండా సిటీ బస్సుల్లో రాకపోకలు సాగించారు.  

సుదీర్ఘ కార్మికుల సమ్మె తర్వాత సిటీ బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. 800 బస్సులను పూర్తిగా విస్మరించారు. నగర శివార్లలోని పల్లెలకు రాకపోకలు సాగించే సుమారు 250

⇔ దీంతో ఇబ్రహీంపట్నం, శంకరపల్లి, చేవెళ్ల, కీసర, పటాన్‌చెరు, ఘట్‌కేసర్‌ తదితర ప్రాంతాల చుట్టూ ఉన్న పల్లెలకు 80 శాతానికి పైగా సిటీ బస్సులు వెళ్లడం లేదు.  

పిడుగుపాటుగా ‘కోవిడ్‌’.. 
రవాణా నిపుణుల అంచనా మేరకు గ్రేటర్‌ అవసరాల మేరకు 7,500 బస్సులు అవసరం. కానీ ఇప్పుడు ఉన్నవి 2,750 మాత్రమే. పైగా కోవిడ్‌ దృష్ట్యా దశలవారీగా బస్సులను పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటి వరకు 50 శాతం బస్సులే రోడ్డెక్కాయి.  

గతంలో రోజుకు 33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే ఇప్పుడు కనీసం 15 లక్షల మందికి కూడా సిటీ బస్సు సౌకర్యం లేకుండా పోయింది.  

సాధారణంగానే ప్రతిరోజూ రూ.కోటి నష్టంతో నడుస్తున్న సిటీ బస్సులకు ఆర్టీసీ కారి్మకుల సమ్మె, కోవిడ్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ మరిన్ని నష్టాలను తెచి్చపెట్టింది. ప్రస్తుతం గ్రేటర్‌ ఆర్టీసీ రూ.550 కోట్లకు పైగా నష్టాల్లో ఉంది.  

బస్సుల సంఖ్య తగ్గించడంతో పాటు సుమారు 2 వేల మందికి పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లను కూడా విధుల నుంచి తప్పించి డిపో అటెండర్లుగా, బంకుల నిర్వాహకులుగా, కార్గో బస్సు సిబ్బందిగా మార్చారు.  

ఎంఎంటీఎస్‌ ఎక్కడ? 
⇔ ప్రతిరోజూ 1.5 లక్షల మందికి రవాణా సదుపాయంఅందజేసే 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు కూడా ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

విస్తరణకు నోచుకోని ఎంఎంటీఎస్‌.. 
కోవిడ్‌ కారణంగా ఎంఎంటీఎస్‌ రైళ్లను నిలిపివేశారు. గతంలో రోజుకు 121 సరీ్వసులు, 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గాల్లో సర్వీసులు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించే రెండో దశ ఎంఎంటీఎస్‌ విస్తరణ ఇప్పటికీ నోచుకోలేదు. ఘట్‌కేసర్‌–సికింద్రాబాద్, పటాన్‌చెరు-తెల్లాపూర్, సికింద్రాబాద్‌-బొల్లారం వంటి మార్గాల్లో లైన్లు పూర్తయినా రైళ్లు మాత్రం పట్టాలెక్కలేదు. నిధుల కొరత ఈ ప్రాజెక్టును వెంటాడుతోంది.   

ఆర్టీసీపై మెట్రో ప్రభావం
గ్రేటర్‌ ఆర్టీసీపై మెట్రో ప్రభావం కూడా పడింది. ప్రస్తుతం నాగోల్‌– రాయదుర్గం, జేబీఎస్‌–ఎంజీబీఎస్, ఎల్‌బీనగర్‌–మియాపూర్‌ రూట్లలో ప్రతిరోజూ 57 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 1200 ట్రిప్పుల్లో ప్రయాణికులకు రవాణా సదుపాయం ఉంది. ప్రస్తుతం కోవిడ్‌ వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గినప్పటికీ సాధారణ రోజుల్లో 3.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. గతంలో హైటెక్‌సిటీ, కొండాపూర్, మాదాపూర్, జేఎన్‌టీయూ తదితర రూట్లలో ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసిన వాళ్లు క్రమంగా మెట్రోవైపు మళ్లారు. దీంతో ఆ  రూట్లలో తిరిగిన సుమారు 35 ఏసీ బస్సులను ఆర్టీసీ విరమించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఈ బస్సులు నడుస్తున్నాయి. 

ఉపాధి కోసం నగరానికి వెళ్లేవారు 
గతంలో మా ఊరిలో ఆర్టీసీ బస్సు రాత్రి బస చేసేది. ఉదయమే చాలామంది నగరానికి ఉపాధి కోసం వెళ్లేవారు. గ్రామం నుంచి మెహిదీపట్నం వరకు బస్సు నడిపించేవారు. ఆ బస్సును నిలిపివేయడంతో గ్రామస్తులు ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. చార్జీలు అధికంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. రాత్రివేళలో ఆటోలు లేక తిప్పలు తప్పడం లేదు. పాత సరీ్వసులను పునరుద్ధరించాలి.  – పులకంటి భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ చౌదరిగూడ, ఘట్‌కేసర్‌   

మా ఊరికి ఆటోలు రావు 
మాది మజీద్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండే పీర్లగూడెం. మండల కేంద్రానికి 8 కిలోమీటర్లు. గ్రామ పంచాయతీకి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మాములు రోజుల్లో మా గ్రామానికి రోజుకు రెండుసార్లు మాత్రమే బస్సు వచ్చేది. కరోనా కాలం నుంచి రావడం లేదు. కనీసం ఆటో సదుపాయాలు కూడా లేవు. ఆస్పత్రికి వెళ్లాలన్నా కష్టమే.. – లక్ష్మమ్మ, పీర్లగూడెం, అబ్దుల్లాపూర్‌మెట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement