సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సిటీ బస్సులు మృత్యుశకటాల్లా దూసుకొస్తూ నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఎప్పుడు, ఎక్కడ ఎటువైపు నుంచి సిటీ బస్సు రూపంలో మృత్యువు కబళిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాలం చెల్లిన డొక్కు బస్సులు, డ్రైవర్ల నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను గాలికొదిలేసి దూసుకొస్తున్న బస్సులు యమదూతలను తలపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ క్లాక్‌టవర్ ప్రాంతంలో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు ఓ యాచకుడిని కబళించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. బస్సు ఢీకొనడంతో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో బ్రేకులు ఫెయిల్ కావడమే కారణమని డ్రైవర్ చెబుతుండగా, బస్సు కండీషన్‌లోనే ఉందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. కారణం ఏదైనప్పటికీ ఆర్టీసీ బస్సుల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలస్తున్నాయి. గత సంవత్సరం హైటెక్‌సిటీ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని బెంగళూర్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడు, ఇద్దరు ఆటో డ్రైవర్లు బలైన సంగతి తెలిసిందే. ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు పాల్పడుతూనే ఉన్నాయి.
ఆర్టీసీ ప్రమాదాలు 38 శాతం ...
గ్రేటర్‌లో మొత్తం వాహనాల సంఖ్య 52 లక్షలు. 35 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఉండగా, మరో 12 లక్షల వరకు కార్లు, లక్షా 40 వేల ఆటో రిక్షాలు ఉన్నాయి. మిగతా వాటిలో లారీలు, డీసీఎం వ్యాన్‌లు, ప్రైవేట్ బస్సులు,టాటాఏస్‌లు, తదితర వాహనాలు ఉన్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు కేవలం 3850 మాత్రమే. కానీ ఈ బస్సుల వల్ల జరిగిన ప్రమాదాలు 38 శాతం. ఇతర అన్ని రకాల వాహనాల కంటే సిటీ బస్సుల ప్రమాదాల శాతమే ఎక్కువగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. అంతకు రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. ఆర్టీసీ బస్సుల ప్రమాదాల నియంత్రణకు చేపట్టే చర్యలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యమవుతున్నాయి. వేల సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. గతేడాది సిటీ బస్సులు సుమారు 7 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు పోలీసు అధికారుల అంచనా.
కొరవడిన శిక్షణ...
గ్రేటర్‌లో ప్రతి రోజు 3850 బస్సులు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. సుమారు 33 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. ప్రజా రవాణా రంగంలో ఇప్పటి వరకు ఆర్టీసీదే సింహభాగం. 12 వేల మంది డ్రైవర్‌లు. మరో 10 వేల మంది కండక్టర్లు పని చేస్తున్నారు. ఇలాంటి అతి పెద్ద వ్యవస్థలో రోడ్డు భద్రతా నిబంధనలు ఒక ప్రహసనంగా మారాయి. ఒక లీటర్ ఇంధనానికి ఎన్ని కిలోమీటర్‌లు తిప్పాలనే అంశంపైన శిక్షణనిచ్చినట్లుగా డ్రైవింగ్‌లో మెళకువలు పెంచుకొనేందుకు ఎలాంటి శిక్షణ, పునఃశరణ తరగతులు నిర్వహించకపోవడం గమనార్హం. గతంలో లారీ డ్రైవర్లుగా పని చేసిన వేలాది మంది అప్పట్లో ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా చేరారు. హై వేలపై లారీలు నడిన ఈ డ్రైవర్‌లంతా ఆర్టీసీ బస్సులను సైతం అలాగే నడుపుతూ ప్రమాదాలకు ఒడిగడుతున్నట్లు అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కొత్తగా విధుల్లో చేరిన వారి నైపుణ్యాన్ని పరీక్షంచడంతో పాటు, నగరంలోని రోడ్లు, ట్రాఫిక్, ప్రయాణికుల భద్రత, వాహనదారుల భద్రతకు అనుగుణమైన డ్రైవింగ్ నైపుణ్యంపైన 3 నెలల పాటు శిక్షణనిచ్చేవారు. అలాగే తప్పిదాలకు పాల్పడిన వారికి పునఃశ్చరణ తరగతులు ఉండేవి. ఇప్పటికీ అలాంటి శిక్షణ ఉన్నప్పటికీ కేవలం మొక్కుబడిగా మారిందని డ్రైవర్లు చెబుతున్నారు.
1000 డొక్కు బస్సులు...
సుమారు 8 సంవత్సరాలుగా కొత్త బస్సుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. 150 ఏసీ బస్సులు మినహా ఇతర కేటగిరిల్లో కొత్త బస్సులు లేవు. ఏళ్లకు ఏళ్లుగా పాత బస్సులనే నడుపుతున్నారు. సుమారు 1000 డొక్కు బస్సులు కాలం చెల్లిపోయి ఉన్నట్లు అంచనా. దీంతో సిటీ బస్సుల బ్రేక్‌డౌన్‌లు నిత్యకృత్యంగా మారాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట బస్సులు రోడ్లపై నిలిచిపోతున్నాయి. ప్రమాదాలు జరిగిన ప్రతి సారీ బస్సులకు బ్రేక్‌లు ఫెయిల్ కావడమే కారణమని డ్రైవర్లు, ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్రేకులు, బస్సుల కండీషన్ బాగానే ఉందని అధికారులు వాదిస్తున్నారు.కానీ కాలం చెల్లిన బస్సుల స్థానంలొ కొత్త వాటి కొనుగోళ్లు మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు.
సిటీలో ఏ వాహనాల వల్ల ఎన్ని ప్రమాదాలు
వాహనాలు ప్రమాద శాతం
ఆర్టీసీ బస్సులు 38
కార్లు,క్యాబ్‌లు 34
డీసీఎంలు 2
ప్రైవేట్ బస్సులు 7
లారీలు 2
గుర్తు తెలియని వాహనాలు 4
టెంపోట్రాలీలు 2
ఇతర వాహనాలు 7
Comments
Please login to add a commentAdd a comment