సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీపై మరో పిడుగు పడింది. ఇప్పటి దాకా ప్రజారవాణాలో అగ్రగామిగా వెలుగొందిన సిటీబస్సుపై ‘మెట్రో’ నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి మెట్రో రైళ్ల రాకతో ఆ నష్టాలు మరింత పెరిగాయి. మెట్రో రైలు సేవలు విస్తృతమవుతున్నకొద్దీ వివిధ రూట్ల నుంచి సిటీ బస్సులు వైదొలగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎల్‌బీనగర్–మియాపూర్ మెట్రో రైలు రాకతో మొదలైన ప్రతికూల పరిస్థితులు తాజాగా అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మెట్రో రైలు ప్రారంభంతో తారస్థాయికి చేరుకున్నాయి. నగరంలోని 15 ప్రధాన మార్గాల్లో ప్రతిరోజు హైటెక్‌సిటీకి రాకపోకలు సాగించే సుమారు 300 బస్సులపై మెట్రో ప్రభావంపడే అవకాశం ఉదని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వివిధ మార్గాల్లో హైటెక్‌సిటీకి తిరిగే మరో 28 ఏసీ బస్సులను సైతం ఆ మార్గంలో రద్దు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2.5 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఆర్టీసీ నుంచి మెట్రో వైపు మళ్లనున్నట్లు అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది. మరోవైపు ప్రయాణికుల అవసరాలపైనా సర్వే చేపట్టింది.
ఆదాయ మార్గాల్లోనే మెట్రో పరుగులు
ఆర్టీసీకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాల్లోనే మెట్రో రైళ్లు కూతపెడుతున్నాయి. ఎల్‌బీనగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్, కోఠి, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్ మీదుగా లింగంపల్లి, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్‌కు ప్రతి రోజు వందలకొద్దీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ రూట్‌లో ఏసీ బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతున్న సమయంలోనే ఎల్‌బీనగర్–మియాపూర్ రూట్‌లో మెట్రో రైలు ప్రారంభమైంది. దీంతో ఆ మార్గంలో తిరిగే ఏసీ బస్సులను ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వైపు, బీఎన్‌రెడ్డి నగర్, తదితర మార్గాలవైపు మళ్లించారు. ప్రస్తుతంఎల్‌బీనగర్ నుంచి హైటెక్‌సిటీ మీదుగా పటాన్‌చెరు వరకు 18 ఏసీ బస్సులు నడుస్తున్నాయి.అలాగే ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వేవ్‌రాక్ వరకు మరో నాలుగు బస్సులు, ఉప్పల్ నుంచి వేవ్‌రాక్ వరకు మరో 6 ఏసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సులన్నింటిలోనూ 60 నుంచి 65 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంది. నగర శివార్లలో స్థిరపడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఏసీ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు నేరుగా మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో ఈ రూట్‌లో తిరిగే 28 ఏసీ బస్సులను ఇప్పటికిప్పుడు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ బస్సుల్లో కొన్నింటిని హైటెక్‌సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, మరికొన్ని బస్సులను నగర శివార్ల వైపు మళ్లించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాణికుల అవసరాలపైన సర్వే చేపట్టారు. ప్రయాణికుల ఆదరణ లభించే మార్గాల్లోనే బస్సులను నడుపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
బస్సు బతికేదెట్టా!
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సుమారు రూ.650 కోట్ల మేర నష్టాల్లో ఉండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.400 కోట్లకు పైగా నష్టాల్లో నడుస్తున్నట్లు లెక్క తేల్చారు. ఆదాయానికి మించిన నిర్వహణ వ్యయం, ఇంధన వ్యయం, ఇతరత్రా ఖర్చులు ఆర్టీసీని తీవ్ర కష్టాల్లోకి నెట్టేశాయి. రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయంవస్తే బస్సుల నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం రూ.4.50 కోట్ల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. దీంతో రోజుకు రూ.కోటి చొప్పున నష్టాలను భరిస్తూ 3,550 బస్సులను తిప్పుతున్నారు. కానీ ప్రయాణికుల ఆదరణ ఉన్న మార్గాల్లోనే మెట్రో రైళ్లు పరుగులు తీయడంతో సిటీ బస్సుకు గడ్డుకాలంగా మారింది. సగానికి పైగా బస్సులను నగర శివార్ల వైపు మళ్లించడం మినహా మరో గత్యంతరం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో మెట్రో రూట్ ప్రారంభమవుతున్న కొద్దీ ఆ రూట్‌లో సిటీ బస్సులను క్రమంగా తగ్గించుకోవాల్సి వస్తోంది. సంస్థకు వస్తున్న నష్టాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా సొంత స్థలాలను కమర్షియల్ కాంప్లెక్స్‌ల కోసం లీజుకిచ్చే చర్యలు చేపట్టి.. పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆహ్వానం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment