మిడ్‌నైట్‌ మెట్రో మరెంత దూరం? | Metro Not Available In Night Time At Hyderabad | Sakshi
Sakshi News home page

మిడ్‌నైట్‌ మెట్రో మరెంత దూరం?

Published Mon, Jul 8 2019 2:11 AM | Last Updated on Mon, Jul 8 2019 9:38 AM

Metro Not Available In Night Time At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రజల మెట్రో రైలు నైట్‌ రైడ్‌ కల ఇప్పట్లో తీరేలా లేదు. వేకువజామున 5 గంటలకు, అర్ధరాత్రి సమయంలో మెట్రో రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రోవేళలను పొడిగించాలని కోరుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29 కి.మీ.), నాగోల్‌–హైటెక్‌ సిటీ (28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. నిత్యం ఈ మార్గాల్లో ఐటీ, బీపీవో, కెపీఓ, ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత, మార్కెటింగ్‌ రంగాల్లో పనిచేస్తున్న వేతన జీవులతోపాటు మహిళలు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు వేలాదిగా జర్నీ చేస్తున్నారు. రోజూ సుమారు 3 లక్షల మంది ఈ రూట్లలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకే మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోఉంది. అమీర్‌పేట్‌ స్టేషన్‌ నుంచి రాత్రి 11.02 నిమిషాలకు చివరి మెట్రో రైలు అందుబాటులో ఉంది. అయితే నగరంలో వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు షిఫ్టు వేళలు 24 గంటలూ ఉంటాయి. తెల్లవారుఝామున 5 గంటల నుంచి.. రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సర్వీసులను ఈ ప్రధాన రూట్లలో అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆక్యుపెన్సీ ఉండదనేనా.. 
దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరు మహానగరాల్లో ఉదయం 5.30 గంటల నుంచి 11.30 వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే, గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో రాత్రి 10.30 గంటల తర్వాత మెట్రోరైళ్లలో ఆక్యుపెన్సీ అంతగా ఉండదని..  దీంతో తమకు గిట్టుబాటు కాదన్న అంచనాతోనే నిర్మాణ సంస్థ అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెట్రో రైళ్లలో ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, మెట్రోరైళ్లలో చెల్లుబాటయ్యేలా కాంబి టికెట్‌ లేదా నెల వారీ పాస్‌ల జారీ అంశంపైనా మెట్రో అధికారుల నుంచి మౌనమే సమాధానమౌతోంది.  ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పి అధికారులు  తప్పించుకుంటున్నారు. మరోవైపు పాస్‌ల జారీ విషయంలో ఈ మూడు రవాణా విభాగాల మధ్య సయోధ్య కుదరడంలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

రాత్రి 1 గం. వరకు నడపాలి
హైటెక్‌ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య వర్గాలకు రాత్రి 12 గంటల వరకు క్షణం తీరిక లేకుండా గడపడం సర్వసాధారణం. అర్థరాత్రి 12 గంటల వరకూ సిటీలో పగటి తరహాలోనే ప్రధాన రహదారులపై జన సంచారం, ప్రయాణికులు, వాహనదారుల రాకపోకలుంటాయి. ఈ నేపథ్యంలో అర్థరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులను అందుబాటులో ఉంచాలని ఎల్‌అండ్‌టీ వర్గాలను సంప్రదించగా... ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి దాటవేయడం గమనార్హం. హైటెక్‌సిటీ వరకు మెట్రో అందుబాటులోకి రాగానే పని వేళలను పెంచుతామని చెప్పిన అధికారులు ప్రస్తుతం మీనమేషాలు లెక్కిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఎంజీబీఎస్, నాంపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్లను మెట్రో స్టేషన్లకు అనుసంధానించారు. అయితే పొరుగు రాష్ట్రాలు, దూర ప్రాంత జిల్లాల నుంచి తెల్లవారుజామున 4–5 గంటలకే వేలాది మంది ప్రయాణికులు నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు చేరుకుంటారు. వీరంతా సమీపంలోని మెట్రో స్టేషన్‌కు వెళ్లగానే మూసిన గేట్లే దర్శనమిస్తుండటంతో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement