సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలు బుధవారం హైటెక్ సిటీకి పరుగులు పెట్టింది. ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా రైలును ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి, ప్రచారం, ఆర్బాటం లేకుండా గవర్నర్ మెట్రో రైలును ఆరంభించారు. అనంతరం హైటెక్ సిటీ వరకు గవర్నర్ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
కాగా మొత్తం 10 కి.మీ. మార్గంలో అమీర్‌పేట్‌తో కలిపి 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. హైటెక్‌సిటీకి మెట్రో పరుగుతో ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ప్రారంభంలో ఈ మార్గంలో నిత్యం లక్ష మంది రాకపోకలు సాగిస్తారని, మరికొన్ని రోజుల్లో రద్దీ రెండు లక్షల మార్కును దాటుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆయా మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఇబ్బందులు మెట్రో ప్రయాణికులకు చుక్కలు చూపేలా ఉన్నాయి.
ఇంటి నుంచి వ్యక్తిగత వాహనాల్లో ఆయా స్టేషన్లకు చేరుకున్నవారికి ఆయా స్టేషన్ల వద్ద పరిమితంగానే పార్కింగ్ స్థలం అందుబాటులో ఉండడంతో ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి.. ఆటోలు, క్యాబ్‌లు, బస్సుల్లోనే మెట్రో స్టేషన్లకు చేరుకుంటే పార్కింగ్ చిక్కులు తప్పుతాయని మెట్రో అధికారులు సెలవిస్తుండడం గమనార్హం. త్వరలో ఆయా స్టేషన్ల వద్ద స్మార్ట్ పార్కింగ్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment