హైటెక్‌సిటీ మెట్రో షురూ | Metro Rail Service Starts In Hitech City | Sakshi
Sakshi News home page

హైటెక్‌సిటీ మెట్రో షురూ

Published Thu, Mar 21 2019 1:17 AM | Last Updated on Thu, Mar 21 2019 1:17 AM

Metro Rail Service Starts In Hitech City - Sakshi

బుధవారం హైటెక్‌సిటీ రూట్లో మెట్రో ప్రారంభించిన అనంతరం అందులో ప్రయాణిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌. చిత్రంలో ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి, సీఎస్‌ జోషి, హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీపీ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు అమీర్‌పేట– హైటెక్‌ సిటీ (10 కి.మీ) రూట్‌లో పరుగులు పెట్టింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ మెట్రో స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పచ్చజెండా ఊపి రైలును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మెట్రో రైలులో 15 నిమిషాల పాటు హైటెక్‌సిటీ వరకు ప్రయాణించారు. హైటెక్‌సిటీ స్టేషన్, పరిసరాలను, హెచ్‌ఎంఆర్‌ చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించి తిరిగి అమీర్‌పేట వరకు మెట్రోలోనే ప్రయాణించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కెవీబీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ మార్గంలోమెట్రో ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లో 56 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అంత పొడవైన మెట్రో హైదరాబాద్‌ సొంతం కావడం విశేషం. ప్రస్తుతం ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29 కి.మీ), నాగోల్‌–హైటెక్‌సిటీ (27 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాగా, నూతనంగా ప్రారంభమైన ఈ మార్గంలో సాయంత్రం 4 గంటల నుంచి సాధారణ ప్రయాణికులకు ప్రయాణానికి అనుమతించారు.

అమీర్‌పేట– హైటెక్‌సిటీ మార్గం ప్రత్యేకతలివీ..
– ఈ మార్గం కారిడార్‌–3గా పిలిచే నాగోల్‌–హైటెక్‌సిటీ (27 కి.మీ)రూటులో అంతర్భాగం.
– ఈ మార్గం మొత్తం 10 కి.మీ కాగా.. అమీర్‌పేటతో కలిపి 9 స్టేషన్లున్నాయి.
– జూబ్లీ చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్న మెట్రో స్టేషన్‌ ట్రాఫిక్‌ రద్దీ రీత్యా ఒకే అంతస్తులో నిర్మించారు. మిగతా స్టేషన్లు రెండు అంతస్తుల్లో ఉన్నాయి.
– మధురానగర్‌ మెట్రో స్టేషన్‌ను తరుణి మెట్రో స్టేషన్‌గా తీర్చిదిద్దారు. ఇక్కడ మహిళలు, చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు లభ్యమయ్యేలా 150 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.
– ప్రస్తుతం మెట్రో రైళ్లలో నిత్యం 2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం ప్రారంభంతో మరో లక్ష మంది అదనంగా ప్రయాణిస్తారని అంచనా.
– జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ (10 కి.మీ) మార్గం ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని మెట్రో అధికారులు తెలిపారు.
– మెట్రో రైలు కనిష్టంగా గంటకు 32 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌– హైటెక్‌సిటీ వరకు 50 నిమిషాల్లో ఒక చివరి నుంచి మరో చివరకు చేరుకోవచ్చు. అదే బస్సులు లేదా కార్లలో అయితే జర్నీ రెండుగంటలకు పైమాటే.
– ప్రస్తుతం అమీర్‌పేట–హైటెక్‌సిటీ రూట్లో ప్రతి 12 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. జూబ్లీహిల్స్‌– హైటెక్‌సిటీ వరకు ఒకే ట్రాక్‌లో మెట్రో వెళ్లాల్సి రావడంతో ఫ్రీక్వెన్సీ ఆలస్యమవుతోంది. రివర్సల్‌ సదుపాయం ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి వస్తే ఫ్రీక్వెన్సీని తొలుత 6 నిమిషాలకు..ఆ తర్వాత 3 నిమిషాలకు తగ్గించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
– ఈ మార్గం ప్రారంభంతో హైటెక్‌సిటీ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, శిల్పారామం, హైటెక్స్‌ తదితర ప్రాంతాల్లోని ఐటీ, బీపీఓ, కెపీఓ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు ట్రాఫిక్‌ చిక్కులు తప్పనున్నాయి.
– జేబీఎస్‌– ఫల్‌నుమా మార్గం కూడా ప్రారంభమైతే మొత్తం 3 రూట్లలో నిత్యం 15 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.

త్వరలో కామన్‌ మొబిలిటీ కార్డు: ఎన్వీఎస్‌రెడ్డి, హెచ్‌ఎంఆర్‌ ఎండీ
ఒకే స్మార్ట్‌కార్డుతో మెట్రోరైళ్లు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా కామన్‌ మొబిలిటీ కార్డును ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నాం. మా వైపునుంచి కసరత్తు పూర్తయినా.. ఆర్టీసీ అధికారులు ఈ అంశంపై దృష్టిసారించారు. లండన్‌లో కామన్‌మొబిలిటీ కార్డు ప్రవేశపెట్టేందుకు 15 ఏళ్ల సమయం పట్టింది. నగరంలో అంత సమయం పట్టకపోయినా.. త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. హైటెక్‌సిటీ వద్ద రైలు రివర్సల్‌ సదుపాయాన్ని మే నెలాఖరునాటికి పూర్తిచేస్తాం. జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ రూట్లో ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాదిలో ఎంజీబీఎస్‌– ఫలక్‌నుమా మార్గంలో మెట్రో పరుగులు పెడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement