సిటీ బస్సులపై తొలగని ప్రతిష్టంభన | Telangana Government Blockage on City Bus Services in Hyderabad | Sakshi
Sakshi News home page

రైటా.. లెఫ్టా?

Jun 5 2020 8:30 AM | Updated on Jun 5 2020 8:30 AM

Telangana Government Blockage on City Bus Services in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రకరకాల వ్యూహాలు.. ప్రణాళికలు.. చివరకు ఎటూ తేలని సందిగ్ధం. ఇదీ సిటీ బస్సుల నిర్వహణపై నెలకొన్న పరిస్థితి. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా రాష్ట్రమంతటా బస్సులు నడుస్తున్నాయి. కోవిడ్‌ నిబంధనల మేరకు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ నగరంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తీవ్రత తగ్గకపోవడంతో సిటీ బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అనుమతిస్తే కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా  కొన్ని ప్రధానమైన రూట్లలో బస్సులు నడిపేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించారు. మరోవైపు ఈ నెల 8 నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కుతాయన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇటీవల రవాణా శాఖ మంత్రితో జరిగిన సమావేశంలోనూ సిటీ బస్సుల ప్రస్తావన రాలేదని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో వారం, పది రోజుల్లో నగరంలో ప్రజారవాణా సదుపాయం అందుబాటులోకి రానుందన్న అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. బస్సులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సులను శానిటైజ్‌ చేయడంతో పాటు, భౌతిక దూరం నిబంధన మేరకు సీట్ల సామర్థ్యం వరకు ప్రయాణికులను పరిమితంగా అనుమతించడం, వీలైతే డోర్‌లను ఏర్పాటు చేయడం, కండక్టర్‌లను గ్రౌండ్‌ డ్యూటీలకు పరిమితం చేయడం వంటి అంశాలను పరిశీలించారు. బ్రాంచి రూట్లలో కాకుండా ప్రధాన రూట్లలో ఉదయం, సాయంత్రం బస్సులను నడపాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. కానీ సిటీ బస్సులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం.  (హైదరాబాద్‌: రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!)

29 డిపోలు.. 3 వేల బస్సులు..  
పీకల్లోతు నష్టాల్లో ఉన్న గ్రేటర్‌ ఆర్టీసీని కరోనా మరింత దారుణంగా కాటేసింది. అప్పటికే కార్మికుల సమ్మె కారణంగా 50 రోజుల పాటు బస్సులు నడవలేదు. ఆదాయం పడిపోయింది.  సమ్మె ముగిసి ఊపిరి తీసుకుంటున్న కొద్ది రోజుల్లోనే కరోనా తరుముకొచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా 29 డిపోల్లో సుమారు 3 వేల బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాధారణంగా  గ్రేటర్‌ ఆర్టీసీ జోన్‌కు ప్రతిరోజూ వచ్చే రూ.3.5 కోట్ల ఆదాయానికి గండి పడింది. గత 70 రోజులకు పైగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రూ.250 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తీవ్ర నష్టాల్లో ఉన్న గ్రేటర్‌ ఆర్టీసీ మనుగడ మరింత ప్రశ్నార్థకంగా మారింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా బస్సుల సంఖ్యను, పర్మిట్లను కుదించడం వంటి చర్యలు చేపట్టారు. కొన్నింటికి కార్గోలుగా మార్చారు. నగర శివార్లకు సిటీ బస్సులను చాలా వరకు తగ్గించారు. ఆ తర్వాత చార్జీల పెంపుతో కొంతమేరకు ఊరట లభించింది. కానీ ఆకస్మాత్తుగా లాక్‌డౌన్‌ వచ్చిపడింది. ఆర్టీసీ పాలిట పిడుగుపాటుగా పరిణమించింది. 

ఎయిర్‌పోర్టు బస్సులపైనా..
మరోవైపు గత నెల 25 నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టు వరకు 53 ఏసీ బస్సులను నడిపేందుకు కూడా ఆర్టీసీ సన్నద్ధమైంది. ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే ఈ రూట్‌లో  బస్సుల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నారు. బస్సులను శానిటైజ్‌ చేయడంతో పాటు, డిపోల వారీగా రూట్‌లను ఎంపిక చేశారు. గతంలో తిరుగుతున్న రూట్లలో స్వల్పంగా మార్పులు చేశారు. కానీ ఈ బస్సులపై కూడా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘ప్రజా రవాణాలో సిటీ బస్సు చాలా కీలకం. ఒక్కసారిగా జనం బస్సుల్లోకి ప్రవేశిస్తే వాళ్ల మధ్య భౌతిక దూరం సాధ్యం కాదు. సీట్ల సామర్థ్యం మేరకు ఎలా నడపగలమనే అంశాన్ని సీరియస్‌గానే పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంకా స్పష్టత  రావాల్సి ఉంది’ అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అందుకు మరికొంత సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement