సాక్షి, సిటీబ్యూరో: డ్రైవర్ బస్సు నడుపుతారు. కండక్టర్ ప్రయాణికులకు టికెట్లు ఇస్తారు. కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఒక్కరికీ ఇది తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు వీరి విధుల్లో మార్పులు రానున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు సరికొత్త విధులకు సన్నద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించడంతో చాలాచోట్ల సీనియర్ కండక్టర్లు, డ్రైవర్లు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది స్థానంలో ఆఫీస్ బాయ్‌లు, అటెండర్లుగా పని చేస్తున్నారు. కొన్ని డిపోల్లో డ్రైవర్లకు బస్సులనుశుభ్రపరిచే పనులను అప్పగించారు. భవిష్యత్తులో కండక్టర్లు, డ్రైవర్ల విధుల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. కరోనా కారణంగా కుదేలైన గ్రేటర్ ఆర్టీసీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కానరావడంలేదు. దీంతో లాక్‌డౌన్ అనంతరం తమ సేవల విస్తరణ కోసం డ్రైవర్లు, కండక్టర్లను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా, ట్రాఫిక్ గైడ్లుగా వినియోగించుకొనే దిశగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ కార్యాచరణ చేపట్టింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన కార్గో బస్సులలో సరుకు రవాణాకు వివిధ సంస్థల నుంచి ఆర్డర్లు పొందడంతో పాటు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, ఐటీ సంస్థలు, పరిశ్రమలు, కంపెనీలు, విద్యాసంస్థలకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయడం వంటి విధులను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు అప్పగించనున్నారు. ప్రధాన రూట్లలో రద్దీ నియంత్రణ కోసం ట్రాఫిక్ గైడ్లు బస్టాప్‌ల్లో విధులు నిర్వర్తించనున్నారు.
మిగులు సిబ్బందికి అదనపు విధులు..
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సుదీర్ఘ సమ్మె అనంతరం నష్టనివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ ఆర్టీసీలో సుమారు 650 బస్సులను తగ్గించారు. మరికొన్నింటిని తుక్కు కింద మార్చారు. అప్పటి వరకు నగరంలోని 29 డిపోలలో 3,850 బస్సులు ఉండగా.. సమ్మె అనంతర చర్యల్లో భాగంగా బస్సులు, రూట్ల సంఖ్య బాగా తగ్గింది. ప్రధాన రూట్లకే సిటీ బస్సులు పరిమితమయ్యాయి. నగర శివార్లకు ట్రిప్పులను చాలావరకు తగ్గించారు. ఈ కారణంగా అన్ని డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లలో మిగులు సిబ్బంది సమస్య తలెత్తింది. దీంతో 55 ఏళ్ల వయసు దాటిన వారిని మిగులు సిబ్బంది జాబితాలో చేర్చి వారికి అదనపు విధులను అప్పగించారు. కరోనా ముందు వరకు చాలా మంది క్లర్క్‌లుగా పని చేశారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించడంతో ఇప్పుడు బస్సులను శుభ్రం చేయడంతో పాటు ఆఫీసులో ఫైళ్లు అందజేయడం, అధికారులు, ఉద్యోగులకు టీ, కాఫీలు ఏర్పాటు చేయడం వంటి చిన్నా చితకా పనులను సైతం డ్రైవర్లు, కండక్టర్లే చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమ స్వభావానికి విరుద్ధమైన విధులను అప్పగిస్తూ డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు అవమానిస్తున్నారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
లాక్‌డౌన్ అనంతరం ఇలా..
లాక్‌డౌన్ కారణంగా 100 రోజులకుపైగా సిటీబస్సులు డిపోలకే పరిమితమ్యాయి. దీంతో రోజుకు రూ.3.5 కోట్ల చొప్పున వంద రోజుల్లో గ్రేటర్ ఆర్టీసీ రూ.350 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా వైరస్ కారణంగా ప్రయాణికుల రద్దీ గతంలో వలే ఉండకపోవచ్చు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సమీప భవిష్యత్తులో ప్రభుత్వం సిటీ బస్సులకు అనుమతినిచ్చినా కోవిడ్ నిబంధనల మేరకు ప్రయాణికులను తక్కువ సంఖ్యలోనే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు ప్రధాన రూట్లకే బస్సులు పరిమితమవుతాయి. దీంతో కండక్టర్లు, డ్రైవర్లలో మరింత మంది మిగిలిపోతారు. ప్రస్తుతం 29 డిపోల పరిధిలో 18 వేల మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు. ఇప్పటికే సమ్మె అనంతర చర్యల్లో భాగంగా 55 ఏళ్ల వయసు దాటిన సుమారు 2000 మందిని డిపోలకు పరిమితం చేశారు. లాక్‌డౌన్ అనంతరం బస్సుల కుదింపుతో మరో 2000 మందికిపైగా తగ్గించుకోవాల్సి రావచ్చని అంచనా. ఇలా మిగిలిన వారిని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా, కార్గో బస్సుల నిర్వహణ సిబ్బందిగా, ఇతర కార్యకలాపాల్లో వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు లాక్‌డౌన్ అనంతరం శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment