
స్మార్ట్ ఫోన్‌లో.. సిటీబస్సు సమాచారమ్
మహానగరంలో సిటీబస్సు ప్రయాణం అంటే కత్తి మీద సాము లాంటిదే. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో చెప్పలేం. అసలు పలానా రూట్‌లో సిటీ బస్సు సౌకర్యం ఉందా? లేదా అన్నదీ చెప్పడం కష్టమే. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణ సంస్థ ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది నగర ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మరి ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..? ఎలా వాడు కోవాలి..? తదితర విషయాలు మీకోసం...
ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
⇒ మొదట https://play.google.com/store/apps/details?id=com.apsrtc&hl=en&rdid=com.apsrtc లింక్‌ను క్లిక్ చేయండి.
⇒ ఇక్కడ విండోలో ‘హైదరాబాద్ ఆర్‌టీసీ ఇన్‌ఫో’ అని కనిపిస్తుంది. దానికింద ఉన్న ‘ఇన్‌స్టాల్’ ఆఫ్షన్‌ను క్లిక్ చేయండి.
⇒ ఇప్పుడు మిమ్మల్ని ‘సైన్ ఇన్’ అవ్వమని కోరుతుంది.
⇒ మీకున్న జీ మెయిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వండి.
⇒ తిరిగి ఇన్‌స్టాల్ ఆఫ్షన్‌ను క్లిక్ చేస్తే మీ మొబైల్‌లో యాప్ ‘డౌన్‌లోడ్’ అవుతుంది.
యాప్‌ను ఇలా వాడుకోండి..
⇒ మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత మొబైల్ స్క్రీన్‌పై ‘హైదరాబాద్ ఆర్టీసీ’ విండో కనిపిస్తుంది.
⇒ ఇక్కడ మీకు ‘బస్సు డిటైల్స్’, ‘ఫ్రం-టూ’, ‘లొకేషన్’, ‘రియల్ టైం’, ‘మై అకౌంట్’, ‘ఫీడ్‌బ్యాక్’, ‘క్లోజ్’ ఆఫ్షన్స్ కనిపిస్తాయి.
⇒ మొదటి రెండు ఆఫ్షన్లు మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి.
బస్ వివరాలు ఇలా..
⇒ ఇక్కడ స్క్రీన్‌పై కనిపిస్తున్న ‘సెలక్ట్’ ఆఫ్షన్‌లో మనకు కావాల్సిన బస్ నంబరును ఎంచుకోవాలి.
⇒ ఇప్పుడు ఫోన్ స్క్రీన్‌పై సంబంధిత బస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సర్వీసు ఉంది, ఏయే రూట్లలో వెళ్తుంది, ముఖ్యమైన బస్ స్టాపుల వివరాలు కనిపిస్తాయి.
ఫ్రం-టూ..
⇒ ఇక్కడ కనిపిస్తున్న ‘ఫ్రం’ ఆఫ్షన్‌లో మీరు ఎక్కడ నుంచి బస్ ఎక్కదలిచారో ఆ ప్రాంతాన్ని ఎంటర్ చేయాలి.
⇒ ‘టూ’ ఆఫ్షన్‌లో ఎక్కడికి వెళ్లాలో ఆ ప్రాంతం పేరు ఎంటర్ చేయాలి.
⇒ ఇప్పుడు మీరు కోరుకున్న రూట్‌లో ఏయే బస్సులు అందుబాటులో ఉన్నాయి, వాటి సర్వీసు నెంబరు, అవి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తాయి తదితర వివరాలు కనిపిస్తాయి.
లొకేషన్..
‘లొకేషన్’ ఆఫ్షన్‌లో కనిపిస్తున్న బస్ డిపోను ఎంచుకోవాలి. ఇక ఆ డిపో నుంచి ఏయే బస్ సర్వీసులు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నాయి తదితర విషయాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
నోట్: అందుబాటులో ఉన్న సర్వీసులతో పాటుగా వాటి వయా రూట్ వివరాలు, వాటి టికెట్ ధరలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్‌నెట్ కనెక్షన్ లేకుండానే దీన్ని సులువుగా ఉపయోగించుకోవచ్చు.