ఎదురు తిరిగింది... స్టీరింగ్ తిప్పింది! | Counter-steering turning back ...! | Sakshi
Sakshi News home page

ఎదురు తిరిగింది... స్టీరింగ్ తిప్పింది!

Published Sun, Jul 6 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

ఎదురు తిరిగింది... స్టీరింగ్ తిప్పింది!

ఎదురు తిరిగింది... స్టీరింగ్ తిప్పింది!

 ‘ఆడపిల్లలు ఇవి మాత్రమే చేయాలి...’ అంటూ మన సమాజం ఒక జాబితాను తయారు చేసింది. కొన్ని వందల యేళ్లుగా అందరూ వాటినే అనుసరిస్తున్నారు. అలా అనుసరించని వాళ్లని వింతగా చూస్తున్నారు. ఆ సంగతి తెలిసి కూడా ఓ మహిళ ఆ నియమాలను ధిక్కరించింది. నేను ఎందుకు చేయకూడదు అని ఎదురు తిరిగి ప్రశ్నించింది. ఇదే చేస్తాను అంటూ తను కోరుకున్న దిశగా అడుగులు వేసుకుంటూ పోయింది. నేడు వందలాది మందికి ఆదర్శంగా నిలబడింది!
 
అక్టోబర్ 26, 2010. ఆ రోజు ప్రపంచానికి ప్రత్యేకమైన రోజు కాకపోవచ్చు. కానీ ప్రేమా రామప్ప జీవితంలో మాత్రం ఎంతో ప్రత్యేక మైన రోజు. ఓ గొప్ప విజయాన్ని సాధించిన రోజు. తనేమిటో చూపించిన రోజు. ఆ రోజు ఆమె తొలిసారిగా బస్సు స్టీరింగును పట్టుకుంది. బెంగళూరు రోడ్ల మీద సిటీ బస్సును పరుగులు పెట్టించింది. కర్నాటక రాష్ట్రంలో బస్సును నడిపిన తొలి మహిళా డ్రైవర్‌గా రికార్డును నెలకొల్పింది.
 
బతుకు బండిని నడపలేక...
 ‘‘బస్సు నడుపుతావా, అలాంటి పనులు మగాళ్లకి గానీ నీకెందుకు?’’
 ఈ మాట విని ప్రేమకి కోపం రాలేదు. నవ్వొచ్చింది. యుగాలు గడిచినా, తరాలు మారినా ఆడ, మగ తేడాలు మాత్రం మార లేదు కదా అనుకుంది. కానీ వెనకడుగు మాత్రం వేయలేదు. ఎందుకంటే... బతుకు బండిని నడపలేక అవస్థ పడుతున్న తనకు చక్రాల బండి ఆధారమవగలదని ఓ నమ్మకం. అందుకే ఎలాగైనా బస్సు డ్రైవర్ అవ్వాలని నిర్ణయించుకుంది. అది మగాళ్ల ఉద్యోగమని అన్నా వినలేదు.
 
ఈ పట్టుదల ఇవాళ కొత్తగా రాలేదు ప్రేమకి. ఆమె చిన్నప్పట్నుంచీ అంతే. ఏదైనా చేయాలనుకుంటే చేసి తీరుతుంది. ఎందుకో మొదట్నుంచీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడే బంధువుల దగ్గర బైకు తీసుకుని నడిపింది. బడికెళ్లి వచ్చేటప్పుడు తమ స్కూలు బస్సు డ్రైవర్ పక్కనే కూర్చునేది. ఆయన ఎలా నడుపుతున్నాడు, గేర్ ఎప్పుడు వేస్తున్నాడు, క్లచ్ ఎప్పుడు తొక్కుతున్నాడు... అన్నీ గమనించేది. మధ్య మధ్యన అతడిని ప్రశ్నలు కూడా అడిగేది.

ప్రేమ ఆసక్తి చూసి అతడు ఓపిగ్గా చెప్పేవాడు. దాంతో ఎలాగైనా నాలుగు చక్రాల వాహనాన్ని నడపాలనే కోరిక కలిగింది ప్రేమకి. మెల్లగా అది కూడా నేర్చుకుంది. కానీ నడిపే అవకాశం మాత్రం రాలేదు. ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. కానీ వచ్చిన పరిస్థితులు మాత్రం మామూలువి కాదు. చదువు త్వరగానే ముగించి, నర్సు ఉద్యోగం సంపాదించింది ప్రేమ. తండ్రి లేకపోయినా అన్నీ తానై పెంచిన తల్లికి అండగా నిలిచింది. ఆమె చూపించిన వ్యక్తితో తాళి కట్టించుకుంది. ఓ మగబిడ్డకు తల్లి కూడా అయ్యింది. అంతా ఆనందంగా సాగిపోతోందనుకున్న సమయంలో ఓ పెద్ద తుఫాను. ప్రేమ భర్త ఓ ప్రమాదంలో మరణించాడు.
 
ఓ పక్క ఆ బాధ... తనకు జన్మనిచ్చిన తల్లిని, తాను జన్మనిచ్చిన కొడుకుని బాగా చూసుకోవా లన్న తపన మరోపక్క... నలిగిపోయింది ప్రేమ. ఆపైన బాగా ఆలోచించి, తిన్నగా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లింది. ఫోర్ వీలర్ లెసైన్సుకు అప్లై చేసింది. లెసైన్సు వచ్చాక బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్‌‌సపోర్‌‌ట కార్పొరేషన్ నిర్వహించిన పరీక్షకు హాజరయ్యింది. అందులో పాసై బస్సు స్టీరింగును చేత పట్టింది.
 
మొదట్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రేమని అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఆ తర్వాత అభినందించడం మొదలుపెట్టారు. ఆపైన ఆమె స్ఫూర్తితో కొందరు మహిళలు డ్రైవర్లుగా మారారు. ‘‘బస్సు నడుపుతాను అని నేను అన్నప్పుడు... ఆడవాళ్లు అలాం టివి చేస్తారా ఎక్కడైనా అంటూ కొందరు ఎగతాళిగా మాట్లాడారు. వాళ్లని నేను తప్పు బట్టను. మన సమాజం అలా ఉంది. కానీ నేను అలా లేను కదా. కనీసం నన్ను చూశా కైనా ఆడపిల్లలు ఏదైనా చేయొచ్చు, చేయ గలరు అని అర్థమైతే చాలనుకున్నాను’’ అంటుంది ప్రేమ నవ్వుతూ. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వే ఆమెకు అందం. అది మొక్కవోని ఆమె ఆత్మవిశ్వాసానికి దర్పణం!
 
 - సమీర నేలపూడి
 
కర్నాటకలోని ఆర్టీసీ డ్రైవర్లంతా సమ్మె చేస్తుంటే, తన కడుపు నింపుతోన్న సంస్థకు ద్రోహం చేయ నంటూ బస్సును నడిపిన ధీశాలి ప్రేమ. కొందరు తనపై దాడి చేసినా కూడా బెదరలేదు. ఆమె ధైర్యానికి, స్థైర్యానికి, నిబద్దతకి మెచ్చి ప్రభుత్వం ఉత్తమ డ్రైవర్ అవార్డును కూడా ఇచ్చింది. అందుకు ఎవరైనా ప్రశంసిస్తే... ‘నా కొడుకుని గొప్పవాణ్ని చేయాలన్న తపనే నన్నీ స్థాయికి తెచ్చింది తప్ప ఇందులో నా గొప్పదనమేమీ లేదు’ అంటుంది సింపుల్‌గా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement