Steering
-
స్టీరింగ్ మీదే సిటీ బస్ డ్రైవర్ మృతి
దొడ్డబళ్లాపురం: సిటీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చి స్టీరింగ్ మీదే తుది శ్వాస విడిచిన సంఘటన బెంగళూరు పరిధిలోని నెలమంగల తాలూకా బిన్నిమంగల బస్టాండు వద్ద చోటుచేసుకుంది. కిరణ్‌కుమార్ (40).. దాసనపుర బస్ డిపో బీఎంటీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్లుగా ఆయన ఉద్యోగంలో ఉన్నారు. బుధవారం ఉదయం బస్సు నడుపుతుండగా కిరణ్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపి అలాగే ప్రాణాలు వదిలాడు. కండక్టర్, ఇతర ప్రయాణికులను ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురికాగానే శరీరం సహకరించకున్నా బస్సును నేర్పుగా రోడ్డు పక్కకు నిలిపిన దృశ్యాలు, స్టీరింగ్ మీదకు పడిపోయిన దృశ్యం బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. నెలమంగల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
Mumbai: మద్యం మత్తులో బస్సు స్టీరింగ్ గిరగిరా తిప్పడంతో..
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో విచిత్ర పరిస్థితుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులోని ఒక ప్రయాణికుడు ఏదో విషయమై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆ ప్రయాణికుడు బస్సు స్టీరింగ్‌ను ఇష్టమొచ్చినట్లు గిరగిరా తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి, పలు వాహనాలను, పాదచారులను ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన లాల్బాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడి చర్యల కారణంగా, బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సు సియోన్‌లోని రాణి లక్ష్మీబాయి చౌక్ వైపు వెళుతోంది. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. -
ఈ కారులో ఏది అనుకుంటే అదే జరుగుతుంది..!
మ్యునీచ్: 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ సినిమా మనందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అవతార్ సినిమా సంచలన విజయాన్ని నమోదుచేసింది. అవతార్ సినిమా ఒక విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు కనువిందుచూసింది. ఈ సినిమాలో పండోరా ప్రపంచంలో హీరో అక్కడ ఉన్న గుర్రాలను మచ్చిక చేసుకోవడం తన తోకను గుర్రం మైండ్‌తో మమేకం చేసి, హీరో ఆలోచనలకు తగ్గట్టుగా గుర్రం నడుచుకునే సన్నివేశాలను గమనించే ఉంటాం. ఇదే తరహాలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కారును రూపొందించింది. చదవండి: Mercedes EQE Electric Sedan: టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..! మెర్సిడెజ్ ఈ కారులో స్టీరింగ్‌ను అమర్చలేదు. కేవలం హ్యూమన్ మైండ్ ద్వారా నియంత్రించవచ్చును. మెర్సిడెజ్ జెంజ్ విజన్ ఎవీటీర్ న్యూవెర్షన్‌ను జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఐఏఏ మొబిలీటీ 2021 షోలో మెర్సిడెజ్ ప్రదర్శనకు ఉంచింది. కారు లోపలి బయటి భాగాలు సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్న మాదిరిగా ఉంటాయి. ఈ కారులో ఎలాంటి స్టీరింగ్ ఉండదు. బీసీఐ టెక్నాలజీ సహయంతో కారును నియంత్రించవచ్చును. బీసీఐ టెక్నాలజీ అనగా మీరు కారులో రేడియో స్టేషన్‌ను మార్చడం, లేదా కార్ లోపలి లైట్స్కోసం ఎలాంటి బటన్స్‌ను స్విచ్ చేయకుండా మైండ్‌లో వాటి గురించి ఆలోచించడంతోనే స్విచ్ఆన్, ఆఫ్ చేయవచ్చును. బీసీఐ సిస్టమ్ పనిచేయడం కోసం కంపెనీ తయారుచేసిన ప్రత్యేకమైన హెల్మెట్‌ను ధరించాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్ సహాయంతో కారును నియత్రించవచ్చును. ఈ కారును డిస్నీ సంస్ధ సహకారంతో మెర్సిడెజ్ సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఈ కారు కాన్సెప్ట్‌ను అవతార్ సినిమా నుంచి మెర్సిడెజ్ ప్రేరణ పొందింది. IN PICS | Mercedes-Benz Vision AVTR concept can read your mind The automaker has created this concept car in collaboration with @Disney and it takes inspiration from the movie popular sci-fi movie, #Avatar. @IAAmobility Details: https://t.co/svdJLFDUts pic.twitter.com/dd6QWN4D7X — HT Auto (@HTAutotweets) September 7, 2021 చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..! -
Tesla: టెస్లా చీప్ ఎలక్ట్రిక్ కార్.. భారత్ కోసమే?
వాహన రంగంలో సంచలనాలకు కేరాఫ్‌గా మారిన అమెరికన్ కంపెనీ టెస్లా.. చీప్‌గా ఎలక్ట్రిక్ కారును వాహనదారులకు అందించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కిందటి ఏడాది టెస్లా బ్యాటరీ డే సందర్భంగా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా.. తక్కువ ధరకే ఫుల్లీ ఆటానమస్ ఈ-కారును టెస్లా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఫుల్ సెల్ప్ డ్రైవింగ్ వ్యవస్థతో రూపొందించనున్న ఈ కారు ధర.. 25 వేల డాలర్లుగా(మన కరెన్సీలో 18 లక్షలుగా) ఫిక్స్ చేసినట్లు సమాచారం. స్టీరింగ్ వీల్ లేకుండానే రానున్న ఈ ఎలక్ట్రిక్ కారును.. మోడల్ 2గా(అఫీషియల్ పేరు కాదు) వ్యవహరించనున్నారు. ఈ చీప్ వెహికిల్‌ను 2023లో లాంఛ్ చేయనున్నారు. అయితే ఇది టెస్లా అధికారిక ప్రకటన కాకపోయినా.. మస్క్ తాజా ఇంటర్వ్యూ వ్యాఖ్యాలను ఉటంకిస్తూ ఎలక్ట్రిక్ అనే వెబ్సైట్ ఈ విషయాల్ని వెల్లడించింది. షాంఘై(చైనా)లోని గిగాఫ్యాక్టరీ నుంచి ఈ వాహనాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు ఆ కథనం పేర్కొంది. భారత్ టార్గెట్‌గా.. ఒక్కసారిగా అంత ధర తగ్గించడం ఎలా సాధ్యమంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొత్త బ్యాటరీ సెల్ యూనిట్ నెలకొల్పడం ద్వారా భారం తగ్గించుకోవచ్చంటూ మస్క్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాడు. ఈ మేరకు కొత్త కార్లపై 50 శాతం ధరల తగ్గింపు ఆలోచనకు టెస్లా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక టెస్లా కంపెనీ భారత్ లాంటి పెద్ద మార్కెట్‌పై కన్నేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నాలుగు మోడల్స్‌కు సూత్రప్రాయంగా లైన్ క్లియర్ అయ్యిందంటూ కథనాలు వస్తున్నాయి. అయితే తక్కువ రేటు కార్ల తయారీ కూడా భారత్‌లాంటి దేశాలను దృష్టిలో పెట్టుకునే టెస్లా చేస్తోందని తెలుస్తోంది. -
కోతి చేతికి స్టీరింగ్: బస్సు డ్రైవర్ని సస్పెండ్
-
వైరల్ వీడియో : కోతి చేతికి స్టీరింగ్
బెంగళూరు : ఈ మధ్య కాలంలో ఏదో ఒక చోట ఆర్టీసీ బస్సు లు ప్రమదాలకు గురవుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. వీటిలో కొన్ని డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకున్నవి కూడా ఉన్నాయి. ఇలాంటి నిర్లక్ష్యపూరిత సంఘటనే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ బస్సు డ్రైవర్ ఏకంగా కోతి చేతికి స్టీరింగ్ ఇచ్చి దాని వేషాలను చూస్తూ కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కర్ణాటక ప్రభుత్వం సదరు బస్ డ్రైవర్ని విధుల నుంచి తొలగించింది. ఈ సంఘటన ఈ నెల 1న జరిగింది. వీడియోలో ఉన్న డ్రైవర్ పేరు ప్రకాష్. ఇతను దావణగేరె డివిజన్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1న ప్రకాష్ దావణగేరె నుంచి భరమసాగర వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కోతి, దాని ట్రైనర్ రోజు ఇదే బస్సులో ప్రయాణం చేస్తుంటారని తెలిసింది. ఈ పరిచయం వల్ల కోతి స్టీరింగ్ మీద కూర్చునప్పటికి డ్రైవర్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా.. కోతి స్టీరింగ్ తిప్పుతుంటే అతను గేర్ మారుస్తూ వినోదం చూస్తున్నాడు. ఈ కోతి వేషాలను బస్సులోని ఓ ప్రయాణికుడు తన స్మార్ట్‌ఫోన్‌లో వీడియో తీశాడు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో ఆ బస్సు డ్రైవర్ని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
స్టీరింగ్ ఊడిన స్కూలు బస్సు
దెందులూరు(పశ్చిమగోదావరి): దెందులూరు మండలం పోతునూరు గ్రామం సమీపంలో విశ్వకవి స్కూల్ బస్సు బోల్తా పడి 30మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు స్టీరింగ్ ఊడి పోవడంతో అదుపు తప్పి పంట కాలువలోకి బస్సు దూసుకెళ్లింది. దీంతో బస్ ఫిట్ నెస్ పై విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిపేర్‌కు వచ్చిన బస్సును స్కూల్ యాజమాన్యం వాడుతోందని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ బస్సు ప్రమాదానికి గురైందని, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రైట్ టర్న్
చక్రాలు తిరుగుతున్నాయి. రోడ్డు... కారును హత్తుకుంది. గమ్యం పిలుస్తోంది. స్పీడు పెరిగింది. రేర్‌వ్యూ మిర్రర్లో పీడకల మాయమైపోతోంది. ఇప్పుడు చక్రం తిప్పుతున్న చేతి గాజులు తాళం వేస్తున్నాయి. ఒక మహిళ జీవితం ఎంత అందంగా ఉండాలనుకుంటామో అంత అందంగా ఉంది. ఎంత గౌరవంగా ఉండాలనుకుంటామో అంత ధీమాతో సాగుతోంది. ఆమె టాక్సీలో పాసింజర్గా ఒక్కసారి ప్రయాణం చేసినా చాలు... ఎవరికైనా జీవితంపై ఆసక్తి, జీవనయానానికి ఒక గమ్యం దొరుకుతుంది. ఒకప్పుడు సెల్వి ఇలాంటి ఒక రోడ్డుమీదికి పరిగెట్టుకుంటూ వచ్చింది... ఏ బండి కిందైనా పడి చనిపోదామని! ఇప్పుడు అదే రోడ్డు, సెల్వి బండికి సలామ్ కొడుతోంది. మనందరికీ ఒక ‘రైట్’ టర్న్ చూపిస్తోంది! మైసూర్... తారు రోడ్డు మీద జర్క్స్ లేకుండా సాఫీగా సాగిపోతోంది ఓ టాక్సీ! వెనకసీట్లో ముప్పై పైబడిన యువకులు ఇద్దరు కూర్చుని ఉన్నారు. అందులో ఒకతను.. స్టీరింగ్ వీల్‌ని అలవోకగా తిప్పుతున్న ఆమె నల్లని, సన్నని, కోమలమైన వేళ్లనే చూస్తున్నాడు అబ్బురంగా! ఆ వేళ్లలో ఒడుపు ఉంది, నేర్పు ఉంది. పట్టువిడుపులు ఉన్నాయి. ఆమె పేరు సెల్వి. వయసు 28! స్వస్థలం.. తమిళనాడు, కర్ణాటక బార్డర్‌లోని మారుమూల పల్లె! ఓ టాక్సీడ్రైవర్ గురించి చెప్పడానికా ఈ ఉపోద్ఘాతం అని పెదవి విరవకండి! సెల్వి కర్ణాటక రాష్ట్రంలోని మొదటి మహిళా టాక్సీడ్రైవర్. బస్, లారీ, ట్రక్ లాంటి భారీ వెహికిల్స్‌ని కూడా నడపగలదు.ఆమె మీద కెనడాకు చెందిన ఎలిసా పొలోస్కీ అనే ఫిల్మ్‌మేకర్ ‘డ్రైవింగ్ విత్ సెల్వి’ అనే డాక్యుమెంటరీ కూడా తీసింది. అయితే ఈ సాధికారతను సాధించడానికి సెల్వి ఎన్నో మలుపులు, ఇంకెన్నో స్పీడ్బ్రేకర్స్ని దాటాల్సి వచ్చింది. రెండువేల సంవత్సరంలో... తొమ్మిదో తరగతిలో ఉంది సెల్వి. భుజాన పుస్తకాల బ్యాగ్మోస్తూ తన భవిష్యత్ కలను స్నేహితులతో పంచుకుంటూ నడుస్తున్న సెల్వికి చెప్పారు స్నేహితులు తమ క్లాస్మేట్స్ ఇద్దరి పెళ్లిళ్లు కుదిరాయని, ఆ రోజు నుంచి వాళ్లు ఇక స్కూల్‌కి రాకపోవచ్చని. ఆ మాట విని హఠాత్తుగా ఆగిపోయింది ఆమె. ‘పెద్ద చదువులు, ఉద్యోగాలు లేకుండా కనీసి పదో తరగతి కూడా దాటకుండానే పెళ్లా? పాపం’ అనుకొని మళ్లీ నడకసాగించింది. ‘దేవుడా నాకు ఆ గతి పట్టకుండా చూస్తున్నావ్. రొంబ థాంక్స్’ అనుకుంది మనసులోనే. అదే సమయంలో సెల్వి ఇంట్లో ఆమె తల్లి, అన్న, మేనమామ సెల్వి పెళ్లికోసం సంబంధం మాట్లాడుతున్న విషయం ఆమెకు తెలియదు.. కనీసం ఆమె ఊహకు కూడా అందలేదు! అంది ఉంటే దేవుడికి అంతలా థ్యాంక్స్ చెప్పేది కాదేమో! సాయంకాలం... స్కూల్ నుంచి వచ్చిన సెల్వికి ఇంట్లో వాతావరణం అంతా కొత్తగా అనిపించింది. ఇత్తడి పళ్లెంలో చీర, జాకెట్టు గుడ్డ, పళ్లు, పూలు, స్వీట్లతో తాంబూలం ఉండడం, ఎన్నడూలేంది మేనమామ భార్య ఆప్యాయంగా పలకరించడం.. ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా తమని దగ్గరికి తీసుకున్న పాపాన పోలేదు.. కానీ ఈ రోజేంటో స్కూల్నుంచి రాగానే భుజం మీదనుంచి బ్యాగ్ అయినా తీయలేదు తను ‘మా బంగారమే.. మా ఇంటి మహాలక్ష్మే’ అంటూ దగ్గరకి వచ్చి మెటికలు విరుస్తూ ఊపిరాడనంత గట్టిగా హత్తుకుంది అత్త. సెల్వి మనసు కీడు శంకించింది. అక్కడే బల్లమీద కూర్చోని చూస్తున్న తల్లి మొహంలో చిన్నపాటి కలవరం. తనకు నచ్చని విషయాన్ని చెప్పి ఎలా ఒప్పించాలా అన్నట్టుంది ఆమె వాలకం. ‘సెల్వి.. నీకు పెళ్లి కుదిరింది’ అకస్మాత్తుగా అంటూ అప్పటిదాకా ఉన్న ఇబ్బందిని బ్రేక్ చేశాడు సెల్వి అన్న. ‘నాకు పెళ్లేంటి?’ తన మనసు శంకించిన కీడు ఇదేనా అనుకుంటూ అడిగింది సెల్వి. ‘అవును.. మంచి సంబంధం. అబ్బాయికి వ్యాపారం ఉంది. పైగా అత్తావాళ్లకు తెలిసినవాళ్లు. మనకు నయాపైసా ఖర్చు కాకుండా పెళ్లి చేసుకుంటామన్నారు. అన్నయ్యకు ఉద్యోగమూ ఇప్పిస్తామన్నారు’ ఏ భావమూ లేకుండా, ఈ పెళ్లికి సెల్వి అనుమతి అవసరం అన్న భావనను జారవిడవకుండా చెప్పుకెళ్లింది సెల్వి తల్లి. ఆ రాత్రి మొదలు సెల్వి కొన్ని రాత్రులు ఏడ్చింది, మొత్తుకుంది, బతిమాలింది, బామాలింది పెళ్లివద్దని. కానీ ఎవరి చెవికీ ఎక్కలేదు. ఇంకెవరి మనసుకీ పట్టలేదు. తన క్లాస్మేట్స్ ఇద్దరిలాగే పదో తరగతి దాటకుండానే సెల్వి పెళ్లి అయిపోయింది. అత్తింట్లో... బాల్యవివాహానికి బలైన సెల్వికి అత్తింట్లో గృహ హింస ఎదురైంది. భర్తకు, ఆమెకు దాదాపు పదాహారేళ్ల వయసు తేడా. చీటికీమాటికీ కొట్టడం, నోటికొచ్చినట్టు తిట్టడం. ఇదే... అత్తింట్లో ఆమెకు భర్త ఇచ్చిన ఆదరణ. కాఫీ సరిగ్గా కలపలేదనే దగ్గర్నుంచి ఇల్లు సర్దడం రాదు అనే మిషను దాటి చివరకు పిల్లలు పుట్టలేదు అనేంత వరకు వెళ్లాయి అత్తింటి వేధింపులు. ఎంత సహనంగా ఉన్నా ప్రతి రోజూ ఆ సహనానికి పరీక్ష జరిగేది. అలా నాలుగేళ్లు గడిచాయి. అమ్మకు చెప్పి ఏడిస్తే ఈసడింపే కానీ ఓదార్పు దొరికేది కాదు. అన్న అసలు ఆమె బాధను తన చెవిదాకా రానిచ్చేవాడే కాదు. ‘ఏమైనా అదే నీ ఇల్లు. కష్టమైనా, నష్టమైనా అక్కడే భరించాలి. అసలు మేమున్నామనే విషయాన్నే మరిచిపో’ అంది అమ్మ ఒకరోజు. అత్తగారింట్లో వెతలకన్నా అమ్మ అన్న ఆ మాటే ఎక్కువ బాధించింది సెల్విని. 2004లో... ఓ రోజు.. ఆత్మహత్య తప్ప తన సమస్యకు వేరే పరిష్కారం లేదని అత్తింటి గడపదాటి రోడ్డుమీదకు వచ్చింది. వేగంగా వస్తున్న బస్ కిందకు వెళ్లాలనుకుంది. ఆ క్షణంలో ఆమె మెదడు ఏం ఆలోచించించిదో మరి బస్ కిందకు వెళ్లాలనుకున్న ఆమె చెయ్యి ఎత్తి బస్ ఆపింది. సడెన్ బ్రేక్‌తో ఆగిన బస్‌లోకి ఎక్కేసింది. అది మైసూర్ బస్. అదే ఆమె ఆలోచనా గమ్యాన్ని, ప్రయాణ మార్గాన్నీ మార్చింది. బస్‌లో పక్కసీట్లోనే ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ సెల్వితో మాటలు కలిపింది. వివరాలు తెలుసుకొని ఆమెను సరాసరి మైసూర్‌లోని ‘ఒడనాడి’ విమెన్ రెఫ్యూజీ సంస్థకు తీసుకెళ్లింది. అక్కడ చేరిన సెల్వి డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇంకో వైపు ప్రైవేట్‌గా టెన్త్‌క్లాస్ పరీక్షకు హాజరైంది. డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు, టెన్త్‌లోనూ ఉత్తీర్ణత సాధించింది. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఓ టాక్సీనీ కొనుక్కుంది. అలా కర్ణాటకలోనే ఫస్ట్ లేడీ టాక్సీ డ్రైవర్‌గా నిలిచింది. ఆత్మవిశ్వాసం... రోడ్డు మీద కారు ప్రయాణం సెల్విలో కొత్త విశ్వాసాన్నిచ్చింది. ఆత్మబలాన్ని పెంచింది. ఆ తెగువతో మైసూర్‌లోని స్త్రీలకు సంబంధించిన పలు స్వచ్ఛంద సంస్థలను కలవడం, వాళ్లతో కలిసి పనిచేయడం స్టార్ట్ చేసింది. అంతేకాదు మహిళల అరోగ్య సమస్యల మీదా గొంతు విప్పింది. చేతనైన సహాయం చేస్తోంది. తనలాంటి ఇంకెంతో మంది నిరాశ్రయ మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణనిస్తోంది. కొద్ది కాలంలోనే సెల్వి ఇటు కర్ణాటకలోనూ, అటు తమిళనాడులోనూ ఫేమస్అయిపోయింది. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌లోనూ సెల్వీ స్టోరీ చోటు సంపాదించుకుంది. అది చదివే కెనడియన్ ఫిల్మ్‌మేకర్ ఎలీసా పొలోస్కి సెల్వీ మీద డాక్యుమెంటరీ తీసింది. అది లండన్‌లోని రెయిన్డాన్స్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయి ప్రశంసలూ అందుకుంది. ‘బస్‌కింద పడదామని వచ్చిన నాకు చివరి నిమిషంలో అనిపించింది.. నేనేందుకు చావాలి? అని. బతికి నన్ను నేను వ్రూవ్ చేసుకోవాలనుకున్నా. అందుకే చేయి ఎత్తి బస్ ఆపాను. ఈ దేశంలో ఆడవాళ్లకు బాధలే ఉండాలి అన్న రూలేం లేదుకదా! సంతోషాన్ని ఒకరు ఇవ్వడమేంటి? మన ఆనందాన్ని మనమే వెదుక్కోవాలి. సంతోషపడే హక్కు మగవాళ్లకెంత ఉందో మనకూ అంతే ఉంది. దేనికీ తలవంచకుండా ఉంటే చాలు!’ అంటూ టాక్సీ యాక్స్లెటర్ని రైజ్ చేసింది సెల్వీ గమ్యంలో మరింత దూసుకుపోవడానికి సిద్ధమవుతూ! సెల్వి జీవన ప్రయాణంలో ఆమెకు తోడైన ఒక వ్యక్తి ఆమె చేయి అందుకున్నాడు. ఇప్పుడు వాళ్లకిద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయిని పైలట్‌ను చేయాలని, చిన్నమ్మాయిని డాక్టర్ని చేయాలని అనుకుంటోంది సెల్వి. -
ఎదురు తిరిగింది... స్టీరింగ్ తిప్పింది!
‘ఆడపిల్లలు ఇవి మాత్రమే చేయాలి...’ అంటూ మన సమాజం ఒక జాబితాను తయారు చేసింది. కొన్ని వందల యేళ్లుగా అందరూ వాటినే అనుసరిస్తున్నారు. అలా అనుసరించని వాళ్లని వింతగా చూస్తున్నారు. ఆ సంగతి తెలిసి కూడా ఓ మహిళ ఆ నియమాలను ధిక్కరించింది. నేను ఎందుకు చేయకూడదు అని ఎదురు తిరిగి ప్రశ్నించింది. ఇదే చేస్తాను అంటూ తను కోరుకున్న దిశగా అడుగులు వేసుకుంటూ పోయింది. నేడు వందలాది మందికి ఆదర్శంగా నిలబడింది! అక్టోబర్ 26, 2010. ఆ రోజు ప్రపంచానికి ప్రత్యేకమైన రోజు కాకపోవచ్చు. కానీ ప్రేమా రామప్ప జీవితంలో మాత్రం ఎంతో ప్రత్యేక మైన రోజు. ఓ గొప్ప విజయాన్ని సాధించిన రోజు. తనేమిటో చూపించిన రోజు. ఆ రోజు ఆమె తొలిసారిగా బస్సు స్టీరింగును పట్టుకుంది. బెంగళూరు రోడ్ల మీద సిటీ బస్సును పరుగులు పెట్టించింది. కర్నాటక రాష్ట్రంలో బస్సును నడిపిన తొలి మహిళా డ్రైవర్‌గా రికార్డును నెలకొల్పింది. బతుకు బండిని నడపలేక... ‘‘బస్సు నడుపుతావా, అలాంటి పనులు మగాళ్లకి గానీ నీకెందుకు?’’ ఈ మాట విని ప్రేమకి కోపం రాలేదు. నవ్వొచ్చింది. యుగాలు గడిచినా, తరాలు మారినా ఆడ, మగ తేడాలు మాత్రం మార లేదు కదా అనుకుంది. కానీ వెనకడుగు మాత్రం వేయలేదు. ఎందుకంటే... బతుకు బండిని నడపలేక అవస్థ పడుతున్న తనకు చక్రాల బండి ఆధారమవగలదని ఓ నమ్మకం. అందుకే ఎలాగైనా బస్సు డ్రైవర్ అవ్వాలని నిర్ణయించుకుంది. అది మగాళ్ల ఉద్యోగమని అన్నా వినలేదు. ఈ పట్టుదల ఇవాళ కొత్తగా రాలేదు ప్రేమకి. ఆమె చిన్నప్పట్నుంచీ అంతే. ఏదైనా చేయాలనుకుంటే చేసి తీరుతుంది. ఎందుకో మొదట్నుంచీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడే బంధువుల దగ్గర బైకు తీసుకుని నడిపింది. బడికెళ్లి వచ్చేటప్పుడు తమ స్కూలు బస్సు డ్రైవర్ పక్కనే కూర్చునేది. ఆయన ఎలా నడుపుతున్నాడు, గేర్ ఎప్పుడు వేస్తున్నాడు, క్లచ్ ఎప్పుడు తొక్కుతున్నాడు... అన్నీ గమనించేది. మధ్య మధ్యన అతడిని ప్రశ్నలు కూడా అడిగేది. ప్రేమ ఆసక్తి చూసి అతడు ఓపిగ్గా చెప్పేవాడు. దాంతో ఎలాగైనా నాలుగు చక్రాల వాహనాన్ని నడపాలనే కోరిక కలిగింది ప్రేమకి. మెల్లగా అది కూడా నేర్చుకుంది. కానీ నడిపే అవకాశం మాత్రం రాలేదు. ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. కానీ వచ్చిన పరిస్థితులు మాత్రం మామూలువి కాదు. చదువు త్వరగానే ముగించి, నర్సు ఉద్యోగం సంపాదించింది ప్రేమ. తండ్రి లేకపోయినా అన్నీ తానై పెంచిన తల్లికి అండగా నిలిచింది. ఆమె చూపించిన వ్యక్తితో తాళి కట్టించుకుంది. ఓ మగబిడ్డకు తల్లి కూడా అయ్యింది. అంతా ఆనందంగా సాగిపోతోందనుకున్న సమయంలో ఓ పెద్ద తుఫాను. ప్రేమ భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. ఓ పక్క ఆ బాధ... తనకు జన్మనిచ్చిన తల్లిని, తాను జన్మనిచ్చిన కొడుకుని బాగా చూసుకోవా లన్న తపన మరోపక్క... నలిగిపోయింది ప్రేమ. ఆపైన బాగా ఆలోచించి, తిన్నగా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లింది. ఫోర్ వీలర్ లెసైన్సుకు అప్లై చేసింది. లెసైన్సు వచ్చాక బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్‌సపోర్‌ట కార్పొరేషన్ నిర్వహించిన పరీక్షకు హాజరయ్యింది. అందులో పాసై బస్సు స్టీరింగును చేత పట్టింది. మొదట్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రేమని అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఆ తర్వాత అభినందించడం మొదలుపెట్టారు. ఆపైన ఆమె స్ఫూర్తితో కొందరు మహిళలు డ్రైవర్లుగా మారారు. ‘‘బస్సు నడుపుతాను అని నేను అన్నప్పుడు... ఆడవాళ్లు అలాం టివి చేస్తారా ఎక్కడైనా అంటూ కొందరు ఎగతాళిగా మాట్లాడారు. వాళ్లని నేను తప్పు బట్టను. మన సమాజం అలా ఉంది. కానీ నేను అలా లేను కదా. కనీసం నన్ను చూశా కైనా ఆడపిల్లలు ఏదైనా చేయొచ్చు, చేయ గలరు అని అర్థమైతే చాలనుకున్నాను’’ అంటుంది ప్రేమ నవ్వుతూ. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వే ఆమెకు అందం. అది మొక్కవోని ఆమె ఆత్మవిశ్వాసానికి దర్పణం! - సమీర నేలపూడి కర్నాటకలోని ఆర్టీసీ డ్రైవర్లంతా సమ్మె చేస్తుంటే, తన కడుపు నింపుతోన్న సంస్థకు ద్రోహం చేయ నంటూ బస్సును నడిపిన ధీశాలి ప్రేమ. కొందరు తనపై దాడి చేసినా కూడా బెదరలేదు. ఆమె ధైర్యానికి, స్థైర్యానికి, నిబద్దతకి మెచ్చి ప్రభుత్వం ఉత్తమ డ్రైవర్ అవార్డును కూడా ఇచ్చింది. అందుకు ఎవరైనా ప్రశంసిస్తే... ‘నా కొడుకుని గొప్పవాణ్ని చేయాలన్న తపనే నన్నీ స్థాయికి తెచ్చింది తప్ప ఇందులో నా గొప్పదనమేమీ లేదు’ అంటుంది సింపుల్‌గా.