పింక్‌ టికెట్‌ | Delhi City Buses Have Provided Free Travel For All Women | Sakshi
Sakshi News home page

పింక్‌ టికెట్‌

Published Thu, Oct 31 2019 3:41 AM | Last Updated on Thu, Oct 31 2019 3:41 AM

Delhi City Buses Have Provided Free Travel For All Women - Sakshi

‘స్త్రీ సాధికారత’ అనే మాట అర్థమైనట్లే ఉంటుంది కానీ, అర్థమేంటని అడిగితే మాత్రం సరిగ్గా అర్థమయ్యేలా చెప్పలేం. దేన్నైనా సాధించుకునే అధికారం సాధికారత. అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు, సొంతకాళ్లపై నిలబడే హక్కు, నలుగుర్ని పోషించే హక్కు... ఇవన్నీ కలిస్తే సాధికారత. స్త్రీ సాధికారత అంటే స్త్రీకి ఈ హక్కులన్నీ ఉండటం. స్త్రీ సాధికారతకు విద్య ఉండాలి. ఉద్యోగం లేదా ఉపాధి ఉండాలి. ఇవి సాధించడానికి ‘మొబిలిటీ’ ఉండాలి. మొబిలిటీ అంటే కదిలే వెసులుబాటు. ఇంటి నుంచి బయటికి స్వేచ్ఛగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా వెళ్లొచ్చే సదుపాయం ఉన్నట్లయితే.. అన్ని అర్హతలుండీ కేవలం కదిలే అవకాశాల్లేక గృహిణులుగా మాత్రమే ఉండిపోయిన ఎందరో మహిళలకు ‘మొబిలిటీ’ వస్తుంది.

ప్రయాణ ఖర్చులను భరించలేక, ప్రయాణంలో భద్రత లేక ఇంటి చుట్టుపక్కల ఉండే స్కూళ్లు, కాలేజీలతో సరిపెట్టుకునే అవసరం ఉండదు. మంచి స్కూల్లో సీటోస్తే వెళ్లి చేరిపోతారు. మంచి ఆఫీస్‌లో ఆఫర్‌ వస్తే చాలీచాలని జీతంతో పాత ఉద్యోగాన్నే పట్టుకుని వేళ్లాడే పని ఉండదు. మొబిలిటీలో సాధికారత వచ్చేస్తుంది. లేదా సాధికారతకు దారి పడుతుంది. మంగళవారం నుంచి ఢిల్లీ సిటీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, వారి భద్రత కోసం అన్ని బస్సులలో కలిపి సుమారు 13 వేల మంది మార్షల్స్‌ను నియమించారు!  ఈ సంఖ్య గతంలో 3,400 మాత్రమే ఉండేది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ (డీటీసీ) ప్రస్తుతం 3,700 బస్సులను నడుపుతోంది.ప్రైవేటుగా మరో 1800 బస్సులను (క్లస్టర్‌ బస్సులు) నడుపుతోంది.

వీటన్నిటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణమే. సిటీ బస్సెక్కగానే కండక్టరే వచ్చి టికెట్‌ ఇస్తాడు. డబ్బులు తీసుకోడు. మహిళలకు మాత్రమే ఇచ్చే ఆ టికెట్‌ లేత గులాబీ రంగులో ఉంటుంది. మహిళలకు ఈ సదుపాయాన్ని కల్పించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అక్టోబర్‌ 29న అన్నాచెల్లెళ్ల పండగైన ‘భాయ్‌ దూజ్‌’ (సోదరుని ఆశీస్సులు) రోజును ఎంచుకున్నారు. కేవలం సిటీ బస్సులకే కాకుండా, నోయిడా–ఎన్‌సిఆర్‌ (నేషనల్‌ రీజినల్‌ క్యాపిటల్‌) సర్వీసులు, విమానాశ్రయానికి, ఇతర ప్రత్యేక స్థలాలకు డీటీసీ నడిపే బస్సులకు కూడా ఈ ఉచితం వర్తిస్తుంది. బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులకు పది రూపాయల టిక్కెట్‌ ఇస్తారు. ఆ టికెట్‌తో ఆ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కినప్పుడు అందులోనూ పది రూపాయల టిక్కెట్‌ ఇస్తారు. అలా మహిళలు ఢిల్లీ అంతా ప్రయాణించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement