ఎన్నికల సమయంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. వీటిని విన్నప్పుడు ఒకపట్టాన నమ్మాలని అనిపించదు. ఒకప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు హాజరుకాబోతున్న యువకునికి కాంగ్రెస్ ఎన్నికల టిక్కెట్టు ఇచ్చింది. ఈ ఉదంతం బీహార్ కాంగ్రెస్ నేత రామ్ భగత్ పాశ్వాన్ విషయంలో జరిగింది.
1970లో బీహార్‌లోని దర్బంగాకు చెందిన రామ్‌భగత్ పాశ్వాన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మాజీ మంత్రులు లలిత్ నారాయణ్ మిశ్రా, వినోదానంద్ ఝా, నాగేంద్ర ఝాలను కలుసుకున్నారు. ఆ సమయంలో వారంతా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేయాలని పాశ్వాన్‌ను కోరారు. దీనికి ఎంటనే ఆయన అంగీకరించారు. గతంలో రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ, పాశ్వాన్ ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపారు.
1971 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని రోస్రా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పాశ్వాన్ బరిలోకి దిగారు. సైకిల్‌పై ప్రచారం సాగించారు. నాటి ఎన్నికల్లో ఆయన సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్యర్థి రామ్‌సేవక్ హజారీని ఓడించారు. రోస్రా ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరకాలంలో కాంగ్రెస్ అతనిని రాజ్యసభకు పంపింది. దాదాపు 17 ఏళ్ల పాటు రామ్‌భగత్ పాశ్వాన్ ఎంపీగా ఉన్నారు.
నాడు రామ్‌భగత్ పాశ్వాన్ పోస్ట్‌మాస్టర్‌గా ఉంటూనే సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన పోస్ట్‌మాస్టర్ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అతని జీతం నెలకు రూ.150. ఉద్యోగం మానేయడంతో భార్య జీతం రూ.75పైనే ఆయన ఆధారపడాల్సి వచ్చింది.
భర్త ఎంపీ అయిన తర్వాత కూడా రామ్‌భగత్ పాశ్వాన్ భార్య విమలాదేవి ఉద్యోగం వదల్లేదు. ఆమె ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేసి, ప్రస్తుతం లాహెరియాసరాయ్‌లో ఉంటున్నారు. రామ్‌భగత్ పాశ్వాన్ దంపతులకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు.
Comments
Please login to add a commentAdd a comment