
తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు
నష్ట సమాచారం లేదన్న అధికారులు
ప్రజలు ఆందోళన చెందవద్దన్న మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు బిహార్‌లోని సివాన్‌లో సోమవారం ఉదయం భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.0గా నమోదైంది. ప్రకంపనల కేంద్రం ఎర్రకోటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధౌలా కువాన్‌లోని ఝీల్ పార్క్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ఉదయం 5.36 గంటల సమయంలో కంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(ఎన్‌సీఎస్) తెలిపింది. ఈ ప్రాంతంలో భూమి కంపించిన సమయంలో పెద్దపెద్ద శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
భూమికి 5 నుంచి 10 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలను సాధారణ భూకంపాలుగా పరిగణిస్తారు. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఎక్కువ నష్టం సంభవించేందుకు అవకాశముంటుంది. ఝీల్ పార్క్ ప్రాంతంలో ఏటా కనీసం రెండుమూడుసార్లు భూమి కంపిస్తుంటుందని స్థానికులు తెలిపారు. 2015లో ఇక్కడ సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైంది. ప్రకంపనలతో భయపడిన ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లోని జనం భూకంపం వచ్చిందంటూ రోడ్లపైకి చేరుకున్నారు.
ఇంత తీవ్రమైన భూకంపం ఇంతకు ముందెన్నడూ తాము చూడలేదని పలువురు తెలిపారు. భారీగా శబ్దాలు రావడంతో ఎంతో భయపడిపోయామని చెప్పారు. భూకంపంతో ఎవరూ గాయపడలేదని, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో సంభవించిన భూ ప్రకంపనలతో ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తదుపరి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ‘ఎక్స్’లో సూచించారు. అధికారులు పరిస్థితులను గమనిస్తున్నారన్నారు.
బిహార్‌లోనూ ప్రకంపనలు
బిహార్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. ముఖ్యంగా శివాన్ చుట్టుపక్కల జిల్లాల్లో భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. శివాన్‌లో ఉదయం 8 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలను గుర్తించామని ఎన్‌సీఎస్ తెలిపింది. భూకంపం కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించినట్లు ఎటువంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. సివాన్‌లో ప్రకంపనలతో భయకంపితులైన జనం ముందు జాగ్రత్తగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
తరచూ ఎందుకు?
ఢిల్లీలో భూకంపాలు అసా ధారణమేం కాదు. ఢిల్లీ ప్రాంతం క్రియా శీల భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది. హిమాలయాలకు దగ్గరగా ఉండటంతోపాటు ప్రపంచంలో అత్యంత భూకంప చురుకైన ప్రాంతాలలో ఒకటిగా ఉంది. కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ఆవలి హిమాలయ పర్వతాలకు ఇవతలి వైపు హిమాలయాలకు మధ్య నెలకొన్న ఒత్తిడి( మెయిర్ బౌండరీ థ్రస్ట్–ఎంబీటీ) అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తోంది.
ఢిల్లీ–హరిద్వార్ రిడ్జ్, మహేంద్రగఢ్–డెహ్రాడూన్ ఫాల్ట్, మొరాదాబాద్ ఫాల్ట్, సోహ్నా ఫాల్ట్, యమునా నదీ రేఖతో సహా అనేక భూకంప అనుకూల ప్రాంతాలు దేశరాజధాని భూభాగానికి సమీపంలో ఉన్నాయి. దీంతో భూకంపాల తీవ్రత అధికం. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం ఢిల్లీ భూకంప జోన్–4లో ఉంది. జోన్–4 అంటే భూకంపాల ప్రమాదం ఎక్కువ ఉంటుందని అర్థం. ఇలాంటి జోన్‌లో భూకంపాలు సాధారణంగా రిక్టర్ స్కేల్‌పై ఐదు లేదా ఆరు తీవ్రతతో వస్తాయి. అప్పు డప్పుడు ఏడు లేదా 8 తీవ్రతతో సంభవిస్తాయి. అయితే ఈ జోన్ పరిధి∙నిరంతరం మారు తూ ఉంటుంది.
రిక్టర్ స్కేల్‌పై నాలుగుగా నమోదైనా
సోమవారం రిక్టర్ స్కేల్‌పై కేవలం 4 తీవ్రతతో సంభవించినప్పటికీ దాని ప్రభావం మాత్రం తీవ్రంగా కనిపించింది. అందుకు కారణం ఉంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు వస్తాయి. భూకంపం పుట్టిన ప్రదేశంలో దాని శక్తి తీవ్రంగా ఉంటుంది. దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రకంపనలు బలహీ నమవు తాయి. నేల రకం వంటి స్థానిక భౌగోళిక పరిస్థితులు కూడా కదలికల్లో హెచ్చు తగ్గులకు కారణ మవుతాయి.
ఢిల్లీ–ఎన్సీఆర్ విషయానికొస్తే భూఉపరి తలానికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇది నగరం అంతటా బలమైన ప్రకంపనలను సృష్టించింది. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి ఉత్తర ప్రాంతాల్లో సంభవించే భూకంపాల వల్ల ఢిల్లీలో స్వల్ప కదలికలు న మోదవుతాయి. అయితే, సోమవారం æ భూకంప కేంద్రం ఢిల్లీ సమీపంలో ఉండటంతో ఢిల్లీ–ఎన్సీఆర్‌లో మరింత తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment