నేపాల్ కేంద్రంగా మళ్లీ భూకంపం
న్యూఢిల్లీ : నేపాల్ భూవిలయం మరవక ముందే... ఉత్తర, ఈశాన్య భారతాన్ని మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఢిల్లీ, బెంగాల్, బీహార్, పాట్నా, కోల్కతా, రాజస్థాన్, పంజాబ్, లక్నో, జైపూర్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం 12.35 గంటలకు భూమి కంపించింది. సుమారు 60 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలతో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
జియలాజికల్ సర్వే విభాగం ప్రకారం భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.1గా నమోదైంది. భూమికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఏర్పడింది. ముందుగా ఆఫ్ఘనిస్థాన్తో భూకంప కేంద్రకం ఉందని వెల్లడించిన ఐఎండీ ఆ తర్వాత నేపాల్ రాజధాని కఠ్మండ్కు 83 కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చని సవరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గొల్లపూడి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ, అమలాపురంతో పాటు, విశాఖలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. స్వల్ప ప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.