మళ్లీ వణికిన ఉత్తరాది
నేపాల్‌లో మళ్లీ భూకంపంతో బెంగాల్, బిహార్, ఢిల్లీలో ప్రకంపనలు
⇒ ఇళ్ల నుంచి భయంతో పరుగులు పెట్టిన జనం
⇒ దేశంలో 62కు చేరిన మృతుల సంఖ్య.. ఒక్క బిహార్‌లోనే 51 మంది మృత్యువాత
⇒ మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం
⇒ సహాయక చర్యలపై ప్రధాని మోదీ సమీక్ష
న్యూఢిల్లీ: ఉత్తరాది మళ్లీ వణికింది! శనివారం నాటి పెను భూకంపం నుంచి తేరుకోకముందే ఆదివారం మరోసారి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసింది.
నేపాల్‌లో తాజాగా 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రభావం పశ్చిమబెంగాల్, బిహార్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ వరకు విస్తరించింది. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం 12.42 గంటలకు 30 సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, దేశంలో భూకంపంతో మరణించిన వారి సంఖ్య 62కు చేరింది. ఒక్క బిహార్‌లోనే 51 మంది మృత్యువాత పడ్డారు. నిబంధనలను సడలిస్తూ మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.6 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలతోపాటు నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.
నేపాల్‌లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు విమాన మార్గంతోపాటు రోడ్డు మార్గాన్ని కూడా వినియోగించాలని అధికారులకు సూచించారు. బాధితులకు తక్షణమే మంచినీరు, ఆహారం, పాల పౌడర్ అందేలా చూడాలని ఆదేశించారు. శనివారం దేశంలో మృతుల సంఖ్య 51 కాగా, ఆదివారం నాటికి 62 చేరినట్లు విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, హోంశాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్ తెలిపారు. మరో 259 మంది గాయపడినట్లు వివరించారు.
బిహార్ బిక్కుబిక్కు... నేపాల్ భూకంపం బిహార్‌ను వణికిస్తోంది! ఆదివారం మరోసారి ప్రకంపనలు రావడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 8సార్లు ప్రకంపనలు వచ్చాయి. భూకంపంతో బిహార్‌లో మరణించినవారి సంఖ్య 51కి చేరడంతో ముఖ్యమంంత్రి నితీశ్‌కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల పరిహారం అందించినట్లు సీఎం విలేకరులకు తెలిపారు.
ప్రకంపనలు కొనసాగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేపాల్‌లోని పొఖారా ప్రాంతంలో పెద్దసంఖ్యలో చిక్కుకుపోయిన బిహార్‌వాసులను కాపాడేందుకు అక్కడికి ప్రత్యేకంగా బస్సులు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూకంపాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ కేంద్రాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భూకంపం ప్రభావానికి గురైన కతిహార్, పూర్ణియా జిల్లాల్లో ఆదివారం కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఇక మన వంతు!
న్యూఢిల్లీ: భారీ భూకంపానికి నేపాల్ అతలాకుతలమైన నేపథ్యంలో.. భారత్‌కూ ఆ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తర భారత ప్రాంతంలో అదే స్థాయిలో పెను భూకంపం వచ్చే అవకాశముందంటున్నారు. అసలు ఈ ప్రాంతంలో ఇప్పటికే భూకంపం రావాల్సి ఉందని.. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌ల్లోని హిమాలయాల సానువుల్లో ఇప్పటి నుంచి 50 ఏళ్లదాకా ఏ క్షణమైనా ఇది జరగవచ్చని పేర్కొంటున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను అహ్మదాబాద్‌లోని భూకంప పరిశోధన ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ జనరల్ బి.కె.రస్తోగీ చెప్పారు. ‘ఉత్తర భారత్‌లో హిమాలయాలకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో పెను భూకంపం వచ్చే అవకాశముంది. ఈ ప్రాంత భూమి పొరల్లో ఖాళీలున్నాయి. టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల తీవ్ర ఒత్తిడి పుడుతోంది. దీనివల్ల పైపొరలోని భారీ శిలలు పగులుతాయి. ఆ ఒత్తిడి మరిం తగా పెరిగితే భూకంపాలు వస్తాయి.
హిమాలయాల వద్ద 2 వేల కిలోమీటర్ల పొడవునా ప్రతి వంద కి.మీ. ప్రాంతంలో ఎక్కడైనా భారీ ప్రకంపనలు రావచ్చు. అయితే కింది పొరల్లోని టెక్టానిక్ ప్లేట్లు కలుసుకునే ఈ మొత్తం 2 వేల కి.మీ. పొడవునా ఎక్కడ ఒత్తిడి తీవ్రంగా పెరిగితే అక్కడ భూకంపం వస్తుంది. ఎక్కడ ఒత్తిడి బాగా పెరుగుతోంది, ఏ సమయంలో ప్రకంపనలు రావొచ్చనే విషయం మనకు తెలియదు. కానీ ఈ ప్రాంతంలో పెను భూకంపం రావడం ఖాయం’ అని రస్తోగీ తెలిపారు.