పాతసిటీ బస్సులతో విసిగిపోయిన పుణేవాసుల సుదీర్ఘ స్వప్నం నెరవేరబోతోంది. పుణేలో మెట్రోరైలు మార్గాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మొదటి విడతలో స్వార్‌గేట్-పింప్రి-చించ్‌వాడ్ మధ్య 16.59 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తారు. 2021 వరకు మొదటి ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. ఈ పనులను పర్యవేక్షించేందుకు ‘పుణే రైలు మెట్రో కార్పొరేషన్ కంపెనీ’ అనే ప్రత్యేక సంస్థను (స్పెషల్ పర్పస్ వెహికిల్) కూడా స్థాపించనున్నారు.
సాక్షి, ముంబై/, పింప్రి, న్యూస్‌లైన్: పుణేవాసులకు శుభవార్త. మెట్రోరైలు మొదటివిడత ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టు పనులకు ఆమోదం లభించిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీంతో పుణేకర్లకు ముంబై, నాగపూర్ మాదిరిగానే మెట్రోరైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో మొదటి విడతలో స్వార్‌గేట్-పింప్రి-చించ్‌వాడ్ మధ్య 16.59 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తారు. ఇందులో కొంతభాగం భూగర్భం నుంచి, మిగతాది ఉపరితలంపై నిర్మిస్తారు. రెండో విడత ప్రాజెక్టులో వనాజ్-రామ్‌వాడి మధ్య 14.92 కిలోమీటర్ల పొడవైన మార్గం నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు తొలివిడత పనులు 2021 వరకు పూర్తికానున్నాయి. ఇందుకు రూ.6,960 కోట్లు ఖర్చవుతాయి.
రెండో విడత పనులకు 2021 వరకు రూ.3,223 కోట్లు ఖర్చవుతాయి. (2021 తరువాత వ్యయం పెరిగే అవకాశాలుంటాయి). ఇలా ఈ ప్రాజెక్టులకు రూ.10,183 కోట్లు ఖర్చవుతాయని అంచనావేశారు. ఈ వ్యయాన్ని పుణే, పింప్రి-చించ్‌వాడ్ కార్పొరేషన్లు 10 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, కేంద్ర ప్రభుత్వం 20 శాతం భరిస్తాయి. మిగతా 50 శాతం నిధులను రుణాల రూపంలో సేకరించనున్నారు. ఇదిలా ఉండగా మెట్రో నిర్మాణ పనులకు మూడు సంవత్సరాల కిందట పుణే కార్పొరేషన్ సర్వసాధారణ సభలో మంజూరు లభించింది.
మెట్రోమార్గాలను భూగర్భంలో నిర్మించాలా లేక ఉపరితలంపై నిర్మించాలా అనే విషయమై వాగ్వాదం మొదలయింది. స్వచ్ఛంద సంస్థలు భూగర్భమార్గాల కోసం పట్టుబట్టాయి. భూగర్భ ప్రాజెక్టులు చాలా ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఉపరితల మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో వనాజ్-రామ్‌వాడి రెండో విడత పనులకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మొదటి విడత పనులకు మంజూరు లభించడంతో రెండో విడతకు కూడా మార్గం సుగమమయింది.
ఈ పనులను పర్యవేక్షించేందుకు ‘పుణే రైలు మెట్రో కార్పొరేషన్ కంపెనీ’ అనే ప్రత్యేక సంస్థను (స్పెషల్ పర్పస్ వెహికిల్) కూడా స్థాపించనున్నారు. ఈ సంస్థ డెరైక్టర్‌ను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. ముంబై మాదిరిగానే పుణేలోనూ రోజురోజుకూ ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతోంది. పాతసిటీ బస్సులతో పుణేకర్లు విసిగెత్తిపోయారు. దీంతో మెట్రో రైళ్లు ప్రవేశపెట్టాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయంతో వారి కలలు త్వరలో నెరవేరనున్నాయి.
నెరవేరుతున్న కల
Published Mon, Sep 30 2013 11:18 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement