
ప్రతి బుధవారం ప్రజలతోనే ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రతి బుధవారం తాను కార్లకు సెలవు ఇచ్చి మెట్రో రైలు లేదా సిటీ బస్సులో ప్రయాణించడం ద్వారా ఇంధన పొదుపుపై దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ సంకల్పించారు. అక్టోబర్ 9 నుంచి ప్రతి బుధవారం తాను కార్యాలయానికి కారులో వెళ్లబోనని, మెట్రో రైలు లేదా సిటీ బస్సులో వెళతానని మొయిలీ శుక్రవారం ప్రకటించారు. ప్రతి బుధవారం ప్రత్యేక వాహనాలను వినియోగించకుండా ప్రజా రవాణా వ్యవస్థ ద్వారానే కార్యాలయాలకు వచ్చి ఇంధనం పొదుపు చేయాలని తన మంత్రిత్వ శాఖ పరిధిలోని 14 ప్రభుత్వ రంగ సంస్థల్లోని అధికారులు, సిబ్బంది అందరికీ మొయిలీ సూచించారు. ఇందులో నిర్బంధం ఏమీ లేదని, స్వచ్ఛందంగా ఇంధనం పొదుపు ఉద్యమంలో పాల్గొనమని కోరుతున్నానని, ఈ మేరకు సర్క్యులర్ జారీ అవుతుందన్నారు.
వాస్తవానికి.. ఇంధన పొదుపుపై ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే లక్ష్యంతో అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు ప్రచారోద్యమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. రూ. 52 కోట్ల ఖర్చుతో ఆరు వారాలపాటు సాగే ఈ ప్రచారోద్యమం ప్రారంభానికి ముందే తాను వారానికోరోజు ఇంధనం పొదుపు పాటిస్తానని మొయిలీ ప్రకటించడం విశేషం. వారానికో రోజు వ్యక్తిగత వాహనాలకు సెల విచ్చి బస్సు ద్వారా ప్రయాణించాలని కోరారు. ఇంధన పొదుపు పాటించడం ద్వారా ఏటా 500 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయాలని దేశ ప్రజలకు మొయిలీ పిలుపునిచ్చారు. గత ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతికి 14వేల కోట్ల డాలర్ల విదేశీ మారద్రవ్యాన్ని వెచ్చించింది. మరే ఇతర అంశంపైనా ఇంత పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యం ఖర్చవడం లేదు. ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేయాల్సిందిగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు మొయిలీ విజ్ఞప్తి చేశారు. నగరాల్లో ఉచిత సైకిల్ పథకాలను ప్రవేశపెట్టి ఇంధన పొదుపునకు దోహదపడాలని పట్టణాభివృద్ధి శాఖకు సూచించారు.
ఢిల్లీలోని మొయిలీ నివాసానికి దగ్గర్లోనే మెట్రో రైలు స్టేషన్ ఉంది. అక్కడి నుంచి సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్‌కు మెట్రో రైలులో వెళితే.. కూతవేటు దూరంలోనే ఆయన కార్యాలయం ఉన్న శాస్త్రి భవన్ ఉంటుంది. సిటీ బస్సులో కూడా కార్యాలయానికి వెళ్లడానికి వీలుంది.