
బ్రేక్ ఫెయిలై సిటీబస్సు బీభత్సం
= కానూరు వద్ద మూడు కార్లు ధ్వంసం
= వాహనాల తనిఖీ సమయంలో ఘటన
= మహిళకు గాయాలు
= ఘటనాస్థలి నుంచి బ్రేక్ ఇన్‌స్పెక్టర్, సిబ్బంది అదృశ్యం
పెనమలూరు, న్యూస్‌లైన్ : కానూరు గ్రామ పరిధి బందరురోడ్డుపై బుధవారం ఉయ్యూరు బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో జరిగిన తొందరపాటు కారణంగా సిటీ బస్సు అదుపుతప్పి మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటన జరగటానికి రవాణా శాఖ అధికారులే కారణమని స్థానికులు తిరగబడటంతో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అక్కడినుంచి పరారయ్యారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. కానూరు కేసీపీ కాలనీ వద్ద కొద్ది రోజులుగా రవాణాశాఖ అధికారులు వాహనాల రికార్డులు తనిఖీ చేస్తున్నారు.
ఇందులో భాగంగా కంకిపాడు నుంచి విజయవాడ వెళుతున్న వాహనాన్ని రవాణా శాఖ సిబ్బంది ఆకస్మికంగా ఆపారు. దీంతో దాని వెనుక ఉన్న రెండు కార్లు కూడా షడన్ బ్రేక్‌వేసి ఆగాయి. వాటి వెనుక కంకిపాడు నుంచి వస్తున్న 150 సిటీ బస్సు బ్రేక్‌లు పడక ఎదురుగా ఆగిన రెండు కార్లను ఢీకొట్టింది. అనంతరం బస్సు అదుపుతప్పి విజయవాడ నుంచి ఎదురుగా వస్తున్న బసవ సతీష్‌రెడ్డికి చెందిన కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో బసవ సతీష్‌రెడ్డి కొత్త మారుతీ కారు ధ్వంసమైంది. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవటంతో అందులో ఉన్న వారికి పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారులో ఉన్న కె.వాణి అనే వృద్ధురాలి తలకు గాయమైంది. ఈ ప్రమాదంతో బందరు రోడ్డుపై మూడు కార్లు అడ్డంగా తిరిగిపోయి బీభత్స వాతావరణాన్ని తలపించింది. దీంతో ఆ మార్గంలో దాదాపు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి.
రవాణాశాఖ అధికారులపై ప్రజల ఆగ్రహం
కాగా ఈ ప్రమాదం జరగటానికి రవాణాశాఖ అధికారులే కారణమని పేర్కొంటూ అక్కడే ఉన్న ఉయ్యూరు బ్రేక్ ఇన్‌స్పెక్టర్ శివకామేశ్వరరావుపై తిరగబడ్డారు. గత కొద్ది రోజులుగా వాహనాల తనిఖీల పేరుతో సొమ్ము దండుకుంటూ వాహన యజమానులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దీంతో ఆయన తన కారును వదిలి చాకచక్యంగా తప్పించుకుని జనాల్లో కలసి మాయమయ్యారు. రవాణాశాఖ సిబ్బంది కూడా అదే పని చేశారు. ఘటనాస్థలి వద్దకు వెళ్లిన ‘న్యూస్‌లైన్’తో అక్కడ ఉన్నవారు మాట్లాడుతూ రవాణాశాఖ అధికారుల కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. కాగా ఈ ఘటనపై కార్ల యజమానులు నగరంలోని మొగల్రాజపురానికి చెందిన బసవ సతీష్‌రెడ్డి, పమిడిముక్కలకు చెందిన కొండవీటి నాని, గుడివాడకు చెందిన గడ్డం మాణిక్యాలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.