బాలంరాయిలో బస్‌షెల్టర్‌లేక ఎండలోనే వేచిచూస్తున్న ప్రయాణికులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో నిలువ నీడ లేని బస్టాపులు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పుడొస్తుందో తెలియని సిటీ బస్సు కోసం గంటల తరబడి చెమటలు పోస్తూ ఎదురుచూడక తప్పడం లేదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో బస్‌షెల్టర్లు లేవు. ప్రయాణికులు ఎక్కడికక్కడ మండుటెండల్లోనే బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకవైపు మార్చి రెండో వారానికే ఎండలు భగ్గుమంటున్నాయి. మరో రెండు నెలల పాటు నగరం నిప్పుల కొలిమిని తలపించనుంది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు సైతం నిప్పుల కొలిమిలో నించొని బస్సుల కోసం ఎదురు చూడక తప్పం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2200 బస్టాపులు ఉంటే కేవలం1000 చోట్ల మాత్రమే షెల్టర్లు ఉన్నాయి. అధునాతన బస్‌షెల్టర్లకు శ్రీకారం చుట్టిన జీహెచ్‌ఎంసీ ముచ్చటగా మూడు ఏసీ బస్‌షెల్టర్లతో ముగించేసింది. ఆ షెల్టర్లలోనూ అరకొర ఏసీ సదుపాయమే. దీంతో సగ టు ప్రయాణికుడికి మండుటెండే బస్‌షెల్టర్‌గా మిగిలింది. ముఖ్యంగా నగర శివార్లలోని అనేక ప్రాంతాల్లో వందలాది బస్టాపుల్లో ప్రయాణికులు ఎండల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది.
పెరుగుతున్న స్టాపులు–తగ్గుతున్న షెల్టర్లు...
నగరం విస్తరిస్తున్న కొద్దీ సిటీ బస్సుల రాకపోకలు కూడా విస్తరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వందల కొద్దీ కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి.ఇదే క్రమంలో బస్టాపుల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ఇందుకు తగినవిధంగా షెల్టర్లు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఒకప్పుడు నగమంతటా కేవలం 1500 బస్టాపులు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 2200 కు పెరిగింది. పైగా ప్రతి సంవత్సరం బస్టాపులు అదనంగా వచ్చి చేరుతున్నాయి. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు మెట్రో రైల్ నిర్మాణ పనుల దృష్ట్యా కొన్ని స్టాపులు ఒక చోట నుంచి మరో చోటుకు మారుతున్నాయి. ఈ క్రమంలో బస్టాపుల సంఖ్యకు అనుగుణంగా షెల్టర్లు మాత్రం పెరగడం లేదు. ఆర్టీసీ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో 2200 బస్టాపులు ఉంటే జీహెచ్‌ఎంసీ లెక్కల్లో మాత్రం 1800 స్టాపులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అధికారుల అంచనా ప్రకారం వెయ్యి చోట్ల షెల్టర్లను ఏర్పాటు చేశారు. కానీ వీటిలోనూ మెట్రో పనులు, రోడ్ల నిర్వహణ, తదితర కారణాల దృష్ట్యా బస్‌షెల్టర్లు మారుతున్నాయి. ప్రజా రవాణా రంగంలో ఇప్పటి వరకు ఆర్టీసీయే అతి పెద్ద సంస్థ. ప్రతి రోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సిటీ బస్సులు రోజుకు 9 లక్షల కిలోమీటర్లకు పైగా తిరుగుతున్నాయి. అయితే ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌కు తగిన ప్రాధాన్యత మాత్రం లభించడం లేదు. దీంతో పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు మండుటెండల్లో మాడిపోతూ ప్రయాణం చేయాల్సి వస్తుంది.
సమన్వయ లేమి...
మరోవైపు జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీల మధ్య సమన్వయ లేమి వల్ల కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2005 వరకు బస్‌షెల్టర్ల నిర్వహణ ఆర్టీసీ పరిధిలో ఉండేది. దీంతో అవసరమైన బస్టాపుల్లో షెల్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు, వాటిపైన వాణిజ్య ప్రకటనల ఆదాయం కూడా ఆర్టీసీకి కొంత ఊరటనిచ్చేది. కానీ షెల్టర్ల నిర్వహణ జీహెచ్‌ఎంసీ పరిధిలోకి మారిన తరువాత ప్రయాణికుల డిమాండ్‌కు, షెల్టర్ల ఏర్పాటుకు మధ్య సమన్వయం లేకుండా పోతోంది. నగరంలోని అన్ని ప్రధానమైన బస్‌షెల్టర్లలో బస్సుల రాకపోకలపైన రూపొందించిన టైమ్‌టేబుల్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ గతంలోనే జీహెచ్‌ఎంసీకి సూచించింది. సుమారు 850 షెల్టర్లను ఎంపిక చేశారు. కానీ జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు 64 షెల్టర్లలో మాత్రమే బస్సుల రాకపోకల సమాచారాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఎప్పుడొస్తుందో తెలియని బస్సు కోసం ప్రయాణికులు నిరీక్షించడం తప్ప మరో గత్యంతరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment