సూరారం కాలనీ బస్టాప్‌లో వెంకటమ్మ మృతదేహం వద్ద తల్లి, కుమారుడు సాయి.. , చితికి నిప్పంటిస్తున్న కుమారుడు సాయి..
సుభాష్‌నగర్: రోజూ పనిచేస్తే గానీ పూట గడవదు.. భర్తలేడు.. తల్లితోపాటు ఏడేళ్ల కుమారుడి పోషణ బాధ్యత కూడా ఆమెదే..ఈ పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైంది. రోజు రోజుకూ ఆరోగ్యం దెబ్బతింటుండటంతో తల్లి, కుమారుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స అనంతరం ఇంటికి రావడానికి డబ్బుల్లేకపోవడంతో నడుచుకుంటూ వస్తున్నారు. అయితే నడిచే శక్తిలేక ఆమె విలవిల్లాడింది. ఒంట్లో శక్తినంతా కూడగట్టుకున్నా ఓపిక లేకపోయింది. దీంతో అక్కడే కనిపించిన ఓ బస్‌స్టాప్‌లోనే నిద్రపోయింది. ఆమెతోపాటు వచ్చిన కుమారుడు, తల్లి కూడా అక్కడే ఉండిపోయారు. తెల్లారింది.. ఇంటికి వెళదామని కుమారుడు అమ్మను నిద్రలేపాడు.. స్పందన లేదు.. అమ్మమ్మకు చెప్పాడు.. ఆమె వెళ్లి చూసినా కళ్లు తెరవలేదు. అనారోగ్యంతో నిద్రలోనే అమ్మ శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిందని ఆ చిన్నారికి అర్థం కాలేదు. మృతదేహాన్ని అక్కడినుంచి తీసుకెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వలేదు.. ఏం చేయాలో అర్థం కాలేదు.
గమనించిన డాక్యుమెంట్ రైటర్ రవీందర్ స్థానికులకు చెప్పాడు. దీంతో కొంత మొత్తం పోగైంది. చివరకు అమ్మ ఫౌండేషన్ సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ హృదయ విదారక సంఘటన కుత్బుల్లాపూర్ పరిధి సూరారం బస్టాప్‌లో జరిగింది. మృతురాలు సుభాష్‌నగర్ డివిజన్ శివాలయనగర్‌కు చెందిన వెంకటమ్మగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment