బంజారాహిల్స్: మానవత్వం మూర్తీభవించింది. నవజీవన యానానికి నాంది పలికింది. అనాథ యువతికి అండ దొరికింది. తనకంటూ ఎవరూ లేరని మనోవేదన చెందే హృదయానికి సాంత్వన లభించింది. మంచి మనసుతో ఓ యువకుడు అనాథ యువతిని వివాహం చేసుకుని గుండెగూటిలో స్థానమిచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ‘మా ఇల్లు ప్రజాదరణ’ అనాథాశ్రమంలో మనీషా అనే యువతి ఆశ్రయం పొందుతోంది. కూకట్‌పల్లిలోని సుజనా ఫోరం మాల్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. కాగా.. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెకు మామిడిపూడి వెంకటరమణయ్య ఫౌండేషన్ ఆశ్రయం కల్పించింది. మనీషా అని పేరు కూడా పెట్టింది. కొద్ది రోజులు అక్కడే ఉండి చదువుకున్న ఆమె ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చింది. మా ఇల్లు అనాథాశ్రమంలో గాదె ఇన్నయ్య పర్యవేక్షణలో డిగ్రీ పూర్తి చేసింది.
గాదె ఇన్నయ్య, పుష్పరాణి దంపతులు తమ ఆశ్రమంలోనే పెరిగి పెద్దదైన మనీషాకు ఉద్యోగం కూడా కల్పించారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆమెకు అపోలో ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న లీలాకృష్ణ సాయితో పరిచయం ఏర్పడింది. ఆమెకు నా అనేవారెవరూ లేరని అతడు తెలుసుకున్నాడు. మనీషాను మనువాడేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించాడు. గాదె ఇన్నయ్య దంపతులు మనీషా తల్లిదండ్రుల పాత్ర పోషించారు. ఈ నెల 24న లీలాకృష్ణసాయితో వివాహం జరిపించారు. వచ్చే నెల 3న సంజీవయ్య పార్కు సమీపంలోని వండర్‌లా పార్కులో నూతన వధూవరుల రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గాదె ఇన్నయ్య తెలిపారు. స్వశక్తితో జీవనం సాగిస్తూ తన జీవిత భాగస్వామిని ఎంచుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్న మనీషాను, అనాథ యువతికి అండగా నిలిచిన లీలాకృష్ణసాయిలను పలువురు అభినందిస్తున్నారు. మానవతా దృక్పథంతో మనీషాను తమ ఇంటి కోడలిగా చేసుకున్న సాయి తల్లిదండ్రులపై సైతంపొగడ్తల జల్లు కురుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment