busstop
-
మొభైల్ బస్‌స్టాప్.. ఎప్పుడూ వెళ్లని ప్రాంతాల్లో బస్సు సౌకర్యం
బెంగళూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... అనేది ఒక కోణం.మరో కోణం ఇది...‘నేను ఒక ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పాటు పనిచేశాను. బస్‌స్టాప్ చేరడానికి కనీసం రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. దీంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది’ అంటుంది రజిని. ‘ఒకరోజు ఏదో ఫంక్షనుకు వెళ్లొస్తుంటే చాలా ఆలస్యం అయింది. ఆ రాత్రి సమయంలో బస్‌స్టాప్ నుంచి నేను ఉండే చోటికి వెళ్లడానికి రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఎంత భయమేసిందో చెప్పలేను’ అంటుంది శ్రీకళ. ‘నేను ఇండ్లలో పనిచేస్తుంటాను. నేను ఉన్న చోట నుంచి బస్‌స్టాప్‌కు రావడానికి అయిదు కిలోమీటర్ల దూరం నడవాలి’ అంటుంది రుక్మిణి. రుక్మిణి, శ్రీకళ, రజని... లాంటి ఎంతోమంది మహిళలు బస్సు ప్రయాణానికి సంబంధించి తాము ఎదుర్కొంటున్న సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఇలాంటి మహిళల విన్నపాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడానికి సృజనాత్మక విధానంలో ఏర్పాటయింది ఈ ట్రావెలింగ్ బస్‌స్టాప్...మరిన్ని సిటీ బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బెంగళూరులోని వివిధ సంఘాలు, కళాకారులు ‘అల్లి సెరోనా’ పేరుతో ఒక వేదికగా ఏర్పడి ‘మొబైల్ బస్‌స్టాప్ ఇన్స్టాలేషన్’ టూర్‌ను ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ బస్‌స్టాప్ బస్సు ఎప్పడూ వెళ్లని ప్రాంతాలకు వెళుతుంది. ఒక ప్రాంతంలో మూడు రోజుల పాటు ఏర్పాటు చేస్తారు. సాధారణ బస్‌స్టాప్ కంటే సృజనాత్మకంగా ఈ హైపర్–క్రియేటివ్ మొబైల్ బస్‌స్టాప్‌ను రూపొందించారు. దీనిలో టికెట్ కౌంటర్, సిట్టింగ్ ఏర్పాట్లు, న్యూస్‌పేపర్ స్టాండ్, వెయిటింగ్ స్పేస్... మొదలైనవి ఉంటాయి.‘చాలామంది మహిళలు బస్‌స్టాప్‌ల కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. ఈ సమస్య గురించి మొబైల్ బస్‌స్టాప్ ఇన్స్టాలేషన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం’ అంటుంది అల్లి సెరోనా క్రియేటివ్ స్ట్రాటజిస్ట్ తనిషా. ‘అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల కోసం ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాం’ అంటున్నారు కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ సురేష్ కాంత.తాము ఉండే ప్రాంతానికి చాలాదూరంగా బస్‌స్టాప్‌లు ఉండడంతో ఎక్కువమంది మహిళలు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బస్సు రాని ప్రాంతాలలో వచ్చేలా ‘అల్లి సెరోనా’తో కలిసి పనిచేస్తోంది మల్లిక. ఇప్పుడు ఉన్న బస్‌స్టాప్‌లు అరకొర సౌకర్యాలతో ఉన్నాయి, కొన్ని నామమాత్రంగా మాత్రమే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ట్రావెల్లింక్ బస్‌స్టాప్ ఇన్స్టాలేషన్’ రూపంలో డ్రీమ్ బస్ స్టాప్‌కు రూపకల్పన చేసింది అల్లి సెరోనా. ‘ఈ మొబైల్ బస్‌స్టాప్‌లో ఉన్నట్లే అన్ని బస్‌స్టాప్‌లలో బాగా వెలుతురు ఉన్న లైట్లు, సీసీ కెమెరాలు ఉండాలి. రాత్రివేళల్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఇది ఎంతో ఉపయోగం’ అంటుంది రుక్మిణి. ఈ మొబైల్ బస్‌స్టాప్ ఇన్స్టాలేషన్ పుణ్యమా అని మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్లో కదలిక మొదలైంది. చిన్న రూట్స్‌లో కూడా బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. -
బస్సెక్కాలంటే ఎండలో ఉండాల్సిందే..!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో నిలువ నీడ లేని బస్టాపులు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పుడొస్తుందో తెలియని సిటీ బస్సు కోసం గంటల తరబడి చెమటలు పోస్తూ ఎదురుచూడక తప్పడం లేదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో బస్షెల్టర్లు లేవు. ప్రయాణికులు ఎక్కడికక్కడ మండుటెండల్లోనే బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకవైపు మార్చి రెండో వారానికే ఎండలు భగ్గుమంటున్నాయి. మరో రెండు నెలల పాటు నగరం నిప్పుల కొలిమిని తలపించనుంది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు సైతం నిప్పుల కొలిమిలో నించొని బస్సుల కోసం ఎదురు చూడక తప్పం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2200 బస్టాపులు ఉంటే కేవలం1000 చోట్ల మాత్రమే షెల్టర్లు ఉన్నాయి. అధునాతన బస్‌షెల్టర్లకు శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ ముచ్చటగా మూడు ఏసీ బస్షెల్టర్లతో ముగించేసింది. ఆ షెల్టర్లలోనూ అరకొర ఏసీ సదుపాయమే. దీంతో సగ టు ప్రయాణికుడికి మండుటెండే బస్‌షెల్టర్‌గా మిగిలింది. ముఖ్యంగా నగర శివార్లలోని అనేక ప్రాంతాల్లో వందలాది బస్టాపుల్లో ప్రయాణికులు ఎండల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. పెరుగుతున్న స్టాపులు–తగ్గుతున్న షెల్టర్లు... నగరం విస్తరిస్తున్న కొద్దీ సిటీ బస్సుల రాకపోకలు కూడా విస్తరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వందల కొద్దీ కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి.ఇదే క్రమంలో బస్టాపుల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ఇందుకు తగినవిధంగా షెల్టర్లు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఒకప్పుడు నగమంతటా కేవలం 1500 బస్టాపులు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 2200 కు పెరిగింది. పైగా ప్రతి సంవత్సరం బస్టాపులు అదనంగా వచ్చి చేరుతున్నాయి. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు మెట్రో రైల్ నిర్మాణ పనుల దృష్ట్యా కొన్ని స్టాపులు ఒక చోట నుంచి మరో చోటుకు మారుతున్నాయి. ఈ క్రమంలో బస్టాపుల సంఖ్యకు అనుగుణంగా షెల్టర్లు మాత్రం పెరగడం లేదు. ఆర్టీసీ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో 2200 బస్టాపులు ఉంటే జీహెచ్ఎంసీ లెక్కల్లో మాత్రం 1800 స్టాపులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అధికారుల అంచనా ప్రకారం వెయ్యి చోట్ల షెల్టర్లను ఏర్పాటు చేశారు. కానీ వీటిలోనూ మెట్రో పనులు, రోడ్ల నిర్వహణ, తదితర కారణాల దృష్ట్యా బస్షెల్టర్లు మారుతున్నాయి. ప్రజా రవాణా రంగంలో ఇప్పటి వరకు ఆర్టీసీయే అతి పెద్ద సంస్థ. ప్రతి రోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సిటీ బస్సులు రోజుకు 9 లక్షల కిలోమీటర్లకు పైగా తిరుగుతున్నాయి. అయితే ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌కు తగిన ప్రాధాన్యత మాత్రం లభించడం లేదు. దీంతో పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు మండుటెండల్లో మాడిపోతూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. సమన్వయ లేమి... మరోవైపు జీహెచ్ఎంసీ, ఆర్టీసీల మధ్య సమన్వయ లేమి వల్ల కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2005 వరకు బస్షెల్టర్ల నిర్వహణ ఆర్టీసీ పరిధిలో ఉండేది. దీంతో అవసరమైన బస్టాపుల్లో షెల్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు, వాటిపైన వాణిజ్య ప్రకటనల ఆదాయం కూడా ఆర్టీసీకి కొంత ఊరటనిచ్చేది. కానీ షెల్టర్ల నిర్వహణ జీహెచ్ఎంసీ పరిధిలోకి మారిన తరువాత ప్రయాణికుల డిమాండ్‌కు, షెల్టర్ల ఏర్పాటుకు మధ్య సమన్వయం లేకుండా పోతోంది. నగరంలోని అన్ని ప్రధానమైన బస్షెల్టర్లలో బస్సుల రాకపోకలపైన రూపొందించిన టైమ్‌టేబుల్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ గతంలోనే జీహెచ్ఎంసీకి సూచించింది. సుమారు 850 షెల్టర్లను ఎంపిక చేశారు. కానీ జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు 64 షెల్టర్లలో మాత్రమే బస్సుల రాకపోకల సమాచారాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఎప్పుడొస్తుందో తెలియని బస్సు కోసం ప్రయాణికులు నిరీక్షించడం తప్ప మరో గత్యంతరం లేదు. -
వామ్మో..ఆత్మకూరు బస్టాండ్!
కర్నూలు , ఆత్మకూరు: మహాశివరాత్రి పర్వదినం వస్తోం దంటే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీశైల మహాక్షేత్రం. బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు క్షేత్రానికి తరలి వస్తుంటారు. జిల్లా వాసులే కాకుండా కన్నడిగులు సైతం మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్తుంటారు. వీరు ముందుగా ఆత్మకూరు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే వేలాది మంది భక్తులకు అనుగుణంగా ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సరైన సౌకర్యాలు లేవు. ఈ నెల 25 నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆత్మకూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఆత్మకూరులో ఆర్టీసీ డిపో 1972లో ఏర్పడింది. జిల్లాలోనే అత్యధికంగా లాభాలు తెచ్చేదిగా పేరుంది. ప్రతి రోజు ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి 10 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. బస్టాండ్‌లో కుళాయిలు ఉన్నా..వాటిలో మంచి నీరు రాదు. నీటి సమస్య తీర్చేందుకు అధికారులు డిపో ఆవరణలో బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రయాణికులకు దాహం వేస్తే లీటర్ నీళ్ల బాటిల్ రూ.20 చెల్లించి కొనాల్సిందే. నగర పంచాయతీ అధికారులకు ఆర్టీసీ వారు నీటి పన్నులు చెల్లిస్తున్నా..తగినన్ని కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. ట్యాంకర్లతో నీటిని కొని బస్టాండ్‌ను శుభ్రం చేయాల్సి వస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీ ఉన్న సమయంలో నీటి సరఫరా బాగా ఉండేదని, నగర పంచాయతీగా ఏర్పడిన తరువాత ఇబ్బందులు వస్తున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. శివస్వాముల అవస్థలు కఠిన దీక్షతో శివమాల ధరించిన శివస్వాములు ఆత్మకూరు బస్టాండ్‌లో మంచినీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరుకు వచ్చిన శివస్వాములుకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు బస్సు సౌకర్యం లేదు. దీంతో బస్టాండ్ ప్రాంగణంలోనే నిద్రించే పరిస్థితి ఉంది. నేలపైనే శివస్వాములు నిద్రించడంతో పాటు.. మరుగుదొడ్లు కూడా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తగ్గిన సర్వీసులు.. ఆత్మకూరు డిపోలో 600 మందికిపైగా కార్మికులు విధులు నిర్వహించే వారు. దాదాపు 15 సంవత్సరాల పాటు అత్యధిక ఆదాయ డిపోగా గుర్తింపు పొందింది. శ్రీశైల క్షేత్రమేగాక కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు ఇక్కడ నుంచి బస్సుల సౌకర్యం ఉండేది. అయితే 2010 నుంచి ఆదాయం తగ్గడంతో సర్వీసులు తొలగించారు. ఆత్మకూరు నుంచి శ్రీశైల క్షేత్రానికి కేవలం 2 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. అదనపు సర్వీసులు వేయాలని భక్తులు కోరుతున్నా ఆర్టీసీ అధికారుల్లో చలనం లేదు. ‘మరుగు’న పడేశారు బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్ల పరిస్థితి అధ్వాంగా ఉంది. సరైన నీరు లేకపోవడం, దుర్వాసన వస్తుండడం..తదితర కారణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటిని మూసివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లో కుర్చీలు సరిగా లేవు. ప్రయాణికులు మెట్లపైనే కూర్చునే పరిస్థితి నెలకొంది. రాత్రి వేళ శ్రీశైలానికి వెళ్లే బస్సులు ఆత్మకూరులోనే ఉంటున్నాయి. ప్రయాణికులు నిద్రించేందుకు కావాల్సిన సౌకర్యాలు లేవు. దోమల బెడదతో కంటికి కునుకు కరువవుతోంది. ఆత్మకూరు డిపోలో ఉన్న బస్సు సర్వీసులు –69 సిబ్బంది: కండక్టర్లు–110, డ్రైవర్లు–92, గ్యారేజ్‌లో కార్మికులు–40 -
పాపం.. వెంకటమ్మ..!
సుభాష్‌నగర్: రోజూ పనిచేస్తే గానీ పూట గడవదు.. భర్తలేడు.. తల్లితోపాటు ఏడేళ్ల కుమారుడి పోషణ బాధ్యత కూడా ఆమెదే..ఈ పరిస్థితుల్లో అనారోగ్యానికి గురైంది. రోజు రోజుకూ ఆరోగ్యం దెబ్బతింటుండటంతో తల్లి, కుమారుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స అనంతరం ఇంటికి రావడానికి డబ్బుల్లేకపోవడంతో నడుచుకుంటూ వస్తున్నారు. అయితే నడిచే శక్తిలేక ఆమె విలవిల్లాడింది. ఒంట్లో శక్తినంతా కూడగట్టుకున్నా ఓపిక లేకపోయింది. దీంతో అక్కడే కనిపించిన ఓ బస్‌స్టాప్‌లోనే నిద్రపోయింది. ఆమెతోపాటు వచ్చిన కుమారుడు, తల్లి కూడా అక్కడే ఉండిపోయారు. తెల్లారింది.. ఇంటికి వెళదామని కుమారుడు అమ్మను నిద్రలేపాడు.. స్పందన లేదు.. అమ్మమ్మకు చెప్పాడు.. ఆమె వెళ్లి చూసినా కళ్లు తెరవలేదు. అనారోగ్యంతో నిద్రలోనే అమ్మ శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిందని ఆ చిన్నారికి అర్థం కాలేదు. మృతదేహాన్ని అక్కడినుంచి తీసుకెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వలేదు.. ఏం చేయాలో అర్థం కాలేదు. గమనించిన డాక్యుమెంట్ రైటర్ రవీందర్ స్థానికులకు చెప్పాడు. దీంతో కొంత మొత్తం పోగైంది. చివరకు అమ్మ ఫౌండేషన్ సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ హృదయ విదారక సంఘటన కుత్బుల్లాపూర్ పరిధి సూరారం బస్టాప్‌లో జరిగింది. మృతురాలు సుభాష్‌నగర్ డివిజన్ శివాలయనగర్‌కు చెందిన వెంకటమ్మగా గుర్తించారు. -
పేలిన గ్యాస్ సిలిండర్
– దాదాపు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం ఎమ్మిగనూరు రూరల్: కోటేకల్ గ్రామ మలుపు బస్టాండ్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసుకున్న టీ స్టాల్లో శుక్రవారం గ్యాస్ సిలిండర్ పేలింది. గ్రామానికి చెందిన గౌస్‌బాషా బస్టాప్ హైవే దగ్గర టీ స్టాల్, అందులో కిరాణం సరుకులను కూడ పెట్టుకొని నిర్వహిస్తున్నాడు. టీ చేస్తుండగా గ్యాస్ లీకు అవుతున్నట్లు గమనించి లీకును నివారించేందుకు గౌస్ ప్రయత్నించాడు. సమీపంలో ఉన్న వారంతా గమనించి దూరం పురుగులు తీశారు. ఇంతలోనే పెద్ద శబ్దంతో సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి.మంటల తాకిడికి పక్కన ఉన్న రెండు చెట్లు కాలిపోయాయి. పేలిన సిలిండర్ శకలాలు 200 మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి. ఈ ప్రమాదంలో టీ స్టాల్ ఉన్న రూ. 15 వేల నగదు, సరుకులు, వస్తువులు పూర్తిగా మంటల్లో బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దాదాపు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. -
బస్టాండ్‌లో 10 కిలోల గంజాయి స్వాధీనం
వరంగల్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వరంగల్ బస్టాండ్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బస్టాండ్‌లో తనిఖీలు చేపడుతున్న పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని తనిఖీ చేసి అతని వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.