రివర్స్ గేర్ !
సాక్షి,సిటీబ్యూరో : మీరు ఎక్కాలనుకున్న సిటీ బస్సు ఎక్కడుంది..ఎంతసేపటిలో వస్తుంది.. ఇలా సమస్త సమాచారం సిటీ బస్టాప్‌ల్లో ఉంచుతున్నాం అంటూ ఆర్టీసీ అధికారులు కొద్దికాలంగా చెబుతున్న మాటలు..ప్రస్తుతం దానికి భిన్నంగా సాగుతోంది.. ఉన్నట్టుండి బస్సు రద్దయిపోతోంది. తాము ఎక్కాలనుకున్న బస్సు కోసం నిరీక్షించి వెనుదిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రతి రోజు 2.5 లక్షల మంది నుంచి 3 లక్షల మందికి పైగా నగర ప్రయాణికులు సిటీబస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
సకాలంలో బస్సు లభించక, ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. డ్రైవర్లు, కండకర్లు ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరే ఇందుకు కారణమని అధికారులు సెలవిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 29 డిపోలు, సుమారు 4 వేల బస్సులు, 30 వేలకు పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్కులు, తదితర సిబ్బంది ఉన్న అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ గ్రేటర్ ఆర్టీసీ. ఇప్పటికీ ప్రయాణికుడికి చేరువకాలేకపోతోంది.
బస్సులు నడపాల్సిన కండక్టర్లు, డ్రైవర్లు ఆకస్మికంగా విధులకు గైర్హాజరు కావడమే ఇందుకు కారణం. వందలాది మంది ఎడాపెడా సెలవులు వినియోగిస్తున్నారు. దీంతో వేలకొద్దీ ట్రిప్పులు రద్దవుతున్నాయి. సెలవులకు సంబంధించి సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కేవలం ప్రయాణికులకు సదుపాయం అందజేయలేకపోవడమే కాకుండా,ఆర్జిత సెలవులు కోల్పోవడం వల్ల సిబ్బంది సైతం ఆర్థికంగా నష్టపోతారంటూ ప్రచారం చేపట్టింది.
భారీగా రద్దవుతున్న సర్వీసులు...
గ్రేటర్‌లోని 29 డిపోల్లో 3850 కి పైగా సిటీ బస్సులు ప్రతి రోజు 42 వేల ట్రిప్పుల్లో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 1050 రూట్లలో 34 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే, మరోవైపు ఒక్కో డిపోలో పెద్దసంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. సాధారణంగా కండక్టర్లు,డ్రైవర్లకు రేపు చేయాల్సిన విధుల వివ రాలను ఈ రోజే ప్రకటిస్తారు. వారాంతపు సెలవులు, సిక్‌లీవ్‌లు, క్యాజువల్ లీవ్‌లపై వెళ్లిన వాళ్ల వివరాలు సైతం నోటీస్‌బోర్డులలో ప్రదర్శిస్తారు.
కానీ చాలా మంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక సెలవులు తీసుకోవడంతో రోడ్డెక్కాల్సిన బస్సులు డిపోల్లోనే నిలిచిపోతున్నాయి. ఒక్కొక్క డిపోలో 30 నుంచి 50 మంది ఇలా సెలవులపై వెళ్తున్నట్లు అంచనా. దీంతో ప్రతి డిపోలో రోజుకు సగటున 80 నుంచి 100 సర్వీసుల వరకు రద్దవుతున్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల్లో ప్రతి రోజు సగటున 2500 ట్రిప్పులు రద్దవుతున్నాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
బస్సు నడపండి భవిష్యత్తు బాగుంటుంది...
ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యానే కాకుండా సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా అనవసరమైన సెలవులు తీసుకోకుండా బస్సులు నడపాలని కోరుతూ ఆర్టీసీ ప్రచారం చేపట్టింది. సాధారణంగా ప్రతి ఏటా 15 ఆర్జిత సెలవులు ఉంటాయి. సిబ్బంది ఇష్టారాజ్యంగా సెలవులు తీసుకోవడం వల్ల ఈ ఆర్జిత సెలవుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ఆర్జిత సెలవులపై వచ్చే లక్షలాది రూపాయాల ఆదాయాన్ని ఉద్యోగులు కోల్పోతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
ఉదాహరణకు ప్రతి ఉద్యోగి తన ఖాతాలో కనీసం 300 ఆర్జిత సెలవులను జమ చేసుకొంటే అతనికి పదవీ విరమణ తరువాత రూ.8.66 లక్షల ఆదాయం లభిస్తుంది. ఇలా ఆర్జిత సెలవులు పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతుందని, అందుకు సెలవులు తగ్గించుకొని బస్సులు నడపడమే ఏకైక పరిష్కారమని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్యాంపెయినింగ్ ఉద్యోగుల్లో అవగాహన పెంచగలిగితే వారి ఆదాయంతో పాటు, సిటీ బస్సుల ట్రిప్పులు కూడా పెరుగుతాయని ఆర్టీసీ అంచనా.